Read more!

మహాశివుడికి ప్రీతకరమైన ప్రదోష వ్రతం, దీక్ష

 

మహాశివుడికి ప్రీతకరమైన ప్రదోష వ్రతం, దీక్ష

 

ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము.  ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. అయితే అన్నిరోజులలో కలిగే ప్రదోషాలపైకి, మూడు ప్రదోషాలకే ప్రాముఖ్యత ఉంది. అవి, చతుర్థి, సప్తమి, త్రయోదశి లలో కలిగే ప్రదోషాలు. వీటిలో కూడా త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు . 

 

 

ఈ ప్రదోష కాల గణనము ఇలా ఉండును.
ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత తొమ్మిది ఘడియల లోపల చతుర్థి తిథి వచ్చునో, ఆ దినము ప్రదోషము కలుగుతుంది. అలాగే, ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత చతుర్థి రెండు ఘడియలైనా ఉంటే ఆ దినము ప్రదోషము.
ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత పదిహేను ఘడియల లోపల సప్తమి తిథి వచ్చునో, ఆ దినము ప్రదోషము కలుగుతుంది. అలాగే, ఏ దినమైనా  సూర్యాస్తమయము తర్వాత  సప్తమి ఒక్క ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము.
ఏ దినమందు సూర్యోదయము తర్వాత అరవై ఘడియల లోపల త్రయోదశి తిథి వస్తుందో, ఆ దినము ప్రదోషము కలుగుతుంది. అలాగే, ఏ దినమైనా  సూర్యాస్తమయము తర్వాత  త్రయోదశి అర్ధ ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము .
ఈ త్రయోదశీ ప్రదోషము సమయాన్ని యిలాలెక్క కడతారు. సాయంత్రం నాలుగున్నర గంటలనుండీ ఇంచుమించు అర్ధరాత్రి వరకూ ప్రదోషమే. కొందరు సూర్యాస్తమయమునకు ముందర రెండున్నర ఘడియలూ, తర్వాత రెండున్నర ఘడియలూ అంటారు. ( ఒక ఘడియ = 24 నిమిషాలు )

 

 

ఈ ప్రదోష దినము అనధ్యయనము. సర్వ విద్యలకూ గర్హితమైనది . సూర్యాస్తమయ కాలము మనకు తమోగుణ ప్రధానమైనది . ఆ సమయములో ప్రదోషమైతే, కొన్ని అనుష్ఠానములు చేయాల్సిఉంటుంది. మామూలుగా చతుర్థి, సప్తములలో ధ్యానము, గాయత్రీ జపము చేయవచ్చును. ప్రదోష సమయముపై శివుడికొక్కడికే అధికారము గలదు, కాబట్టి శివ పూజ మాత్రమే చేయవలెను అన్నది కొందరి మతము. మామూలుగా ప్రతి పక్షములోనూ ప్రదోషము వస్తుంది. కానీ కృష్ణ పక్షములో చతుర్దశి రోజు మాసశివరాత్రి వస్తుంది. దాని వెనుకటి రోజు  త్రయోదశిలో  మహా ప్రదోష కాల శివపూజ విధించబడినది. శుక్ల పక్షములో కూడా త్రయోదశికి ప్రత్యేకత కలదు. ఆరోజు కూడా శివ పూజనే చేయాలి.

 

 

ప్రదోషమంటే పాప నిర్మూలన అని తెలుసుకున్నాం. మనము రోజూ ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని, మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే, దానికి తగ్గ పుణ్య కర్మలు చేయాలి. ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము. పరమ శివుడు తన ప్రమథగణాలతో కొలువై మన పూజలు అందుకోడానికి సిద్ధంగావుండే సమయమది. మన పాపకర్మల ఫలాన్ని పటాపంచలు చేసి గరళము వలె మింగి,  మనకు సాత్త్విక గుణమును కలిగించి మన కష్టములను తగ్గించును .
ఈ త్రయోదశి శనివారమొస్తే దాన్ని శని త్రయోదశి అనీ, సోమవారమొస్తే దాన్ని సోమప్రదోషమనీ పిలుస్తారు. ఇవి కాక, గురువారమునాడు వచ్చే ప్రదోషము కూడా అత్యంత ప్రాముఖ్యము కలది. అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి అయినా, ఈ మూడు రోజులూ మాత్రము మరింత విశేషమైనవి.

 

 

శని త్రయోదశినాడు చేసిన శివపూజ వలన జాతకములోని శని ప్రభావము కూడా తొలగింపబడుతుంది. శని మహాత్ముడు కర్మలకు ప్రతినిధి అని పిలవబడుతాడు. మన కర్మల ఫలితాన్ని నిర్దేశించి మనకు పాఠాలు నేర్పువాడు ఇతను. అట్టి శని ప్రభావమును కూడా ఈ ప్రదోషపూజతో పోగొట్టుకొనవచ్చును .
సోమ ప్రదోషము నాడు చేసిన పూజ వలన మనసు శుద్ధమై త్రికరణ శుద్ధి కలుగుతుంది. సోమవారము శివుడికి ప్రీతి పాత్రమైనది. ఆరోజు చేసిన శివపూజ సర్వ పాపహరము, సర్వ పుణ్యదము.

 

 

ఇక గురువారము త్రయోదశీ ప్రదోషము వస్తే, ఆనాడు చేసిన పూజ వలన గురు అనుగ్రహము కలిగి, విద్యాబుద్ధులు, సంపదలు కలుగుతాయి. గురువు వాక్పతి, బుద్ధిని ప్రేరేపించువాడు, మరియు ధన కారకుడు. జాతకములో గురు దోషములకు రుద్రారాధన విరుగుడుగా చెప్పడము మనకు తెలిసినదే .
ఈ త్రయోదశీ ప్రదోషమునాడు ఎవరికి వీలైనంతగా వారు, మహాన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకమో, ఏకవార రుద్రాభిషేకమో, లఘున్యాస నమక చమక పఠనమో, ఉత్త పాలతో అభిషేకమో, మారేడు దళములతో అర్చననో, ఏదో ఒకటి చేసి అనంత ఫలము పొందండి. భక్తితో ఉద్ధరిణెడు నీళ్ళు పోస్తే చాలు పొంగిపోతాడు, భోళా శంకరుడు

ప్రదోష ఉపవాసముంటే శివుడు ప్రసన్నుడౌతాడా ?

 

 

ప్రదోష ఉపవాస దీక్షను (ఇక్కడ ఉపవాసమంటే భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తూ ఉండే నిరాహార స్థితి అని అర్థం చేసుకోవాలి) అనుష్ఠించడం ద్వారా, పరమేశ్వరుడి కటాక్షాన్ని పొందవచ్చని ఋషి వాక్కు. అలా పాటించదలిచిన రోజు ప్రాత:కాలమే స్నానం ఆచరించి శుభ్రమైన తెల్లని వస్త్రాలు (లేక కాషాయం మొదలుగునవి) ధరించి, శరీరంలో వివిధ భాగాలలో విభూతిని, రుధ్రాక్ష మాలను ధరించి పరమ పావనమైన పంచాక్షరి మంత్రం ‘ఓ నమ:శివాయ.' శక్తి మేర జపం చేయండి. పద్దతి ప్రకారం తయారు చేయబడిన విభూతి మరియు ధరించిన రుధ్రాక్షమాలలు మన మనో శరీరాలపై అనుకూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇలా రోజంతా శివధ్యానంలో మునిగివుండి సూర్యాస్త సమయంలో స్నానమాచరించి ఇంటిలో పూజ ముగించి శివాలయాన్ని ధర్శించాలి. అయితే రోజంతా భక్తి సాధనలోనే ఉండాలన్న విషయం మీరు మరవరాదు. అన్యచింత లేని భక్తియే ఈశ్వరుడి కరుణ దృఫటి మీపై ప్రసరించేలా చేస్తుంది. కావున గుడికి వెళుతునప్పుడు, వెళ్ళిన తరువాత కూడా శివ మంత్రాన్ని మనసులొ జపిస్తూనే ఉండాలి.