ప్రధాన పురుషేశ్వరః ?
ప్రధాన పురుషేశ్వరః ?
నమో గౌరీశాయ స్ఫటిక దవళాజ్గాయచ నమో,
నమో లోకేశాయ స్తుతవిబుధలోకాయ చ నమః |
నమః శ్రీ కంఠాయ క్షపితపురదైత్యాయ చ నమః
నమః పాలక్షాయ స్మరమదవినాశాయ చ నమః ||
గౌరీశ్వరునికి నమస్కారం, స్ఫటికంలా శుద్ధ ధవళకాంతులతో దీపించే లోకేశునికి, దేవతాసమూహంచే స్తుతింపబడేవానికి, శ్రీ (విషం) కంఠంలో ధరించినవానికి, త్రిపురాసురులను నిర్మూలనం చేసినవానికి, పాలభాగాన నేత్రంగల జ్ఞానమూర్తికి, మన్మథుని మదాన్ని వినాశనం చేసిన శివునికి నమస్మృతులు.
- జగద్గురువు ఆదిశంకరాచార్య
భగవంతునికీ, భక్తునికీ మధ్య బంధాన్ని ఏర్పరచడానికి ఎవరి సాయమూ అవసరంలేదు. సర్వశక్తిమంతుడైన భగవంతుడు సర్వాంతర్యామి. ఎవరు ఏ రూపంలో, ఏ ప్రకారంగా సేవిస్తారో, వారిని ఆ రూపంలో, ఆ ప్రకారంగా అనుగ్రహిస్తాడు. ఈ సృష్టి యావత్తులో వ్యాపించి ఉన్న స్వామిని సగుణ, నిర్గుణ రూపాలలో కొలుచుకుంటుంటాం. ప్రకృతి రహిత బ్రహ్మ నిర్గుణరూపంగా, ప్రకృతి సహిత బ్రహ్మ సద్గుణ రూపంగా చెప్పబడుతోంది. నిరాకార సగుణ బ్రహ్మను పరమేశ్వరునిగా కొలుచుకుంటున్నాం. ఆయనే సర్వవ్యాపి, తానే త్రిమూర్తుల రూపాలను ధరించి సృష్టి, స్థితి, లయలను చేస్తుంటాడు.
ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తే చాలు ఎంతటి కష్టాలైనప్పటికీ తొలగిపోతాయి.
స - సమస్తలోకాలకు ఆదిదేవుడు
మ - పరమజ్ఞానం
శి - మంగళప్రదం
వా - వృషభ వాహనుడు
య - పరమానంద దాయకుడు
శివ అంటేనే ఆశుభాలను తొలగించేవాడని అర్థం. ఆశుభాలను మన దగ్గరకు రానీయకుండా తరిమివేసిన స్వామి, సమస్త శుభాలను మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఆయన శంకరుడు.
న ఏష భగవానీశః
సర్వతత్త్వాది రవ్యయః
సర్వతత్త్వ విధానజ్ఞః
పురుషేశ్వరుడైన ఈశ్వర భగవానుడు, సర్వతత్త్వాలకు ప్రథముడు, అవ్యయుడు, సర్వతత్త్వ విధాజ్ఞుడు
సర్వులకు ఈశ్వరుడు శివుడు. అంటే ఈశ్వరుడు ఆయనే తప్ప, ఆయనకు మరొక ఈశ్వరుడు లేడని అర్థం. అథర్వేద్వంలో 'బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాః సంప్రసూయంతే' అని చెప్పబడింది. అంటే, మూర్తిత్రయానికి శివుడే కారణమని స్పష్టమవుతోంది. బ్రహ్మవిష్ణురుద్రులు సర్వానికి కారణమని అంటున్నప్పుడు. వారికి కూడా కారణం ఈశ్వరుడని చెప్పబడుతున్నాడు. 'శివం' అనే పదానికి మంగళం, శుభం, కళ్యాణం, భద్రం, శ్రేయస్సు అనే అర్థాలు ఉన్నాయి. ఆయన మంగళప్రదాత, మంగళస్వరూపుడు.
'శివ' అంటే పరమేశ్వరుడు 'శివా' అంటే పార్వతి, ఇలా అయ్యవారిలోనే అమ్మవారు ఉంటూ అర్థనారీశ్వరునిగా దర్శనమిస్తున్నాడు. అందుకే 'శివం మూలమిదం జగత్' అని అన్నారు. బ్రహ్మదేవుడు సృష్టిని చేయడానికి ప్రారంభించే ముందు శివుని గురించి తపస్సు చేశాడట. అప్పుడు ప్రత్యక్షమైన శివరూపాన్ని చూసిన బ్రహ్మదేవుడు ఆశ్చర్యచకితుడు అయ్యాడు. ఈశ్వరునిలో సగభాగం పురుషరూపంతో, సగభాగం స్త్రీరూపంతో దర్శనమిస్తూ ఒకే రూపంలో రెండు వేర్వేరు తత్త్వాలు గోచరించాయి. అదే అర్థనారీశ్వర తత్త్వం. అప్పుడు బ్రహ్మదేవునికి విషయం బోధపడింది. తాను చేయబోతున్న సృష్టికి స్త్రీ పురుషులుగా విడిపొమ్మని, ఆ జగతఃపితరులను ప్రార్థించాడు. బ్రహ్మ ప్రార్థనను మన్నించిన శివుడు తనలోని పురుషతత్త్వాన్ని నరునిగా, స్త్రీతత్త్వాన్ని ప్రకృతిగా అనుగ్రహించాడు. అలా దర్శనమిచ్చిన ఆదిదంపతులైన శివపార్వతులే, ఈ సృష్టికి కారకులు. ఆ స్వామి అమ్బికతో కలిసి సాంబుడై, సాంబశివునిగా పూజలు అందుకుంటున్నాడు.
ఆ స్వామి మంగళకరుడు. తాను విషాన్ని మింగి, లోకాలకు అమృతాన్ని పంచిన మహా ఉదారుడు పరమశివుడు. క్షీరసాగరమథన సమయంలో ఉద్భవించిన వాటన్నింటినీ అందరూ స్వీకరించారు. దేవతలంతా అమృతపానం చేశారు. కానీ హాలాహలం పుట్టినప్పుడు మాత్రం దాన్ని స్వీకరించందుకు ఎవరూ ముందుకు రాలేదు. భయంతో పరుగులు తీశారు. సకల లోకవాసులకు ఇహపర సుఖాలను ప్రసాదించే భక్తసులభుడు ఈశ్వరుడు. తాను శ్మశానవాసిగా భిక్షాటన చేస్తూ తన భక్తులను సకల ఐశ్వర్యాలను అనుగ్రహించిన భక్త సులభుడు. ఆచరత్వం, స్థాణురూపం, ఘనీభవించిన శక్తి, విలయ తాండవం, ఆనందతాండవం వంటి రూపాలలో ఆయన దర్శనమిస్తున్నాడు. మనలో సర్వత్రా శివపరమాత్మ నెలకొని ఉన్నాడు. స్వామి లింగరూపంలో దర్శనం ఇస్తుంటాడు. ఇక్కడ 'లిం' అంటే మన చూపులకు కనిపించకుండా ఉన్నదానిని 'గం' (గమయతి) అంటే గుర్తురూపంలో తెలియజేసేది. అందుకే ఆ లింగంలో సమస్త దేవతలూ కొలువై ఉన్నారు.
ఆకాశలింగమిత్యుక్తం
పృథినీ తస్య పీఠికాం
ఆలయస్సర్వ దేవానాం
లయానాత్ లింగముచ్యతే
ఆకాశమనే లింగానికి భూమి పీఠం. సమస్త దేవతలు అందులో ఉన్నారు. అంతా అందులోనే లయమవుతుంది. అందుకే ఏళ్ళ లోకవాసులు ఆ స్వామిని,
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివలింగం ... అంటూ కీర్తిస్తారు.
'ఎవ్వనిచే జనించు, జగమెవ్వని లోపలనుండు లీనమై, ఎవ్వనియందు డిందు' అంటూ కపీశ్వరుడు ఈశ్వరునికి నమస్కారం చేశాడు. ఈశ్వరులకు ఈశ్వరుడు పరమేశ్వరుడు. లంకను జయిచిన రాముడు, తన వ్యక్తిత్వానికి అంటిన పంకిలాన్ని దూరం చేసుకునేందుకై శివపరమాత్మను ఆరాధించాడు. శివకేశవుల తత్త్వం లోకోత్తరమైనది. ఈశ్వరులకు ఈశ్వరుడు, దేవతలకు దైవము అయిన పరమేశ్వరుడు, జాగృద్, సుషుప్త, స్వప్నాలకు అతీతుడు. శివుడు పరిపూర్ణుడు, అన్నీ ఆయనలో ఉన్నాయి. అంతటా ఆయనే నిండి వున్నాడు. శివుడు జ్ఞాని, ఆయన జ్ఞానానికి సంకేతం. స్వామి మూడవకన్ను జ్ఞానానికి ప్రతీక. అటువంటి శివుని ఆరాధించడం జ్ఞానమార్గం. విష్ణువును, ఆయన అవతారాలను పూజించడం భక్తిమార్గం,. మార్గబేధం తప్ప గమ్యం ఒక్కటే.