శివుడి జీవితంలో ఈ 5 విషయాలు జీవితానికి గొప్ప మార్గం  చూపుతాయి..!

 

శివుడి జీవితంలో ఈ 5 విషయాలు జీవితానికి గొప్ప మార్గం  చూపుతాయి..!

 


మహాశివరాత్రి కేవలం ఉపవాసం లేదా పండుగ కాదు.. ఇది ఆధ్యాత్మిక మేల్కొలుపుకు  స్వీయ శుద్ధికి ఎంతో గొప్ప రోజు. ఈ రోజున భక్తులు శివుడిని పూజించడం ద్వారా శివుడి  ఆశీర్వాదాలు పొందడమే కాకుండా, ఆయన జీవితం నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుని జీవితానికి గొప్ప మార్గాన్ని  కూడా పొందవచ్చు. శివుడిని త్రిలోకపతి అని పిలుస్తారు.  సృష్టించేది ఆయనే.. విధ్వంసం చేసి తనలో కలుపుకునేది ఆయనే..  ఆయన ప్రతి లీలలో, ప్రతి రూపంలో, జీవితానికి సంబంధించిన లోతైన సందేశం ఉంటుంది. శివుడి నుండి 5 విషయాలు నేర్చుకుంటే జీవితం ఎంతో బాగుంటుంది.

సహనం,  సమతుల్యత..

శివుడిని త్రికాలదర్శి అని పిలుస్తారు .  భూత, వర్తమాన, భవిష్యత్తు మొత్తం ఆయనకు తెలుసు. అయినప్పటికీ  ప్రతి పరిస్థితిలోనూ సంయమనం  సహనాన్ని పాటిస్తాడు.  జీవితంలో కష్టాలు వచ్చినప్పుడల్లా సహనం కోల్పోకుండా, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోడం,   భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుకోవడం శివుడి నుండి నేర్చుకోవాలి.

సరళత.

శివుని జీవనశైలి చాలా సరళంగా ఉంటుంది. అసలు ఆడంబరాలకు ఎలాంటి తావు ఉండదు. ఆయన పులి చర్మాన్ని మాత్రమే ధరిస్తాడు. మెడలో పాము ఉంటుంది. ఒళ్ళంతా బూడిద ధరించి ఉంటాడు. అయినప్పటికీ ఆయన ఈ సృష్టికే ప్రభువు. సంతోషంగా ఉండటానికి  సంపద లేదా విలాసాలు ఉండవలసిన అవసరం లేదు. నిజమైన ఆనందం, విజయం సరళతలోనే ఉన్నాయి.

కోపం..

శివుడిని 'రుద్రుడు' అని పిలుస్తారు, అంటే  కోపంగా ఉన్నప్పుడు నాశనం చేయగలడు.  కానీ  ఎప్పుడూ కారణం లేకుండా కోపం తెచ్చుకోడు.  ఆయన  కోపంగా ఉన్నప్పుడల్లా అది ఏదో మంచి ఉద్దేశ్యం కోసమే. ఏదో మంచి జరగడానికే అలా రుద్రుడిగా మారతాడు. మనుషులకు కూడా  కోపం సహజం. కానీ దానిని అనవసరంగా ఇతరులపై చూపించే బదులు సరైన విధంగా దాన్ని ఉపయోగించుకోవాలి.

 సమానత్వం,  న్యాయం..

శివుడు ఎవరినీ గొప్పవాడిగా లేదా తక్కువవాడిగా భావించడు. దేవతలకు దేవుడు అయినా.. తన  అనుచరులలో దయ్యాలు, రక్త పిశాచులు, పాములు, గణాలు.. ఇలా  అన్ని రకాల జీవులు ఉన్నాయి.  అయితే ఆయన అన్నింటి పట్ల సమ న్యానం,  అన్నింటిని సమానంగా చూడటం చేస్తాడు. కులం, మతం, సంపద,  పేదరికానికి అతీతంగా మనుషులు మారాలి.  ప్రతి వ్యక్తికి సమాన గౌరవం ఇవ్వాలి. ఈ ఆలోచనే  నిజమైన వ్యక్తింగా,  మంచి వ్యక్తిగా చేస్తుంది.

 త్యాగం..

సముద్ర మథనం సమయంలో హాలాహలం (విషం) బయటకు వచ్చినప్పుడు, అందరు దేవతలు,  రాక్షసులు దానిని తమకొద్దు అంటే తమకొద్దు అని అన్నారు.కానీ శివుడు ఎటువంటి స్వార్థపూరిత ఉద్దేశ్యం లేకుండా దానిని  తీసుకొని ప్రపంచాన్ని రక్షించాడు.  జీవితంలో ఇతరుల సంతోషం, ఇతరులు బాగుండటం  కోసం త్యాగం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, వెనక్కి తగ్గకూడదు. నిస్వార్థ సేవే గొప్ప మతం.

                                *రూపశ్రీ.