శివపూజలో శంఖం ఎందుకు ఉండదో తెలుసా... శివపురాణంలో ఏముందంటే..!

 

శివపూజలో శంఖం ఎందుకు ఉండదో తెలుసా... శివపురాణంలో ఏముందంటే..!

 

 

సనాతన ధర్మంలోని వైదిక ఆచారాలలో శంఖాన్ని చాలా పవిత్రమైనదిగా,  పూజనీయమైనదిగా భావిస్తారు. పూజలో శంఖాన్ని ఉపయోగించడం వల్ల ఆ కుటుంబం, ఆ ఇంట్లో  ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి.  ఆ ఇంటికి అదృష్టం పట్టింది అంటారు కదా.. అలాంటి యోగం ఏర్పడుతుంది. విష్ణు మూర్తిని శంఖు చక్ర గదా హస్తే.. అని కీర్తిస్తారు.  ఆయన ధరించే ఆయుధాలలో శంఖం కూడా ప్రధానమైనది.  ఇక శంఖ ధ్వని చాలా పవిత్రమైనది.  పురాణ గ్రంథాల ప్రకారం  ఈ శంఖం శంఖచూడుడు అనే రాక్షసుడి ఎముకల నుండి ఉద్భవించిందని చెబుతారు. విష్ణుమూర్తికి ఈ  శంఖం అంటే చాలా ఇష్టం.    శంఖాన్ని నీటితో నింపి ఆ నీటిని విష్ణుమూర్తికి అర్పిస్తే విష్ణుమూర్తి   సంతోషిస్తాడు. కానీ శివుని పూజలో శంఖాన్ని ఉపయోగించడం నిషేధం. ఈ కారణంగా, శివపూజలో శంఖం ఉండదు.. అలాగే శంఖంతో నీటిని శివుడికి అర్పించరు.  దీని వెనుక ఒక పురాణగాథ ఉంది. అందమేంటో తెలుసుకుంటే..

శివపురాణం ప్రకారం రాక్షస రాజు దంభుడికి పిల్లలు లేరు. సంతానం కలగాలనే కోరికతో ఆయన విష్ణువు కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమని అడిగుతాడు. దంభుడు చాలా శక్తివంతమైన కొడుకు కావాలని కోరుకున్నాడు.  అతను అడిగినట్టే విష్ణువు వరాన్ని ఇచ్చాడు.  ధంభుడికి ఒక కుమారుడు జన్మించగా  అతనికి శంఖచూడుడు  అని పేరు పెట్టారు.

శంఖచూడు చిన్నవాడైనప్పటికీ బ్రహ్మ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి  తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన బ్రహ్మ దేవుడు అతనిని వరం కోరుకోమని కోరాడు. శంఖచూడుడు దేవతల కంటే శక్తిమంతుడు కావాలని,  దేవతలను ఓడించే  శక్తి  కావాలని తన కోరిక కోరాడు. బ్రహ్మా శంఖచూడుడుకు వరాన్ని ఇచ్చి అతనికి శ్రీ కృష్ణ కవచాన్ని ఇచ్చాడు. దానిని ధరించడం ద్వారా శంఖచూడుడు మూడు లోకాలను జయించాడు.  ధర్మధ్వజుని కుమార్తె తులసిని వివాహం చేసుకోవడానికి కూడా బ్రహ్మదేవుడే   అనుమతి ఇచ్చాడు. ఆయన ఆశీస్సులతో శంఖచూడు, తులసి వివాహం పూర్తయింది.

బ్రహ్మదేవుడి వరం కారణంగా శంఖచూడుడు అహంకారిగా మారి మూడు లోకాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అతని దురాగతాలకు లెక్కే లేదు.  దీంతో విసిగిపోయిన దేవతలు విష్ణువును వేడుకున్నారు.  శంఖచూడుడి దురాగతాలను విష్ణువు ఎదుట మొరపెట్టుకున్నారు.  విష్ణువు స్వయంగా శంఖచూడుడికి అప్పటికే  ఒక వరం ఇచ్చి ఉండటం వల్ల ఈ సమస్యను తీర్చవలసిందిగా  శివుడిని ప్రార్థించాడు. దేవతలను రక్షించడానికి శివుడు యుద్ధానికి నాయకత్వం వహించాడు, కానీ శ్రీ కృష్ణ కవచం,  తులసికి తన భర్త పట్ల ఉన్న భక్తి కారణంగా, శివుడు కూడా శంఖచూడుడిని ఓడించలేకపోయాడు.

శ్రీకృష్ణ కవచం ఉన్నంత వరకు శంఖచూడుడిని ఎవరూ ఓడించలేరని గ్రహించి విష్ణువు బ్రాహ్మణ రూపాన్ని ధరించి, శంఖచూడుడి నుండి శ్రీ కృష్ణ కవచాన్ని మోసపూరితంగా దానంగా తీసుకున్నాడు. దీని తరువాత విష్ణువు స్వయంగా శంఖచూడుడి రూపాన్ని ధరించి శంఖచూడుడి  భార్య తులసి పవిత్రతను విచ్ఛిన్నం చేశాడు. శ్రీ కృష్ణ కవచం నాశనమై, తులసికి తన భర్త పట్ల ఉన్న భక్తి విచ్ఛిన్నమైన తర్వాత శివుడు  తన త్రిశూలంతో శంఖచూడుడిని చంపాడు. అతను చంపబడిన తర్వాత  ఎముకల నుండి ఒక శంఖం బయటపడింది. అందుకే శంఖాన్ని  పవిత్రమైనదిగా భావిస్తారు.  కానీ శంఖం నుండి నీటిని శివుడికి సమర్పించడం నిషేధించబడింది. నేరుగా శివుడే శంఖుచూడుడిని వధించిన కారణంగా శివుడి పూజలో శంఖం ఉండదు.


                                                 *రూపశ్రీ.