Read more!

లక్ష్మీదేవి ఏ స్థానంలో నివాసముంటే ఏ ఫలితం లభిస్తుంది ...

 

లక్ష్మీదేవి ఏ స్థానంలో నివాసముంటే ఏ ఫలితం లభిస్తుంది ...

 

 

మానవులందరికీ ఇష్టమైన దైవం లక్ష్మీదేవి . ఆవిడ అనుగ్రహాన్ని వాంఛించని వారుండరు. అయితే ఆ తల్లి కరుణ పొందినా వినయంతో ఉండేది కొందరైతే అహంకారపూరితులై అష్టకష్టాలు పడేది మరికొందరు . కనుకనే పెద్దలు మానవశరీరంలో ఆ తల్లి ఎక్కడ నివసిస్తే ఏ ఫలితాలొస్తాయో సంకేతరూపంలో తెలియజేశారు. ఈవిషయాన్నే జ్యోతిషశాస్త్ర రీత్యా పరిశీలిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఇప్పుడు పెద్దలు చెప్పిన సూచనలను చూద్దాం.

అమ్మవారు పాదస్థానంలో ఉంటే ఆమానవునకు పెద్దపెద్ద భవంతులు. విలాసవంతమైన గృహాలు లభిస్తాయట.
తొడలలో అమ్మవారి శక్తి ఉంటే ధనసమృద్ధి విశేషంగా కలుగుతుంది.
గుహ్యభాగంలో ఉంటే భార్యాసుఖం, సాంసారిక ఆనందం లభిస్తుంది
రొమ్ముభాగంలో ఉంటే మనోరథాలు శీఘ్రంగా సిద్ధిస్తూ ఉంటాయి.
కంఠభాగంలో ఆతల్లి తేజస్సు ఉన్నప్పుడు ఆభరణ ప్రాప్తి కలుగుతుంది.
ముఖంలో లక్ష్మీదేవి నివాసమై ఉన్నప్పుడు అన్నసమృద్ధి యేకాక అప్రతిహతమైన ఆజ్ఞాశక్తి, మధురమైన కవితాశక్తి పాండిత్యము లభిస్తాయి.

 

 

ఇక ఈ ఆరు స్థానాలూ దాటి తలపైకెక్కిందో ...! వాని దగ్గర నిలబడదు. వివేకహీనుడై దుష్కార్యాలు చేసి తెలివిమాలినతనంతో ఆమె అనుగ్రహాన్ని కోల్పోతాడు. ఈ విషయాన్ని దత్తాత్రేయస్వాములవారు దేవతలకు బోధించివున్నారు. జ్యోతిషరీత్యా పరిశీలిస్తే లక్ష్మీదేవికి సంబంధించిన గ్రహమైన శుక్రుని సంచారంతో పై సంకేతాలు ఖచ్చితంగా సరిపోలుతున్నవి అని జ్యోతిషకారులు చెబుతున్నారు .
జగన్మాత అగు ఆ తల్లి కృపహఠాత్తుగానో, పుట్టుకతోనో మనపై కలుగవచ్చు. పూర్వజన్మలో మనం చేసిన సత్కర్మలో, ఇప్పటి సద్వర్తనమో, మనతల్లిదండ్రులు చేసిన పుణ్యమో దానికి కారణం కావచ్చు. సంపదలను అనుగ్రహించే ఆ తల్లి ఆ సంపదలను సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అని పరిశీలిస్తుంది. ఆ డబ్బు చేరటంతో మదమెక్కి ప్రవర్తిస్తే రాక్షసులలాగానే ఎప్పుడొ ఏమరుపాటున ఆ తల్లిని తలపైకెక్కించుకుని [కళ్ళుకూడా అక్కడే ఉంటాయనే పెద్దలు కల్లునెత్తికెక్కాయిరా అని తిట్టేది ] కానిపనులు చేసి కష్టాలపాలు కాకూడదు . అమ్మదయతో చేరిన ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ధర్మ, కామ, మోక్షాలను సాధించుకోవటానికి జాగ్రత్తగా వినియోగించుకోవాలి