ఉసిరికాయలకు... లక్ష్మీదేవికి ఉన్న సంబంధం ఏమిటి..
ఉసిరికాయలకు... లక్ష్మీదేవికి ఉన్న సంబంధం ఏమిటి!
శ్రీ గణేశాయ నమః
శ్రీ గురుభ్యో నమః
శ్రావణ మాసము లక్ష్మి ఆరాధన విశేషముగా జరుగుతుంది. అయితే ఈ తల్లి ఎవరు? ఆమె తత్త్వం ఏమిటి అనే విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పదకవితా పితామహులైన అన్నమయ్య గారి మాటల్లో చెప్పాలంటే..
శ్రీ మహాలక్మి యట సింగారాలకేమరుదు
కాముని తల్లి యట చక్కదనాలకేమరుదు
సోముని తోబుట్టువుట సొంపుకళలకేమరుదు
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి అని అన్నారు
అందానికే అందం ఆ తల్లి. లోకాలన్నింటిని తన గుప్పిట్లో పెట్టుకుని ఆడించగలిగిన మన్మధుడిని కన్న తల్లి, చంద్రునితో పాటు పుట్టిన తల్లి ఎంతో కోమలంగా, అందంగా ఉంటుంది. చూసే కొద్దీ చూడాలనిపించేలా. హాయిగా, మంగళప్రదంగా ఆ తల్లి దర్శనం అద్భుతం అందర్నీ ఆకర్షిస్తుంది కదా. అందం ఒక్కటేనా....
కళాశాబ్ధి కూతురట గంభీరాలకేమరుదు
తలప లోక మాత యట దయ మరి ఏమరుదు
జలజ నివాసిని యట చల్లదనమేమరుదు
కొలదిమీరా ఈ చూడి కుడుత నాంచారి అంటూ ఆ తల్లి తత్వాన్ని తెలిపారు.
సముద్రుని కూతురు కదా, సముద్రుడంత గంభీరంగా ఉంటుంది... అంతే చల్లటి మనసు, సాగరమంత దయ కూడా ఆ తల్లికి సొంతం అంటున్నారు. ఎక్కడ ఉంది ఇలా అంటే... కాలడి శంకరులు పసివాడుగా ఉన్నప్పుడు ఒకరోజు ఒక ఇంటి ముందుకు వెళ్లి "భవతీ భిక్షామ్ దేహీ " అని ఆ ఇంటి ఇల్లాలిని అడిగారు. చాలా చాలా పేదరాలైన ఆ తల్లి ఇల్లంతా వెతికింది. ఒక్క ఎండిన ఉసిరిక తప్ప మరేమీ దొరక లేదు.
పసివాడైన ఆ శంకరుడిని ఉట్టి చేతులతో పంపలేక, మరేమీ ఇవ్వలేని తన నిస్సహాయ స్థితికి బాధపడుతూ అదే అతని భిక్షా పాత్రలో వేసింది ఆ తల్లి. మనసారా పెట్టిన ఆ భిక్షకు సంతోషించిన ఆ బాల శంకరుడు లక్ష్మి దేవిని ఉద్దేశించి కనకధారా స్తోత్రం చేశారు. అందులో ఒక శ్లోకం లో..
సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదాన వైభవాన్ని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మామేవ మాతరమనిశం కలయంతు మాన్యే
అమ్మ, మా చెడ్డ కర్మలను తీసివేసి, మా పాపాలను తొలగించి, సకల సంపదలు, ఆరోగ్యము, వైభవము ప్రసాదించే దేవతవు నీవే కదా అంటూ కీర్తించారు. అమ్మ సముద్రం అంత పెద్ద, చల్లని మనసుతో చూసి శంకరులకు ఎండిన ఉసిరికాయ దానం చేసిన ఆమెకు పుణ్య ఫలమును అనంతం చేసి జన్మ జన్మలకు, తరతరాలకు దారిద్య్రం తొలిగిపోయేలా బంగారు ఉసిరికల వర్షం కురిపించింది. మనము ఆ దానం చేసే గుణం పెంపొందించుకుని లక్షీ కటాక్షం పొందుదాము. ఆ చల్లని తల్లి నీడలో మనమంతా కూడా హాయిగా ఉండాలని ప్రార్ధిస్తూ..