శ్రీ కూర్మ జయంతి

 

శ్రీ కూర్మ జయంతి

 

 

మంధనాచల ధారణ హేతో, దేవాసుర పరిపాలవిభో 
కూర్మాకార శరీర నమో, భక్తం తే పరిపాలయమామ్. 

కృతయుగంలో దేవ, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలు పెట్టారు.

మందరగిరిని కవ్వంగా, వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగింది. 

ఈ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువు వేడుకున్నారు.

అప్పుడు నారాయణుడు కూర్మరూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం.


శ్రీ కూర్మం 

ప్రపంచంలోనే ఏకైక కూర్మదేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం.

శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధారా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది.

కృతయుగంలో శ్వేతరాజు, అతని భార్య వంశధారల తపస్సుకు, భక్తికి మెచ్చుకున్న కూర్మనాధుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. 

ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ, బ్రహ్మాండ, పద్మ పురాణాలలో వుంది. 


శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. 

మరే దేవాలయంలోను లేనివిధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు.


ఈ స్తంభాలు రెండూ శివ కేశవులకు ప్రతీకలుగా చెప్తారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే. అయినా శివ కేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి. 

ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూలవిరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్టించబడిందట. 

శ్రీ కూర్మంలోని స్వామి వారి పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. 

ఇది అత్యంత విశిష్టమైంది. ఆ స్వామి చేతిలోని సుదర్శనచక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందనీ, అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు.


ఈ గుండంలో స్నానం చేసి ఇక్కడ వున్న విష్ణుపాదాల దగ్గర పిండప్రదానం చేస్తే పితరులకు ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం.

ప్రతి సంవత్సరం మార్చిలో హోళీ పున్నమినాడు పెద్దఎత్తున ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశినాడు స్వామికి కల్యాణోత్సవం, జ్యేష్ట మాసం లో వచ్చే కూర్మ జయంతి నాడు జరిగే ఉత్సవాల్లో పాల్గొంటే సకల సంతోషాలు చేకూరుతాయని పెద్దల ఉవాచ...