పుష్కరాల స్నానంలో పాటించాల్సిన విధులు
పుష్కరాల స్నానంలో పాటించాల్సిన విధులు
పుష్కరాల సమయంలో గురుడు, ఆయనతో పాటుగా సంచారంలో ఉన్న పుష్కరుడే కాదు... ముక్కోటి దేవతలూ పుష్కరనదిలో నివసిస్తారన్నది నమ్మకం. ఇక భౌతికంగా వేలాది, లక్షలాదిమంది భక్తులు స్నానార్థం రావడం ఎలాగూ ఉండేదే! అందుకే అటు దైవశక్తి పట్ల గౌరవానికీ, ఇటు సాటి భక్తుల పట్ల ఆదరానికీ ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా ఎన్నో విధి నిషేధాలను విధించారు పెద్దలు. సంకల్పాలు చెప్పుకోవడం, అర్ఘ్యాలు అందించడం వంటివి చేయనివారు సైతం అందరి మంచినీ దృష్టిలో ఉంచుకుని ఏర్పరిచిన ఈ విధులను పాటించడం శ్రేయస్కరం!
- కడుపు నిండినప్పుడు భగవంతుడు గుర్తుకురాడు కదా! అందుకే పుష్కర స్నానానికి వెళ్లాలనుకునేవారు ముందురోజు రాత్రి ఉపవాసం ఉండటం మంచింది. వీలైతే ప్రాతఃకాలంలో పుష్కర స్నానం చేస్తే మరీ మంచిది.
- స్నానానికి ముందు సంకల్పం చెప్పుకోవడం కుదరకపోతే, కనీసం గోత్రనామాలను చెప్పుకొని, భగవంతుని స్మరిస్తూ మూడుసార్లు మునకలు వేయాలి.
- నగ్నంగా కానీ అర్థనగ్నంగా కానీ స్నానం చేయకూడదు. శరీర పైభాగంలో కూడా పైపంచ వంటి ఆచ్ఛాదనతోనే స్నానం చేయాలంటారు పెద్దలు.
- నదీ ప్రవాహానికి అభిముఖంగా నిలిచి పుష్కర స్నానం చేయాలంటుంది శాస్త్రం. దీని వల్ల మన నుంచి వెలువడే మలినాలు ప్రవాహంతో పాటుగా కొట్టుకుపోతాయి. పైగా నదికి వీపు తిప్పి స్నానం చేయడం అంటే నదీమతల్లిని అవమానించినట్లే!
- నదీస్నానం ముగిసే సమయాన సూర్యుని వైపు తిరిగి, మూడుసార్లు దోసిట్లోకి నీటిని తీసుకుని, అర్ఘ్యాన్ని సమర్పించాలి.
- పుష్కరాలకు వెళ్లే దంపతులు కలిసి స్నానం చేయాలి. కలిసి మూడు మునకలూ వేయాలి.
- స్నాన సమయంలో దంతధావనం చేయడం, ఉమ్మి వేయడం, మలమూత్రాలను విసర్జించడం... వంటి పనులతో నదీమతల్లిని అపవిత్రం చేయడం మంచిది కాదు!
- పుష్కర స్నానం చేసేటప్పుడు తప్పకుండా శిరస్నానం చేయాలి. కానీ జలాలను కలుషితం చేసే సబ్బులను కానీ షాంపూలను కానీ వాడరాదు.
- స్నానానంతరం పొడిబట్టలు కట్టుకుని విభూది కుంకుమలను ధరించిన తరువాతే పూజాది కార్యక్రమాలను సాగించాలి.
- స్నానం చేసిన తరువాత పూజలు, పిండప్రదానం చేయాలనుకునేవారు ముందుగానే పసుపు, పూలు, కుంకుమ, గంధము, విభూది, అగరువత్తులు, కొబ్బరికాయలు, ఆవుపాలు, పెరుగు, నెయ్యి, నల్లనువ్వులు, బియ్యం, విస్తరాకులు, వక్కలు, దర్భలు, రాగిచెంబు, బెల్లం... వంటి సామాగ్రినంతా వెంట తీసుకువెళ్లడం మంచిది.
- స్నానానంతరం నదిని మాతృమూర్తిగా భావిస్తూ పసుపు, కుంకుమ, జాకెట్టు ముక్క సమర్పించడం ఆనవాయితీ. వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్యాకెట్ల పాటున విడువకూడదు.
- పుష్కరాల కోసం వినియోగించే పసుపు, కుంకుమ, గంధము, విస్తకాకులు... అన్నీ కూడా సహజమైనవిగా ఉండేట్లు జాగ్రత్తపడటం మంచిది. వీటి వల్ల నదీజలాలు కానీ పర్యావరణం కానీ కలుషితం కాకుండా ఉంటాయి.
ఇంతేకాదు! పుష్కర స్నాన సందర్భంగా నదిలో ఈత కొట్టడం, బట్టలు ఉతకడం నిషేధమంటున్నారు పెద్దలు. ఇక ప్లాస్టిక్ కవర్లను నీటిలో విడవడం, వ్యర్థాలను నదిలో పారవేడం వంటి పనుల వల్ల పవిత్రంగా ఉండాల్సిన జలాలు కలుషితం అవుతాయని తెలిసిందే! అందుకని ఎక్కడికక్కడ వీలైనంత వరకూ శాస్త్రాన్ని పాటిస్తూ, వీలుకాని వేళ భక్తికి చోటునిస్తూ ఈ పుష్కరస్నానాలని సాగిద్దాం.
- నిర్జర.