కోరికలు తీర్చే కొమరువెల్లి మల్లన్న
కోరికలు తీర్చే కొమరువెల్లి మల్లన్న
తెలంగాణాలోని ఓరుగల్లు ప్రాంతాన్నేలిన కాకతీయ రాజులు శివ భక్తి పరాయణులు. వారు పరమశివుని ఆరాధించటమేగాక, శివునిపట్ల తమ భక్తికి నిదర్శనంగా అనేక శివాలయాలు నిర్మించారు. వారు నిర్మించిన రామప్ప, వెయ్యి స్తంబాల గుడి, వగైరా అనేక ప్రసిధ్ధ శివాలయాలను వరంగల్ జిల్లాలో నేటికీ దర్శించవచ్చు. అలాంటి దేవాలయాలలో ఒకటి కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరువచ్చి, కాలక్రమేణా కొమరవెల్లి అయిందంటారు. పరమ శివుడు ఇక్కడి తన భక్తులను కాపాడటానికి వీరశైవమతారాధకులైన మాదిరాజు, మాదమ్మ అనే దంపతులకు సుతుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని క్షేత్ర పురాణం. తర్వాతకూడా తన భక్తుల రక్షణార్ధం ఇక్కడే కొలువుతీరాడు.
భక్తులచేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జునస్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతి రూపమైన లింగ రూపంలోకాక, గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు. దేవేరులు యాదవ కులానికి చెందిన గొల్ల కేతమ్మ, లింగ బలిజకులానికి చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపులా దర్ళనమిస్తారు. మట్టితో చేసిన ఈ విగ్రహం షుమారు 500 సంవత్సరాల క్రితం చెయ్యబడ్డది.
కాలక్రమేణా భక్తుల రాక మొదలయ్యి, రాను రాను అధికం కావంటంతో దేవాలయంలో వున్న మండపములు విస్తరించబడ్డాయి. సత్రాలు, నూతన కట్టడాలు నెలకొల్పబడ్డాయి. దేవాదాయశాఖవారి ఆధ్వర్యంలో వున్న ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువే. సదా సందడిగా వుండే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కొమరవెల్లి మల్లన్న జాతరగా ప్రసిధ్ధిగాంచిన ఈ బ్రహ్మోత్సవాలు మకర సంక్రాంత్రి తర్వాత వచ్చే మొదటి ఆదివారంనాడు ప్రారంభమై ఉగాదిదాకా సాగుతుంది. ఆ సమయంలో ప్రతి ఆదివారం ఉత్సవాలు, బోనాలు వగైరా సందడిగా జరుగుతాయి. తమకి అండదండగా నిలిచి సదా కాపాడే ఈశ్వరునికి బోనాలు సమర్పించి ఆయనకు కృతజ్ఞతులు తెలుపుకుంటారు. ఈ ఉత్సవాలలో స్వామిపట్ల భక్తులకుగల భక్తిప్రత్తులకు నిలువెత్తు అద్దం పట్టినట్లు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు.
జాతర సమయంలో భక్తులను విశేషంగా ఆకర్షించే ఇంకొక వేడుక పెద్ద పట్నం. ఇది శివరాత్రి రోజున జరుగుతుంది. భక్తులు ఆలయం ముందు ముగ్గు వేసి, భగవంతుని కీర్తిస్తూ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తారు. అలాగే జాతర మొదటి రోజు, చివరి రోజు జరిగే అగ్ని గుండాలు, అంటే నిప్పుల మీద నడవటం, భక్తి శ్రధ్ధలతో చాలా ఉత్సాహంగా జరుగుతాయి.
స్వామి ఆలయానికి కొంచెం దూరంలోనే కొండపై రేణుకా దేవి వున్నది. ఈవిడ మల్లికార్జున స్వామికి సోదరిగా భావించి భక్తులు జాతర సమయంలో ఈవిడకి కూడా బోనాలు సమర్పిస్తారు. జాతర జరిగే సమయంలో ఆదివారాలు ఆ ప్రాంతమంతా బోనాలు సమర్పించే భక్తులతో నిండిపోయి వుంటుంది. పసుపు కుంకుమలతో అందంగా అలకరించిన పాత్రలపై దీపం వెలిగించి తలపై పెట్టకుని స్వామికి, రేణుకా దేవికి బోనాలు సమర్పించటానికి వరుసగా కొండపైకి ఎక్కే భక్తుల బారులు చూడటానికి రెండు కళ్ళూ చాలవు. రాత్రి 7 గం. ల దాకా మాత్రమే సాగే ఈ బోనాల ఉత్సవాన్ని చీకటి పడ్డాక కొండ కిందనుంచి చూస్తే బారులు తీరిన దీపాలు కదులుతున్నట్లు అందంగా వుంటుంది ఆ దృశ్యం.
ఆలయం ఎదురుగా వున్న బండి చక్రాలు (రధం ఆకారంలో వున్న కట్టడం) స్వామి రధంగా భావించి పూజిస్తారు భక్తులు. బోనాలు, అగ్ని గుండాలు వగైరా సంబరాలన్నీ ఇక్కడే జరుగుతాయి.
మల్లికార్డునస్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీ రేణుకాచార్య ఉపాలయం వున్నది. శ్రీ రేణుకాచార్య వీరశైవ మత స్ధాపకులు, ప్రచారకులు.
ఈ ఆలయానికి 20కి.మీ. ల దూరంలో గ్రామ దేవత కొండ పోచమ్మ ఆలయం వుంది. ఈవిడ మల్లికార్జున స్వామి అక్కగా చెప్తారు. స్వామిని జాతర సమయంలో దర్శించి, ఆదివారం బోనాలు సమర్పించిన భక్తులు కొండ పోచమ్మ ఆలయానికి చేరుకుని, ఈ తల్లిని కొలిచి, మంగళవారంనాడు బోనాలు సమర్పిస్తారు. ఈ ఆలయం చిన్నదే అయినా, అమ్మవారు తనని నమ్మినవారిని చల్లగా కాచే అమిత శక్తి స్వరూపిణి.
దేవస్ధానంవారు భక్తుల సౌకర్యార్ధం వివిధ సేవలకోసం ఆన్ లైన్ లో రిజర్వు చేసుకునే సౌకర్యం కల్పించారు.
మార్గము: వరంగల్ కి 110 కి.మీ., సిధ్ధిపేటకి 22 కి.మీ, హైదరాబాదునుంచి 90 కి.మీ. ల దూరంలో వున్నది కొమరవెల్లిలోని ఈ ఆలయం. కొమరవెల్లి గ్రామం వరంగల్ జిల్లా, చేర్యాల మండలంలో వున్నది. సికిందరాబాదు, వరంగల్, హనుమకొండ, సిధ్ధిపేట, వేములవాడనుంచి బస్ సౌకర్యం వున్నది. హైదరాబాదు నుంచి కరీంనగర్ వెళ్ళే రాజీవ్ రహదారిలో, హైదరాబాదునుంచి షుమారు 90 కి.మీ. లు వెళ్ళాక కుడి వైపు కమాను కనబడుతుంది. దాన్లోంచి 4 కి.మీ. లు వెళ్తే కొమరవెల్లిలో కొండపై గుహలో కొలువైన శ్రీ మల్లికార్జునుని చేరుకోవచ్చు.
.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)