కార్తీక పూర్ణిమ రోజు ఈ పనులు చేయండి..అంతా శుభమే..!

 

 

కార్తీక పూర్ణిమ రోజు ఈ పనులు చేయండి..అంతా శుభమే..!

 


హిందూ క్యాలెండర్ లో కార్తీక మాసానికి,  కార్తీక పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంది.  సాధారణంగానే ప్రతి మాసంలో వచ్చే పూర్ణిమ సందర్బంగా ఏదో ఒక ప్రత్యేకత ముడిపడి ఉంటుంది.  ఇక ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పూర్ణిమ మరింత విశిష్టమైనది.  కార్తీక పూర్ణిమ అంటే చాలా మందికి కార్తీక దీపాలు వెలిగించడం మాత్రమే తెలుసు.. మరికొందరు దేవాలయాలు సందర్శించి దేవుడి దర్శనం చేసుకుంటారు. అయితే కార్తీక పౌర్ణమి రోజు   అయిదు పనులు చేస్తే.. కార్తీక మాసం అంతా ఆ పనులు చేసిన పుణ్యం లభిస్తుందని అంటున్నారు.


గంగాస్నానం..


కార్తీక మాసంలో స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంది.  కార్తీక స్నానాల పేరిటి ఇవి ప్రాచుర్యం పొందాయి కూడా.  కార్తీక మాసంలో నదులు,  కాలువలు,  కుదిరితే సముద్ర స్నానం.. కుదరని వారు కనీసం ఇంట్లోనే జీవనదులను ఆవాహన చేసే మంత్రం చెప్పుకుని ఇంట్లోనే చన్నీటి స్నానం చెయ్యాలని అంటుంటారు. అధికశాతం మంది వీటిని పాటిస్తారు కూడా. కార్తీక పౌర్ణమి రోజు అయినా నదీ స్నానం చేయాలని అంటున్నారు.  ఈ స్నానం వల్ల తెలిసో తెలియకో చేసిన పాపాలు నశిస్తాయని నమ్ముతారు. గంగాస్నానానికి వెళ్లలేని వారు ఇంట్లోనే గంగాజలాన్ని నీటిలో కలిపి స్నానం చేస్తే మంచిది.


ఉపవాసం..

కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజించడం మంచిది.  చాలామంది కార్తీక మాసం అంటే కేవలం పరమేశ్వరుడికి ప్రీతి కరం అని అనుకుంటారు.  కానీ హరిహరులకు ఇద్దరికీ కార్తీక మాసం ప్రీతికరమే..  ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే చాలా మంచిది.  కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి,  విష్ణువును పూజించి,  విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఎంతో పుణ్యం.


దీపదానం..

కార్తీక మాసంలో దీపాలు వెలిగించడమే కాదు.. దీపదానం చేయడం వల్ల కూడా పుణ్యం వస్తుంది. ఇందుకోసం ఇళ్లలో,  ఆలయాలలో, నదీ ఒడ్డున దీపాలు వెలిగించడమే కాకుండా దీపాలు దానం ఇవ్వాలి.  బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. ఇలా చేయడం వల్ల జీవితంలో చీకట్లు తొలగి వెలుగు సంతరించుకుంటుందని చెబుతారు.


విష్ణువు ఆరాధన..

హరిహరులకు కార్తీక మాసం ప్రీతికరం అని చెప్పుకున్నట్టే.. వాటిని పాటించాల కూడా.  విష్ణువును పూజించడం, విష్ణువు ఆలయాన్ని సందర్శించడం, విష్ణు సహస్రనామ పారాయణ గొప్ప ఫలితాన్ని ఇస్తాయి.  అలాగే "ఓం నమో భగవతే వాసుదేవాయ" లేదా "ఓం శ్రీ విష్ణువే నమః" వంటి మంత్ర జపం చేయడం వల్ల అంతా మంచే జరుగుతుంది.  విష్ణువు ఫొటో లేదా విగ్రహానికి తులసిని సమర్పించడం వల్ల విష్ణువు సంతోషిస్తాడు.  తులసి,  పువ్వులు, గంధం, అగరొత్తులు.. ఇలా అన్నీ సమర్పించి పూజించాలి.

దానం..

కార్తీక పౌర్ణమి రోజు చేసే దానం బోలెడు రెట్ల ఫలితాన్ని ఇస్తుంది.  ఈ రోజు పేదలకు, బ్రాహ్మణులకు బట్టలు, ధాన్యం, నీరు, ఇతర అవసరమైన వస్తువులు దానం ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే దీపదానం,  ఉసిరికాయ దానం వంటివి ఇవ్వడం కూడా మంచిది. ఇవే కాకుండా ఆవులకు ఆహారం పెట్టడం, ధాన్యం తినిపించడం మరింత పుణ్యం.


                                          *రూపశ్రీ.