Read more!

కార్తీక వ్రతం చేయకుంటే 'అంధతామిత్ర' నరకం

 


కార్తీక వ్రతం చేయకుంటే 'అంధతామిత్ర' నరకం

  Karthika Puranam – 14

 

అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి''మహామునీ! నేను చాలా పాపాత్ముణ్ణి. ఆకలితో అన్నానికి వచ్చిన నిన్ను ఇబ్బందిపెట్టిన మందభాగ్యుణ్ణి. అయినా నాయందు దయతో తిరిగి అతిథిగా వచ్చావు. దయచేసి విందుభోజనం చేసి నా దోషాలన్నిట్నీ ఉపశమింపచేయి'' అని ప్రార్ధించాడు.

దూర్వాసుడు అంబరీషుని తన బాహువులతో లేవనెత్తి ''రాజా! ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడడి నాకు పితృసమానుడివి అయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కానీ, బ్రాహ్మణుడనూ, తాపసిని, నీకంటే పెద్దవాడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే గానీ మేలు చేయదు. అందువల్ల నీకు నమస్కరించడంలేదని అర్ధం చేసుకో. నేను నిన్ను కష్టపెట్టాను. అయినా నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు. నీవంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయడం మహద్భాగ్యం'' అంటూ అతని ఆతిధ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహత్య ప్రకటనార్ధం పరీక్షకునిగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తికావడంతో తన ఆశ్రమానికి తరలివెళ్ళాడు.

 కనుక కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశినాడు దానాదులతో క్షీరాబ్ది ద్వాదశి వ్రతం నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి ఘడియలు దాటకుండా పారణం చేయడంవల్ల అన్ని పాపాలూ అంతరించిపోతాయి. ఈ పుణ్యగాధను చదివినా, చదివించినా, రాసినా, విన్నా కూడా ఇహలోకంలో సర్వ సౌఖ్యాలూ పొంది పరంలో మోక్షాన్ని పొందుతారు.

 సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని, శౌనకాది ఋషులు ''అయ్యా! కలియుగ కల్మషగతులు, రాగాది పాశయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకు సునాయాసంగా లభించే పుణ్యం ఏది? అన్ని ధర్మాల్లోనూ అధికమైంది ఏది? దేవతలందరిలోకీ దేవాదిదేవుడు ఎవరు? దేనివల్ల మోక్షం కలుగుతుంది? మోహం ఎలా నశిస్తుంది? జరామృత్యు పీడితులు, జడమతులు అయిన ఈ కలికాల ప్రజలు తేలిగ్గా బయటపడే మార్గం ఏమిటి?'' అనడిగారు.

''మంచి ప్రశ్నలు అడిగారు. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడంవల్ల వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించిన, పుణ్యనదుల్లో స్నానం చేసిన, అనేక యజ్ఞయాగాదులు నిర్వహించినంత పుణ్యం లభిస్తుంది. ఇంతవరకూ నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైంది. విష్ణుమూర్తికి ఆనందం కలిగించే కార్తీక వ్రతమే ఉత్తమధర్మం. సర్వ శాస్త్రాలనూ వివరించి చెప్పేందుకు నేను సమర్ధుడినీ కాను, సమయమూ చాలదు. కనుక అన్ని శాస్త్రాల్లోనూ ఉన్న సారాంశాన్ని చెప్తాను, వినండి.

విష్ణుభక్తిని మించింది లేదు. విష్ణుగాథలను వినేవాళ్ళు విగత పాపులౌతారు. నరకం చేరరు. హరి ప్రీత్యర్ధులుగా స్నాన, దాన, జప, పూజా, దీపారాధనలు చేసేవారి పాపాలన్నీ వాటికవే పటాపంచలై పోతాయి. సూర్యుడు తులారాశిలో ఉండే నెలరోజులూ కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించేవాళ్ళు జీవన్ముక్తులౌతారు. కార్తీక వ్రతం చేయనివాళ్ళు కుల మత వయో లింగ భేద రహితంగా ''అంధతామిత్రం'' అనే నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీనది స్నానం చేసినవాళ్ళు దేవతలచే కీర్తించబడతారు. విష్ణులోకాన్ని చేరతారు. కార్తీక స్నానం చేసి విష్ణు అర్చన చేసినవారు వైకుంఠాన్ని పొందుతారు. ఈ వ్రతాచరణ చేయనివాళ్ళు వేయిసార్లు చండాల జన్మల పాలవుతారు.

సర్వ శ్రేష్టము, హరిప్రీతిదాయకం, పుణ్యకరం అయిన ఈ వ్రతాచరణ దుష్టులకు లభించదు. సూర్యుడు తులారాశిలో ఉండగా, కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవారు సర్వదుఃఖ విముక్తులై మోక్షం పొందుతారు. దీపదానం, కంచుపాత్ర దానం, దీపారాధన, ధన, ఫల, ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య ఫలప్రదాలు. సర్వ సంపదలూ లభిస్తాయి. పుణ్యాత్ములౌతారు. ఇన్ని మాటలెందుకు? విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణ వల్ల ఇహపర సుఖాలు రెండూ కలుగుతాయి.

కార్తీకం నెలరోజులూ కార్తీక మహత్యాన్ని విన్నా, పారాయణం చేసినా కూడా సకల పాపాలూ నశించిపోతాయి.

Karthika Puranam Epic Stories, Punya and mukti with Karthika Puranam, Durvasa Maharshi in Karthika Puranam, Vishnumurthy and Karthika Puranam