Read more!

కార్తీకంలో పితృ తర్పణం

 

కార్తీక మహా పురాణం పద్దెనిమిదవ రోజు

కార్తీకంలో పితృ తర్పణం Karthika Puranam – 18

నారదుడు చెప్పింది అంతా విన్న పృథువు ''ఓ దేవర్షీ! కార్తీకమాస గొప్పదనాన్ని వివరించి నన్ను ధన్యుని చేశావు. అలాగే స్నానాది విధుల్ని, ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయ''మని కోరగా, ఇలా చెప్పసాగాడు.

 ''మహారాజా! ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించాలి.

 ''ఆయుర్బలం యశోవర్చః ప్రజాః పశువసూనిచ |

బ్రహ్మప్రజ్ఞాం చ మేధాం చ త్వన్నో దేహి వనస్పతే ||

అనే మంత్రాన్ని పఠిస్తూ దంతధావనం చేసుకోవాలి. క్షయ తిధుల్లోనూ, ఉపవాస దినాల్లోనూ పాడ్యమి, అవావాస్య, నవమి, పక్ష, సప్తమి, సూర్యచంద్ర గ్రహణాలు - తదితర వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ళ చెట్లు, పత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం మొదలైన చెట్ల పుల్లలతో దంత ధావనం చేసుకోకూడదు.

దంతధావనం తర్వాత భక్తిగా నిర్మలబుద్ధితో గంధ పుష్ప తాంబూలాలు గ్రహించి శివాలయానికి గానీ, విష్ణు ఆలయానికి గానీ వెళ్ళి అర్ఘ్య పాద్యాది ఉపచారాలు ఆచరించి, స్తోత్ర నమస్కారాలు సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలు చేయాలి. ఆలయాల్లో గాయకులు, వర్తకులు, తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులులను విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వారపరంలో దానం భగవత్ ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన ఒక్కటే భగవంతునికి సంతోషాన్ని కలిగిస్తుంది.

హరిహర దుర్గా గణేశ సూర్యారాధనలకు ఉపయోగించకూడని పుష్పాలు

దిరిసెన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగ, జిల్లేడు, కొండగోగు మొదలైన పుష్పాలు, తెల్లటి అక్షతలు విష్ణువును పూజించడానికి పనికిరావు. అలాగే మహాశివుని పూజకు జపాకుసుమాలు, మొల్ల పుష్పాలు, దిరిసెన పూలు, బండి గురువింద, మాలతీ కుసుమాలు పనికిరావు.

ఎవరైతే సిరిసంపదలు కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు తులసీదళాలతో వినాయకుని, గరికతో దుర్గాదేవిని, అవిసె పూలతో సూర్యుని పూజించకూడదు. ఏయే దేవతలకు ఏయే పుష్పాలు శ్రేష్ఠమైనవో, వాటితోనే పూజించాలి. అలా పూజిస్తూ

 ''మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర |

 యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

 ''దేవా! మంత్ర క్రియాదిక లోపభూయిష్టమైనప్పటికీ, ఈ పూజ నీకు పరిపూర్ణమైనది అగుగాక'' – అంటూ క్షమాపణ కోరుకోవాలి. తర్వాత దైవానికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి, పునః క్షమాపణ చెప్పుకుని నృత్య గానాది ఉపచారాలతో పూజ పూర్తిచేయాలి.ఎవరైతే కార్తీకమాసంలో రోజూ రాత్రి శివపూజ లేదా విష్ణుపూజ చేస్తారో వాళ్ళు సమస్త పాపాల నుంచి విడివడి వైకుంఠాన్ని చేరతారు.

''రాజా! ఇంకా వివరంగా చెప్తాను, విను. వ్రతస్తులు మరో రెండు ఘడియల్లో తెల్లవారుతుందనగా నిద్ర లేచి, శుచియై నువ్వులు, దర్బలు, అక్షతలు, సుమాలు, గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి. చెరువులో గానీ, దైవ నిర్మిత జలాశయాల్లో గానీ, నదిలోగానీ, సాగరసంగమాల్లో గానీ స్నానం చేస్తే ఒకదాని కంటే ఒకటి పదిరెట్ల పుణ్యం వస్తుంది. ఏ పుణ్యతీర్ధంలో స్నానం చేసినా అంతకు పదిరెట్ల ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువును స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలు ఇవ్వాలి.

అర్ఘ్య మంత్రం

  నమః కమలనాభాయ నమస్తే జలశాయినే |

నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే ||

 అలా అర్ఘ్యాలు ఇచ్చి, దైవ ధ్యాన నమస్కారాదులు చేసి ''ఓ దామోదరా! ఈ జలంలో స్నానం చేయబోతున్నాను. నీ అనుగ్రహం వల్ల నా పాపాలన్నీ నశించిపోవును గాక! హే రాధారమణా! విష్ణూ! కార్తీక వ్రత స్నాతుని అవుతున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించు'' అని ప్రార్ధించాలి.

స్నానవిధి

వ్రతస్తులు ఇలా గంగ, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి, మొలలోతు నీటిలో దిగి, యధావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతో యతులు తులసిమొక్క పాదులో ఉన్న మట్టితోనూ స్నానం చేయాలి. విదియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య తిథుల్లో నువ్వులు, ఉసిరికాయలతో స్నానం చేయకూడదు.

ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి, ఆ తర్వాతే మంత్ర స్నానం చేయాలి. ''భక్తిగమ్యుడై ఎవరు దేవకార్యార్ధం త్రిమూర్తి స్వరూపుడయ్యాడో సర్వ పాపహరుడైన ఆ విష్ణువు నన్ను ఈ స్నానంతో పవిత్రుని చేయుగాక! విష్ణు ఆజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలు నన్ను పవిత్రుని చేయుగాక!

యజ్ఞ మంత్ర బీజ సంయుతాలైన వేదాలు, వశిష్ట కశ్యపాది మునివర్యులు నన్ను పవిత్రుని చేయుగాక. గంగాది సర్వ నదులు, తీర్ధాలు, జలధారలు, సప్త సాగరాలు నన్ను పవిత్రుని చేయుగాక. ముల్లోకాల్లోని అరుంధత్యాది పతివ్రతామ తల్లులు యక్ష, సిద్ధ, గరుడాదులు, ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగాక'' - అనుకుంటూ స్నానం చేసి, దేవ, ఋషి, పితృ తర్పణాలను విధిగా చేయాలి.

కార్తీకమాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడుస్తారో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు. ఈ తర్పణ తర్వాత నీటి నుండి తీరానికి చేరి ప్రాతః కాల అనుష్ఠానం పూర్తిచేసి, విష్ణు పూజ చేయాలి. తర్వాత

 

అర్ఘ్య మంత్రం

ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధి నామ |

గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయా సహితో హరే ||

అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని, క్షేత్ర తీర్ధ దైవాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేద పారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు

  తీర్ధాని దక్షిణే పాదే వేదాస్త న్ముఖ మాశ్రితాః |

సర్వాంగేష్వాశ్రితాః దేవాః పూజితోసిమదర్చయా ||

''కుడి పాదంలో సర్వ తీర్ధాలు, ముఖంలో చతుర్వేదాలు, అవయవాల్లో సర్వ దేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వల్ల పరిత్రుణ్ణి అవుతున్నాను'' అనుకోవాలి. అటుమీదట వ్రతస్తులు హరి ప్రియమైన తులసికి ప్రదక్షిణ చేసి, ''దేవతల నుండి వచ్చి, మునుల పూజలు అందుకుని, విష్ణు ప్రేయసివైన ఓ తులసీ! నీకు చేస్తున్న నమస్కారం నా పాపాలను నాశనం చేయుగాక'' – అనుకుని నమస్కరించుకోవాలి.

పిమ్మట స్థిర బుద్ధితో హరికథ, పురాణ శ్రవణాదుల్లో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో, వాళ్ళు తప్పనిసరిగా దైవలోకం వెళ్తారు. సమస్త రోగహరణం, పాపమారకం, సద్బుద్ధిదాయకం, పుత్రపౌత్ర ధనప్రదం, ముక్తికారకం, విష్ణుప్రీతికరం అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో వేరొకటి లేదు.

Karthika Puranam Epic and Punya, Karthika Puranam Epic and Mukti, Karthika Puranam Arghya Mantra, Karthika Puranam Snana Vidhi, River Bath in Karthika Masam, Bilwashtakam