కార్తీకమాసంలో ఇక్కడ స్నానం అద్భుత ఫలితాన్నిస్తుంది!

 

కార్తీకమాసంలో ఇక్కడ స్నానం అద్భుత ఫలితాన్నిస్తుంది!

దీపావళి పండుగతో మాసం ముగింపుకు వస్తుంది. అది అయిపోగానే కార్తీకమాసం ప్రారంభమవుతుంది. కార్తీకమాసానికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. కార్తీక స్నానం, కార్తీక దీపాలు, శివాభిషేకాలు, పూజలు అన్నీ మార్మోగిపోతాయి శివాలయాలలో.

కార్తీక మాసం స్నానానికి పెట్టింది పేరు సూర్యుడు తులారాశిలో ఉండే కార్తీకం లో ఆవు గిట్టలు దిగిన గుంట లోని నీటిలో కూడా శ్రీమహావిష్ణు ఉంటాడు అంటారు. మహావిష్ణువు అవతారమే తిరుమల తిరుపతిలో వెలసిన వేంకటేశ్వరుడు. ఈ విషయం అందరికీ తెలుసు. అటువంటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ వెంకటేశ్వర స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం చెప్పటానికి కూడా మాటలకు అందని అంత పుణ్యం వస్తుంది. 

శాస్త్రాల్లో ఉత్తమమైంది ఏదంటే వేదం. అలాగే  సర్వదేవతల్లో ఉత్తముడు శ్రీహరి ! ఆయనే ఏడుకొండల మీద స్వామి శ్రీవేంకటేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. సకల తీర్థాల్లో పరమపావనమైన తీర్థం తిరుమలలో ఉన్న  శ్రీ స్వామి వారి పుష్కరిణి. తిరుమల పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠంగా ప్రసిద్ది పొందింది.  ఆ దివ్య క్షేత్రములో నెలకొన్న కోనేరును స్వామి పుష్కరిణి అంటారు అందుకే "కోన్+ఏరు"తమిళంలో "కోన్" అనగా దేవుడు "ఏరు" అనగా చెరువు అదే కోనేరు అందుకే శ్రీనివాసుని కోనేటి రాయుడు అని కూడా అంటారు.

స్వామి పుష్కరిణి మనసారా స్మరిస్తే చాలు సకల పాపాలు తొలగిపోతాయి తిరుమల కొండమీది కోనేటిని కనులారా దర్శిస్తే చాలు మనసులో కోరుకున్న కోరికలు సిద్ధిస్తాయి. స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే చాలు బ్రహ్మహత్య వంటి సకల పాతకాలు నశిస్తాయి. నరక భయం పోతుంది సంపదలు సిద్ధిస్తాయి సకల పాపాలు పోతాయి. తిరుమల మీద ఉన్న శ్రీ స్వామి పుష్కరిణి మహత్యాలు ఎన్నో, మహిమలు ఎన్నోన్నో ఆ కోనేటి గొప్పదనం ఇంతింతని చెప్పటం అసాధ్యం అవి అనంతం గొప్ప అద్భుతం కూడా.

స్వామి పుష్కరిణిలో స్నానం చేయటం, సద్గురువు పాదసేవ దొరకటం, ఏకాదశి వ్రతం ఆచరించటం అనే మూడు పవిత్ర కార్యాల్లో ఒక్కటంటే ఒక్కటైనా కలగటం ఎంతో అదృష్టం. అందులోనూ ఒకేసారి ఈ మూడు కార్యాలు సిద్ధించడం ఎంతటి అద్భుత భాగ్యమో చెప్పటం అసాధ్యం. అంతేకాదు కాదు మనిషిగా పుట్టడం మానవత్వంతో జీవించటం ఈ జన్మలోనే స్వామి పుష్కరిణిలో స్నానం చేసే భాగ్యం కలగడం ఈ మూడు అత్యంత దుర్లభములు అని చెబుతారు పురాణ పండితులు. ఈ మూడు పనులుగొప్ప పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే దక్కుతాయి. 

అందుకే తిరుమల క్షేత్రంలో ఉన్న పుష్కరినికి అంత ప్రత్యేకత వచ్చింది. ఆ పుష్కరిణిలో స్నానం చేయడం ఎంతో పవిత్రమని, అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ పుష్కరిణి స్నానం తప్పకుండా చేసి తీరతారు. అలాంటి గొప్ప పుష్కరిణిలో కార్తీక స్నానం చేయడం ఎనలేని పుణ్యఫలాన్ని ఇస్తుంది. అందుకే ఈ మాసంలో తిరుమలకు భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది.

                                       ◆ నిశ్శబ్ద.