లక్ష్మీదేవి కటాక్షం కోసం రోజుకు మూడుసార్లు ...

 

లక్ష్మీదేవి కటాక్షం కోసం రోజుకు మూడుసార్లు ...

 

 

 

 

అజ్గం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృంగాగనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః

మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ చెట్టుకు ఆడుతుమ్మెదలు ఆభరణమైనట్లు, పులకాంకురముల తోడి శ్రీహరి శరీరమును ఆశ్రయించినదియు, సకల ఐశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి యొక్క క్రీగంటిచూపు నాకు శుభములు ప్రసాదించు గాక!

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్సలేయా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః

పెద్దనల్లకలువపై నుండు ఆడు తుమ్మె దవలె శ్రీహరి ముఖమునందు ప్రేమ లజ్జలచే ముందుకు వెనుకకు ప్రసరించుచున్న సాగర సంజాతయైన ఆ లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షము నాకు సంపదను ప్రసాదించుగాక!

ఆ మీలితాక్ష మధిగమ్య  ముదా ముకుందం
ఆనందకంద మనిమేష మనజ్గ తంత్రం
అకేకర స్థిత కనీనిక పష్మనేత్రం
భూత్యై భవే నమ్మ భుజజ్గ శయాజ్గనాయాః

నిమీలిత నేత్రుడును, ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషముతో గూడుటచే, రెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, రెప్పలును గలదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగునుగాక

భాహ్యాంతరే మధుజిథ శ్రితికౌస్తుభే య
హరావలీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయః

భగవంతుడగు శ్రీహరికిని కామప్రదయై, అతని వక్షస్థలమందలి కౌస్తుభమున ఇంద్రనీలమణిమయమగు హారావళివలె ప్రకాశించుచున్న కమలాలయఅగు లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభమును చేకూర్చుగాక

కాలంబుదాలి లలితోరసి కైటభారే:
దారా ధరేసురటి యా తటిజ్గనేవ
మాతుస్సమస్త జగతాం మహనీయ మూర్తి:
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః

కారుమబ్బులపై తోచు మెరుపుతీగ వలె నీలమేఘశ్యాముడగు విష్ణుదేవుని వక్షస్థలమందు ప్రకాశించుచున్న, ముల్లోకములకును తల్లియు, భార్గవ నందనయు అగు ఆ లక్ష్మీదేవి నాకు శుభముల నిచ్చుగాక

ప్రాప్తం పదం ప్రధమతఃఖలు యత్ప్రభావాత్
మాజ్గల్యభాజి మధుమాధిని మన్మధేన

మయ్యాపతేత్తదిహ మంధర మీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః

ఏ క్రీగంటి ప్రభావమున మన్మథుడు మాంగల్యమూర్తియగు మధుసూదనుని యందు ముఖ్యస్థానమును ఆక్రమించెనో అట్టి క్షీరాబ్ది కన్య అగు లక్ష్మీదేవి యొక్క మండమగు నిరేక్షము నాయందు ప్రసరించుగాక

విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్ష
మానందహేతు రధికం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు మయిక్షణ మీక్షణార్థ
మిందీవరోదర సహోదర మిందిరాయాః

సమస్త దేవేంద్ర పదవినీయగలదియు, విష్ణువు సంతోషమునకు కారణమైనదియు, నల్లకలువలను పోలునదియు అగు లక్ష్మీదేవి కటాక్షము నాపై నిలిచియుండునుగాక!

 

 

 


ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః

పద్మాసని అయిన లక్ష్మీదేవి దయార్థ దృష్టివలననే విశిష్టమతులగు హితులు సులభముగా ఇంద్రపదవిని పొందుచున్నారు. వికసిత కమలోదర దీప్తిగల ఆ దృష్టి, కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక

దద్యాయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిసౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః

శ్రీమన్నారాయణుని దేవి అయిన లక్ష్మీదేవి దృష్టియనెడు మేఘము దయావాయు ప్రేరితమై, నా యందు చాలాకాలముగా ఉన్న దుష్కర్మ తాపమును తొలగించి, పేదవాడననెడి విచారముతో ఉన్న చాతకపు పక్షి అగు నాపై ధనవర్ష ధారను కురిపించునుగాక

గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యైః

వాగ్దేవత (సరస్వతి) అనియు, గరుఢధ్వజ సుందరి అనియు, శాకం బరియనియు, శశిశేఖర వలభాయనియు పేరు పొందినదియు, సృష్టిస్థితిలయముల గావించునదియు, త్రిభువనములకు గురువైన విష్ణుదేవుని పట్టమహిషియగు లక్ష్మీదేవికి నమస్కారము.

ఆ మీలితాక్ష మధిగమ్య  ముదా ముకుందం
ఆనందకంద మనిమేష మనజ్గ తంత్రం
అకేకర స్థిత కనీనిక పష్మనేత్రం
భూత్యై భవే నమ్మ భుజజ్గ శయాజ్గనాయాః

నిమీలిత నేత్రుడును, ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషముతో గూడుటచే, రెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, రెప్పలునుగలదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగునుగాక

శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్యైనమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై

పుణ్య కార్యముల ఫలమునొసగు శ్రుతిరూపిణియు, సౌందర్యగుణ సము ద్రయగు రతిరూపిణియును, పద్మనివాసియగు శక్తిరూపిణియు అగు లక్ష్మీదేవికి నమస్కారము.

నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై

పద్మమును పోలిన ముఖము గలదియు, క్షీరసముద్ర సంజాతయు, చంద్రునికిని-అమృతమునకును తోబుట్టువును, నారాయణుని వల్లభయునగు లక్ష్మీదేవికి నమస్కారము.

నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్గ్ఙయుధ వల్లభాయై

బంగారు పద్మము ఆసనముగా గలదియును, భూమండలమునకు నాయికయైనదియును, దేవతలలోదయమే ముఖ్యముగా గలదియును, విష్ణువుకు ప్రియురాలునుయైన లక్ష్మీదేవికి నమస్కారము.

 

 

 


నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై

భృగుమహర్షి పుత్రికయును, విష్ణు వక్ష:స్థలవాసినియు, కమలాలయము, విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము.

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై

తామరపువ్వులవంటి కన్నులు గలదియు, దేదీప్యమానమైనదియు, లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలునగు లక్ష్మీదేవికి నమస్కా రము.

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే

పద్మములవంటి కన్నులగల పూజ్యురాలవగు నోయమ్మా! నిన్ను గూర్చి చేసిన నమస్కృతులు సంపదలు కలగించునవి, చక్రవర్తిత్వము నొసగగలవి, పాపములను నశింపచేయునవి. ఓ తల్లి అవి ఎల్లప్పుడును నన్ను అనుగ్రహించుగాక!

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే

ఏదేవియొక్క కటాక్ష వీక్షణమున సేవకులకు సకలార్థ సంపదలు లభించునో, అట్టి మురారి హృదయేశ్వరియగు లక్ష్మీదేవిని... నిన్ను మనో వాక్కాయములచే త్రికరణశుద్ధిగా సేవింతును.

సరసిజనయనే సరోజ హస్తే
ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం

కమలముల వంటి కన్నులు గల ఓ తల్లి చేతియందు పద్మమును ధరించి, తెల్లని వస్త్రము, గంధము, పుష్పమాలికలతో ప్రకాశించుచున్న భగవతీ! విష్ణుప్రియా!, మనోజ్ఞులారా!, ముల్లోకములకు సంపదను ప్రసాదించు మాతా! నన్ననుగ్రహింపుము.

దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం

దిగ్గజములు కనకపు కుంభములతో తెచ్చిన వినిర్మల ఆకాశ జలములచే అభిషేకించ బడిన శరీరము గలదియు, లోకములకు జననియు, విశ్వ్రపభువగు విష్ణుమూర్తి గృహిణియు, క్షీరసాగర పుత్రియునగు లక్ష్మీదేవికి నమస్కరించుచున్నాను.

కమలే కమలాక్ష వల్లబే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మా మకించనానాం
ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః

శ్రీహరి వల్లభురాలివైన ఓ లక్ష్మీదేవి! దరిద్రులలో ప్రథమస్థానంలో ఉన్నాను. నీ దయకు తగిన పాత్రమును అగునన్ను నీ కరుణా కటాక్షముతో చూడుము.

స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికా గురుతర భాగ్యభాజినో
భవంతి తే భువి బుధ భావితాశయాః

ఎవరీ స్తోతములచే ప్రతిదినమును వేద రూపిణియు, త్రిలోక మాతమునగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు విద్వాంసులకే భావితాశయులై, గుణాధికులై అత్యంత భాగ్యశాలురగుచున్నారు.

సువర్ణ ధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యఃపథేన్నిత్యం స కుబేరసమోభవేత్
ఆదిశంకరాచార్యులు రచించిన కనక ధారాస్తోత్రమును ప్రతిదినము త్రికాలమందు పఠించువారు కుబేరునితో సమానులగును.