కళుగోళ శాంభవీ దేవి ఆలయం
కళుగోళ శాంభవీ దేవి ఆలయం
ఇవాళ చెప్పుకోబోయే ఆలయం కావలిలోది. కావలి పేరు తెలుగువారందరికీ సుపరిచితమే. తెలుగు రాష్ట్రావతరణకి కారకులైన స్వర్గీయ పొట్టి శ్రీరాములుగారి ఊరది. నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణం జిల్లాలో రెండవ పెద్ద పట్టణం. ఈ పట్టణాన్ని మొదట్లో కనక పట్టణం అని పిలిచేవారు. క్రీ.శ. 1515 లో ఉదయగిరి రాజు హరిహరరాయలు తమ సైన్యాన్ని కాపలా కోసం ఇక్కడ వుంచాడు. అప్పటినుంచీ ఈ ప్రదేశం పేరు కావలి (కాపలా) అయింది. బంగాళాఖాతానికి 8 కి.మీ. ల దూరంలో వున్న ఈ పట్టణం హోల్ సేల్ బట్టల వ్యాపారానికి, వ్యవసాయానికే కాదు, పురాతన ఆలయాలకి కూడా ప్రసిధ్ధి చెందింది. వాటిలో ఒకటి కావలివాసుల ఆరాధ్య దైవం కళుగోళ శాంభవీ దేవి ఆలయం. కళుగోళ శాంభవీ దేవి ఆలయం గురించి వివరాలు ఎక్కువగా తెలియకపోయినా, ఈ ఆలయంలో వున్న అమ్మవారి శాసనం ప్రకారం, ఈ తల్లి సుమారు 500 సం. ల క్రితం కావలి మండలంలోని సర్వాయపాలెం గ్రామంలో రైతు రామిరెడ్డిగారి కుటుంబంలో రాగుల బుట్టలో వెలిసిందట.
కళుగోళ శాంభవీ దేవి గ్రామంలో వారికి స్వప్నంలో కనిపించి తాను పార్వతీ అంశ అయిన శాంభవీ దేవిననీ, తనని కోడి కూత, రోకటి పోటు వినబడని దూర ప్రాంతంలో ప్రతిష్టించమని చెప్పింది. సర్వాయపాలెం గ్రామ పెద్దలు, అక్కడికి 3 కి.మీ. ల దూరంలో వున్న కావలి గ్రామ పెద్దలు సంప్రదించుకుని, కావలి పట్టణానికి పడమటివైపు, అప్పట్లో కీకారణ్యంలా వుండే ఈ ప్రదేశంలో అమ్మవారిని ప్రతిష్టించారు. నిత్య పూజలేకాక, పర్వ దినాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. 12 సంవత్లరాలకొకసారి తిరునాళ్ళు జరుగుతుంది. ఈ తిరణాలకి లక్షమంది పైగా ప్రజలు హాజరవుతారు. ఇక్కడ జంతు బలులు కూడా జరుగుతాయి. అందుకని అర్చకులుగా విశ్వ బ్రాహ్మణ కుటుంబంవారిని, అష్టోత్తర, సహస్రనామ, వగైరా నిత్య పూజలకు బ్రాహ్మణ పూజారులను నియమించారు. అత్యంత మహిమాన్వితురాలైన ఈ దేవి పార్వతీ దేవి అంశ అని ప్రతీతి. మహా మహిమాన్వితమైన తల్లిగా, భక్తుల పాలిట కల్పవల్లిగా కావలి వాసులకు అత్యంత ప్రియమైన దేవతగా పూజలందుకుంటున్నది. కావలిలో ఏమి చూడాలని ఎవరిని అడిగినా, ముందుగా చెప్పిన ఆలయం పేరు ఈ అమ్మదే.
ఆలయ నిర్మాణం:
ఆలయం ఈ ప్రాంతంలో మాత్రమే దొరికే బొంతరాయితో నిర్మింప బడిన బలిష్టమైన ఆలయం. ఆలయం లోపల ప్రదక్షిణ మార్గంలో అష్టాదశ శక్తి పీఠాలు, దుర్గామాత స్వరూపాలు తెలిపే అందమైన, రంగు రంగుల విగ్రహాలు, వినాయకుడి ఉపాలయం వున్నాయి. గర్భాలయంలో కొలువు తీరిన కళుగోళ శాంభవిని దర్శించినంతనే భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతాము.
గ్రామాలలో కొలువుతీరి, గ్రామస్ధుల పూజలందుకుంటున్న చల్లని తల్లుల ఆలయాలు అవకాశం వున్నప్పుడు తప్పక దర్శించండి. గ్రామస్ధులకు ఆ దేవతలమీద వున్న విశ్వాసం, భక్తి ప్రపత్తులు గమనించండి.
....పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)