నవరాత్రులు మొదటి రోజు త్రిపురాంతకం వాసి శ్రీ బాలాత్రిపురసుందరి
నవరాత్రులు మొదటి రోజు త్రిపురాంతకం వాసి శ్రీ బాలాత్రిపురసుందరి
ఇవాళ్టినుంచీ శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి. దేవీ ఆరాధన బాలా త్రిపురసుందరితో మొదలవుతుంది కదా. బాలా త్రిపురసుందరీదేవి చిదగ్నికుండంనుంచి ఉద్భవించిందని చెప్పబడుతుంది. ఈ దేవి ఇక్కడ ఉద్భవించటమేకాదు, త్రిపురాసురులను సంహరించటంలో మహా శివుడికి సహాయం చేసి, ఆయనతో సహా కొలువైన ప్రదేశమే ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం. మహిమాన్వితమైన ఈ క్షేత్రం పూర్వం అనేక అద్భుతాల సమాహారం. ప్రస్తుతం ఈ అద్భుతాలన్నీ కధలుగా చెప్పుకున్నా, మన దేశంయొక్క గొప్పదనం కొంతయినా తెలుసుకోగలుగుతాము. అందుకే దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకుందామా?
అతి పురాతనమైన పుణ్యక్షేత్రం శ్రీశైలానికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలలాగా నాలుగు పుణ్య క్షేత్రాలున్నాయని చాలామందికి తెలిసేవుంటుంది. వాటిలో తూర్పువైపువున్న ద్వారం ఈ త్రిపురాంతక క్షేత్రము. అంతేకాదు, శ్రీశైల క్షేత్రానికన్నా ఈ క్షేత్రం పురాతనమైనదని వేద, పురాణ, శాసనాధారాలవల్ల తెలుస్తోంది. పూర్వం రవాణా సౌకర్యాలు సరిగా లేని సమయంలో యాత్రలు చేసేవారు ఇలాంటి క్షేత్రాలలో ఆగి, దైవ దర్శనం చేసుకుని కొంత సేదతీరి తిరిగి ప్రయాణం సాగించేవారు.
ఇక్కడవున్న శాసనాల ఆధారంగా పూర్వం ఈ క్షేత్రం అత్యంత వైభవోపేతంగా విలసిల్లినదని తెలియవస్తున్నది. శైవ సిధ్ధాంతం విలసిల్లిన ఈ క్షేత్రంలో అనేక విద్యాలయాలు వుండి, విద్యార్ధులకు అనేక విషయాలు బోధించేవారు. రసాయన విద్య, యోగ విద్య ఈ క్షేత్రంలో ఎక్కువగా వుండేవి. అనేకమంది యోగులు, సిధ్ధులు ఇక్కడ తమ సాధన చేసుకునేవారు. అలాంటివారిలో కొందరు ఇప్పటికీ రాత్రివేళ శివ పార్వతులను సేవించి వెళ్తారని, వారిని చూసిన తపస్సంపన్నులు వున్నారనీ చెబుతారు. అంతేకాదు ఈ క్షేత్రంలో అనేక దివ్యౌషధాలున్నాయని రసరత్నాకర మొదలగు గ్రంధముల ద్వారా తెలుస్తోంది. ఈ కొండలలో సంజీవనీ మూలిక వున్నదని కూడా కొందరు నమ్ముతారు.
మరి ఇంత విలక్షణమైన క్షేత్రంలో విలసిల్లే శ్రీ బాలా త్రిపురసుందరి ఆలయ దర్శనం చేసుకుందామా? శ్రీ బాలా త్రిపురసుందరి ఆలయంలోని గర్భగుడే ఆ తల్లి ఆవిర్భవించిన చిదగ్నికుండం. ఇక్కడివారు దీనిని నడబావి అంటారు. అమ్మవారి గర్భగుడికి వెళ్ళాలంటే 9 మెట్లు దిగాలి. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ఆవరణకి ప్రతీక. ఈ మెట్లకి అధిదేవత, ప్రత్యధిదేవతలున్నారు. ఈ మెట్లు దిగిన తర్వాత చిదగ్ని కుండంలో బిందు స్ధానంలో శ్రీ బాలా త్రిపురసుందరి విరాజిల్లుతోంది. ఆవిడ ఇక్కడ నిర్గుణ శిలాకారంలో ఉద్భవించింది. అయితే సామాన్యులు పూజించటానికి వీలుగా ఈ తల్లి ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఉద్భవించిన అమ్మవారికి, ప్రతిష్టించిన అమ్మకి మధ్య బాలా యంత్రం వుంది. అయితే ముందు అమ్మవారి విగ్రహం అడ్డు రావటంతో ఉద్భవించిన అమ్మవారు ఇవతలనుంచి మనకి కనబడదు.
స్కాంద పురాణంలో శ్రీ శైలఖండంలో ఈ క్షేత్ర ప్రస్తావన వున్నది. అందులో ఈ దేవిని దేవతాగ్రణి అని ప్రశంసించారు. ఈ తల్లిని నూట ఒక్క శక్తులు నిరంతరం సేవిస్తూ వుంటాయని కూడా ఇందులో వున్నది.
గర్భగుడికి ఎదురుగా వున్న మండపములో శ్రీ చక్రమున్నది. భక్తులందరూ ఇక్కడ పూజలు చేస్తారు. ఈ మండపంలోనే శివ లింగం కూడా వున్నది. ఈ స్వామికి ప్రతి రోజూ అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. ఈ మండపం దాటి బయటకురాగానే, ఒక చిన్న మండపంలో శ్రీ ఛిన్నమస్తాదేవిని దర్శించవచ్చు. ఈమె తన తలని చేతితో పట్టుకుని కొంచెం భీకరంగా వుంటుంది. ఈవిడ అమ్మవారి సర్వసైన్యాధ్యక్షురాలట. ఈవిడని ఆరాధిస్తే సకల సంపదలు, మంచి పాండిత్యం కలుగుతాయట.
పూర్వం ఇక్కడ జంతుబలులు వుండేవి. దీనికి నిదర్శనంగా 1/2 అడుగు లోతు, 2 అడుగుల వ్యాసంకల రాతి రక్త పాత్ర ఆలయం లోపలకి వెళ్ళేటప్పుడు కుడి పక్కన కనబడుతుంది. అక్కడ ఎన్ని దున్నపోతులను బలి ఇచ్చి, ఆ రక్తాన్ని, దానితోబాటు నీటినీ ఆ రక్త పాత్రలో పోసినా అది ఎప్పుడు నిండేది కాదుట. ఇది ఇక్కడి విశేషం అంటారు.
అమ్మవారి ఆలయం బయట, చెరువు కట్టమీద కదంబ వృక్షాలున్నాయి. దేవిని కదంబ వనవాసిని అని కీర్తిస్తారు. కదంబ పుష్పాల పూజ ఆవిడకి అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే ఈ చెట్టు కింద కూర్చుని ఆ తల్లిని ఉపాసించినా, సామాన్యులు లలితా సహస్రనామం, త్రిశతి వంటివి పారాయణ చేసినా అమిత ఫలాన్ని పొందుతారంటారు.
వర్షాకాలంలో అమ్మవారి విగ్రహం, ఆలయంలో చాలా భాగం వర్షపు నీటితో మునుగుతాయి. అప్పుడు అమ్మ పూజకి అంతరాయం రాకుండా బయట (అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు ముందే కనబడుతుంది) ఒక చిన్న ఆలయంలో కూడా అమ్మవారిని ప్రతిష్టించారు. ఈవిడని అపరాధేశ్వరి, లేక బయట బాలమ్మ అంటారు. ఆలయం నీట మునిగిన సమయంలో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు.
ఈ ఆలయానికి కొంచెం దూరంలోనే ఆది శైలము అనే పర్వతము వున్నది. కుమారస్వామి తారకాసురుణ్ణి వధించిన తర్వాత కొంతకాలం ఇక్కడ వున్నాడని ఈ పర్వతాన్ని కుమారగిరి అనసాగారు. తారకాసురుని కుమారులే తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు. వీరు తండ్రి మరణానికి పరితపించి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షం కాగా వారికి చావు వుండకూడదని వరమడుగుతారు. బ్రహ్మ జన్మించినవారికి మృత్యువు తప్పదని, ఏదో ఒక విధంగా మృత్యువునంగీకరించాలని చెప్పగా వారు తాము మూడు పురములు కట్టుకుని ఆకాశంలో తిరుగుతూ వుంటామని, ఆ మూడు పురములు వరుసగా ఒకే చోటికి చేరినప్పుడు ఒకే బాణంతో ఆ పురాల్ని ఛేదించినవారి చేతిలో మాత్రమే మాకు మృత్యువు కలగాలని వరం కోరుకున్నారు. బ్రహ్మ తధాస్తు అన్నాడు.
తారాక్షుడు బంగారంతోనూ, విద్యున్మాలి వెండితోను, కమలాక్షుడు ఇనుముతోను మూడు పురాల్ని నిర్మిచుకుని, బ్రహ్మ వర గర్వంతో దేవతలను, ఋషులను నానా బాధలు పెట్టసాగారు. వారంతా ఈశ్వరుణ్ణి ప్రార్ధించగా ఈశ్వరుడు బ్రహ్మ వరము పొందిన ఆ రాక్షసులను సంహరించాలంటే అపూర్వ రధమూ, అపూర్వ బాణమూ కావాలి, మీరవి సంపాదిస్తే నేను వారిని సంహరిస్తాను అన్నాడు. శ్రీమన్నారాయణుని ఆదేశంతో విశ్వకర్మ జగత్తత్వంతో రధాన్ని, వేదతత్త్వంతో గుర్రాలను, నాగతత్త్వంతో పగ్గాలను, మేరుశిఖర తత్త్వంతో ధనుస్సుని, వాసుకి తత్త్వంతో వింటినారిని, సోమ, విష్ణు, వాయు తత్త్వాలతో బాణాల్ని తయారుచేశాడు. ఆ రధానికి బ్రహ్మ స్వయంగా సారధి అయ్యాడు. అయితే త్రిపురాసురుల తపః ప్రభావంతో ఆ రధం భూమిలోకి కుంగిపోయి, గుర్రాలు నిలువలేకపోయాయి. అప్పుడు పరమేశ్వరుడు శక్తిని ధ్యానంచేశాడు. బాలాత్రిపురసుందరి ఆవిర్భవించి, తాను స్వయంగా ఆ ధనుస్సులో ఆవేశించింది. శక్తి సహాయంతో శివుడు త్రిపురాసుర సంహారంగావించాడు.
ధనుస్సునుంచి బయటకి వచ్చిన బాలాత్రిపురసుందరికి ఆమె చేసిన సహాయానికి ఏమైనా కోరుకోమని శివుడు చెప్పగా, అమ్మ, స్వామి అక్కడే చిరకాలంవుండి తనని సేవించటానికి వచ్చే భక్తులకు స్వామిని కూడా సేవించే అవకాశం ప్రసాదించమని కోరింది. బాలాత్రిపురసుందరి కోరికమీద అక్కడ కొలువైన స్వామి త్రిపురాంతకుడిగా, ఆ క్షేత్రం త్రిపురాంతకంగా ప్రసిధ్ధికెక్కాయి.
మార్గము:
ప్రకాశం జిల్లాలోని మార్కాపురంకి 40 కి.మీ. ల దూరంలో గుంటూరు—కర్నూలు జాతీయ రహదారిపై త్రిపురాంతకం గ్రామానికి 2 కి.మీ. ల దూరంలో వున్నది. శ్రీశైలంనుంచి సుమారు 100 కి.మీ.ల దూరంలో వున్న ఈ గ్రామానికి బస్సు సౌకర్యం కలదు. భోజన సౌకర్యంలేదు.
- పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)