ద్విజులకు ఎంతో ముఖ్యమైన జంధ్యాల పౌర్ణమి!
ద్విజులకు ఎంతో ముఖ్యమైన జంధ్యాల పౌర్ణమి!
శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి అంటే అందరికీ రాఖీ పౌర్ణమి గుర్తొస్తుంది. అయితే హిందూ ధర్మంలో చాలామంది జంధ్యాన్ని ధరించేవారికి శ్రావణి పౌర్ణమి అంటే జంధ్యాల పౌర్ణమి అని కూడా తెలుసు. ఉపనయం సమయంలో ధరించే జంధ్యాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణిమ రోజున పాత జంధ్యాన్ని తీసేసి క్రొత్తదాన్ని ధరిస్తారు దీన్ని ఉపాకర్మ అంటారు. ఉపాకర్మను యఙ్ఞోపవీతం పేరుతో పిలుస్తారు.
యజ్ఞోపవీతం అంటే యాగ కర్మతో పునీతమైన దారం అని అర్థం. తెలుగు సాహిత్యంలో ఎంతో పేరెన్నికగన్న కవి పాల్కురికి సోమనాథుడు శ్రావణ పౌర్ణమిని నూలి పౌర్ణమి అని అభివర్ణించారు. నూలి పౌర్ణమి అఞ్జ ఎందుకన్నారంటే జంధ్యాన్ని నూలుదారంతో తయారుచేస్తారు. ఇలా నూలుదారంతో తయారుచేసిన జంధ్యాన్ని అందరూ ధరిస్తారు కాబట్టే దీన్ని నూలి పౌర్ణమి అని పాల్కురికి సోమనాధుడు అన్నాడు. ఈ జంధ్యం ధరించినవారే వేద్యాధ్యయనానికి అర్హులు. అంటే వేదాధ్యయనం నేర్చుకోవాలంటే ఉపాకర్మను ఆచరించాలి. దీనికి ముందు ఉపనయనం జరిపించి జంధ్యాన్ని వేయడం ఆచారం.
యఙ్ఞోపవీతం ధరించినవారిని ద్విజులు అంటారు. ద్విజులు అంటే రెండు జన్మలు కలవారని అర్థం. అంటే ఇక్కడ మరణించి మళ్ళీ జన్మించడం కాదు. తల్లి గర్భం నుంచి జన్మించడం మొదటిది అయితే, ఉపనయనం తరువాత గురువు నుంచి ఙ్ఞానాన్ని పొందడం రెండోది. ఉపనయం సమయంలో యఙ్ఞోపవీతానికి జింక చర్మాన్ని కడతారు. దీనిని ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి రోజు వదిలిపెడతారు.
జంధ్యం ఎప్పుడు, ఎలా మార్చుకుంటారు??
ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు జంధ్యాన్ని మార్చుకోవడం పరిపాటి. గాయత్రీ పూజచేసి కొత్త యఙ్ఞోపవీతాన్ని ధరించి పాతది విసర్జించాలి.
జంధ్యం గురించి చాలామందికి సరిగ్గా తెలియదు. పరిపక్వతకు, పరిశుద్ధతకు యఙ్ఞోపవీతం దివ్యౌషధం. ఇది ఉపనయన సంస్కారం ఉన్నవారికే పరిమితమైనా మిగతావారు కూడా అష్టోత్తరాలతో గాయత్రీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. గాయత్రి దేవిని పూజిస్తే వేదాలను చదివినంత పుణ్యం లభిస్తుంది.
ఇకపోతే పెళ్లి కాని వాళ్ళు మూడు పొగుల జంధ్యాన్ని, పెళ్లి అయిన వాళ్ళు తొమ్మిది పొగుల జంధ్యానికి మూడు ముడులు ఉంటాయి. అలాంటిదాన్ని ధరిస్తారు. శ్రావణమాసంలో వచ్చే జంధ్యాల పౌర్ణమి రోజు ఉపనయం జరిగిన ప్రతి బ్రాహ్మణుడు జంధ్యాన్ని మార్చుకోవడం తప్పనిసరిగా గమనించవచ్చు. కొత్తగా ఉపనయం అయినవారికీ హోమం, పూజలతో కార్యక్రమం నిర్వహించి జంధ్యాన్ని మార్పిస్తారు. పైన చెప్పుకున్న ఉపాకర్మ ఇదే.
◆ నిశ్శబ్ద.