జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి

 



జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి

భక్తుల రక్షణార్ధం, వారి కోరిక మీద భగవంతుడు అర్చామూర్తిగా అనేక చోట్ల వెలిశాడని మనం ఇదివరకు చెప్పుకున్నాముకదా.  అందులో ఒకటి శ్రీ వెంకటేశ్వరస్వామి వెలిసిన జమలాపురం క్షేత్రం.  ఈ ప్రాంతాన్ని ఇదివరకు సూచీగిరి అనేవారు.  అంటే సూదిలాగా వున్న పర్వతం.  నిటారుగా వుండే ఈ చిన్ని కొండని ఎక్కటానికి చాలా కష్టపడాల్సి వచ్చేదిట.  పూర్వం జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేసుకున్నారని, ఆయన కోరిక మీద శ్రీ వెంకటేశ్వరస్వామి ఇక్కడ వెలిశాడనీ అంటారు.

 

స్ధల పురాణం ప్రకారం జాబాలి మహర్షి దశరధ మహారాజు కొలువులో  గురు స్ధానంలో వున్నారు.  ఆయనకి శ్రీరాముడంటే అత్యంత ప్రేమ.  శ్రీరాముడు భార్య, తమ్ముడితో వనవాసానికి వెళ్ళినప్పుడు జాబాలి మహర్షి రాముడిమీద ప్రేమతో వారిని వెనక్కి తీసుకు రావటానికి చాలా ప్రయత్నించాడు.  తండ్రి ఆజ్ఞ పాలించాలనే శ్రీరాముడి దృఢ సంకల్పంతో, చేసేదిలేక వెనుతిరిగిన జాబాలి అయోధ్యకి తిరిగి వెళ్ళక తన శిష్యులతో  తీర్ధయాత్రలు సేవిస్తూ, ఈ ప్రాంతానికి వచ్చి సూచీగిరి మీద తపస్సు చేసుకున్నాడని చెబుతారు.

 

సూచీగిరి మీద రెండు గుహలున్నాయి.  జాబాలి మహర్షి తపస్సుకి మెచ్చి శ్రీహరి ఒక గుహలో స్వయంభూ వెంకటేశ్వరస్వామిగా వెలిశాడు.  శ్రీహరి వెలిసిన గుహ కనుక అది వైకుంఠ గుహ అయింది. (దశరధ మహారాజు ఆస్ధానంలోని జాబాలి మహర్షి ఏమిటి, వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చెయ్యటం ఏమిటి  వెంకటేశ్వరస్వామి కలియుగ దేవుడు కదా అని బోలెడు హాశ్చర్య పడిపోకండి.   వెంకటేశ్వరస్వామి కృతయుగంలోనే  వెలిశాడనీ, శ్రీరామచంద్రుడు నారాయణాచలములోని వెంకటేశ్వరస్వామి దర్శించుకున్నాడని వరాహ పురాణ కధనం.

రెండవది కైలాస గుహ.  అది ఎలాగంటే...

ద్వాపర యుగంలో అర్జనుడు పాశుపతాస్త్రంకోసం ఈ సూచీగిరికి తూర్పున వున్న ఇంద్రకీలాద్రిపై తపస్సు చేశాడు.  ఆ సమయంలో శివుడు అర్జనుని శక్తి సామర్ధ్యాలు పరీక్షించాలని మూకాసురుణ్ణి వరాహ రూపంలో పంపించటం, మూకాసురుడి మీద అర్జనుడూ, శివుడూ వేసిన బాణాలు ఒకేసారి తగలటం, వారిద్దరి మధ్యా జరిగిన వాగ్వివాదం మీకు తెలుసుకదా.  అప్పుడు శివుడు అర్జనుణ్ణి మెచ్చుకుని పాశుపతం అనుగ్రహించాడు.  బాణాలు తగిలి  మూకాసురుడు అదృశ్యుడైన చోటే శ్రీ వెంకటేశ్వరస్వామి వెలసిన గుహ అంటారు.  పార్వతీ పరమేశ్వరులు వున్న ప్రదేశం కైలాస గుహ అని ఒక కధనం. జాబాలి మహర్షి తపోదీక్షతో ప్రసిధ్ధమైన ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసిన అనేకమంది అనేక విధాల శాప విముక్తులయ్యారనే కధలున్నాయి.  అయితే కాల ప్రభావంవల్ల ఈ తీర్ధం ప్రస్తుతం అంతరించిపోయింది.

 

 

జాబాలి మహర్షి తర్వాత కాలంలో అక్కడ వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామికి అర్చనాదులు లేకుండా కొంతకాలం గడిచింది.  కారణం ఆ ప్రాంతమంతా ఆ సమయంలో కీకారణ్యం.    అలాంటి ప్రాంతానికి  తర్వాత కాలంలో దేశాటనం చేస్తూ ఉప్పల యజ్ఞ నారాయణ శర్మ అనే బ్రాహ్మణుడు చేరుకున్నాడు.  అయన అక్కడ వున్న భారద్వాజ నదిలో స్నానం చేస్తూ, నా వంశం పేరున వెలసిన నదిలో స్నానం చేస్తున్నాను, ఇంక ఈ సంచార జీవనం గడపలేకపోతున్నాను...ఈ ప్రాంతంలో స్ధిరంగా వుండేటట్లు అనుగ్రహించు తండ్రీ అని భగవంతుణ్ణి వేడుకున్నాడు.  భగవన్నిర్ణయమేమో, ఆయన ఆ కొండకు దగ్గరలో వున్న పెదగోపవరం అనే ఊళ్ళో నివాసం ఏర్పరుచుకున్నాడు.  అప్పటికి ఆయన అవివాహితుడు.

 

యజ్ఞ నారాయణ శర్మ రోజూ భారద్వాజ నదిలో స్నానం చేసి, సూచీ గిరివై వెలసిన వెంకటేశ్వరస్వామిని అర్చించి వచ్చేవాడు.  జాబాలి మహర్షి తర్వాత ఆ కొండపై వెలసిన శ్రీనివాసునికి యజ్ఞనారాయణ శర్మగారే ప్రధమ అర్చకుడు.  ఒకసారి స్వామిని అర్చిస్తూ ఆయన సమాధి స్ధితి పొందాడు.  ఆ స్ధితిలో ఆయనకు భగవంతుడు కనిపించి ఏమి కావాలో కోరుకొమ్మన్నాడు.  ఆయన మనస్సులో అప్పుడు గోచరించిన కోరిక తనకూ ఒక సంసారం, భార్య, వంశోధ్ధారకుడు కావాలని.  స్వామి చిరునవ్వు నవ్వి  అంతేనా  అని అడిగేసరికి ఆ బ్రాహ్మణుడు భగవంతుని తను కోరిన అతి మామూలు కోరికకి సిగ్గుపడి ముక్తిని ప్రసాదించమని కోరాడు.  భగవంతుడు ముందు సంసారంలో నెగ్గుకు రా ..  ఆ తర్వాత ... అని అంతర్ధానమయ్యాడు.

 

కొంతకాలానికి పొరుగూరి బ్రాహ్మణుడు యజ్ఞనారాయణ శర్మకి పిలిచి పిల్లనివ్వటం, వారికి నలుగురు కుమారులు కలగటం జరిగాయి.  వీరిలో ఒక కుమారుని పేరు లింగయ్య శర్మ.  ఈయనకు ఆరవ తరంలో అక్కుభట్టు జన్మించారు.  ఈ అక్కుభట్టు మూలంగానే స్వామి దుర్లభమైన సూచీగిరినుంచి ప్రస్తుత నివాస స్ధానానికి వచ్చాడు.   అక్కుభట్టు అత్యంత శ్రధ్ధా భక్తులతో తనకి వారసత్వంగా వచ్చిన సూచీగిరి వెంకటేశ్వరుకీ అర్చన చేసేవాడు.  ఆ సమయంలో సూచీగిరి మీదకి వెళ్ళటానికి మార్గం సరిగ్గా వుండేదికాదు.  త్రోవ అంతా రాళ్ళూ, ముళ్ళతో నిండి వుండేది.  అక్కుభట్టుకి  వృధ్ధాప్యం వచ్చింది.  అయినా మానకుండా రోజూ వెంకటేశ్వరుని పూజించి వచ్చేవాడు.

 

 


ఒక రోజు కొండమీదకి స్వామిని అర్చించటానికి వెళ్తున్న అక్కుభట్టు కాలికి మొన తేలిన గులక రాయి గుచ్చుకున్నది.  ఆయన బాధ తట్టుకోలేక,  “శ్రీనివాసా” అని భగవంతుణ్ణి తలచుకుంటూ కింద పడిపోయాడు.  అదృష్టవశాత్తూ భగవంతుని కోసం తీసుకెళ్తున్న నివేదన నేలపాలు కాలేదు.  సన్నిధి చేరటానికి ఇంకా చాలా దూరం వెళ్ళాలి.  అక్కుభట్టుకి అంత దూరం వెళ్ళే శక్తి లేదనిపించింది.  ఏమి చెయ్యాలో తోచని ఆయన భగవంతుడు సర్వాంతర్యామి.  అలాంటి ఆయనకు తాను నైవేద్యం ఇక్కడనుంచి సమర్పించినా స్వీకరిస్తాడు.  ఆయనకి తన పరిస్ధితి తప్పక తెలుస్తుంది.  తన అపరాధాన్ని మన్నిస్తాడు అనే నమ్మకంతో పడిన చోటనే స్వామికి మానసిక పూజోపచారాలు చేసి, నైవేద్యం సమర్పించాడు.  తన తప్పుని మన్నించమని ప్రార్ధించాడు.  తర్వాత ఎలాగోలా ఇల్లు చేరాలని నెమ్మదిగా అడుగులు వేసిన అక్కుభట్టుకి “నేను నీతోనే వస్తున్నా. వెనుతిరిగి చూడకుండా వెళ్ళు” అన్న కంఠంస్వరం వినిపించింది.  సదా స్వామినే ధ్యానించే అక్కుభట్టు అది వెంకటేశ్వరస్వామివారి ఆజ్ఞగా భావించి వస్తూ, ప్రస్తుతం ఆలయం వున్న కొండమీదకి రాగానే బ్రహ్మాండమైన శబ్దము వినిపించింది.  దానికి అక్కుభట్టు వెనుతిరిగి చూశాడు.  ఆయనకి ఆ గుట్టపై ఒక కాలు మోపి, పక్కనే సాలగ్రామరూపంతో నిరాకారంగా, నామాలతో వెంకటేశ్వరస్వామివారు కనిపించారు.  ఆ దర్శనానికి తన జన్మ ధన్యమయినదని భావించి అక్కుభట్టు తాదాత్మ్యంతో అన్నీ మరచి స్వామివారి శిలారూపాన్ని కౌగిలించుకుని తన్మయావస్ధలో అలాగే వుండిపోయాడు.

 

స్వామిని అర్చించి తండ్రి ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి అక్కుభట్టు కుమారుడు ఈశ్వరభట్టు ఆందోళనతో తనవారితో కలసి తండ్రిని వెదుక్కుంటూ బయల్దేరాడు.  తన తండ్రిని ఆ అవస్తలో చూసి, ఎండ వేడి తట్టుకోలేక అలా పడివున్నాడనుకుని ఉపచారాలు చేశారు.  కళ్ళు తెరిచిన అక్కుభట్టు అక్కడివారిని చూసి “భగవంతుడు కరుణామయుడు” అన్నాడు.  అక్కడివారికి అర్ధం కాలేదు.  అక్కుభట్టు వారికి జరిగినది వివరించి స్వామి పాదాన్ని, సాలగ్రామాన్ని చూపించాడు.  ఆనాటినుంచీ అక్కుభట్టు, వారి సంతతివారు ఆ సాలగ్రామాన్ని, పాదాన్నీ పూజించసాగారు.

 

అక్కుభట్టు స్మార్తుడు.  ఆయనకి శివ, కేశవుల బేధం లేదు.  ఇక్కడి పూజలన్నీ స్మార్త పధ్ధతిలో జరుగుతాయి.  పూర్వం ఈ ప్రాంతం దేశముఖి పాండ్యాల ఏలుబడి కొంతకాలం వున్నది.  అప్పుడు ఇక్కడ పూజలు చేస్తున్న ఈశ్వర భట్టుని అక్కడి పాలకుడు దేశపాండే పిలిపించి మీరందరూ దేవునికి విధేయులైనట్లు మాకూ విధేయులై దివాణంలో జిరిగే పూజలన్నీ చేయించాలని ఆదేశించాడు.  దానికి ఈశ్వర భట్టు మేము స్వామి సేవలకు అంకితమైనాము.  మీకు పురోహితులకు కొదవేముంది, ఇంకెవరినైనా నియమించమని చెప్పారు.  తన ఆజ్ఞ ధిక్కరించినందుకు దేశపాండేకి కోపం వచ్చి ఈశ్వర భట్టును అప్పటికప్పుడు వెంకటేశ్వరస్వామి అర్చనా విధులనుంచి తొలగించి ఒక వైష్ణవ పూజారిని నియమించాడు.

 

ఆ పూజారి స్వామికి నైవేద్యం నిమిత్తం వండిన పదార్ధాలన్నీ కుంభవృష్టిలో తడిసిపోయాయి.  ఆయన తిరిగి చక్కెర పొంగలిని తయారుచేసి స్వామి నివేదనకు ఆలస్యమవుతోందని ఆ వర్షంలోనే త్వరగా కొండ ఎక్కసాగాడు.  కొండ ఎక్కే  కాలిబాటనిండా చీమలు .. ఏవో కొన్ని, ఒక చోట కాదు.  కాలిబాట నిండా అడుగు తీసి అడుగు పెట్టలేనంతగా వున్నాయి.  అతి కష్టంమీద వాటిని దాటుకుంటూ స్వామి దగ్గరకు చేరుకున్నాడు ఆ పూజారి.  కానీ ..  ఆలయ ద్వారం ముందు ఒక భయంకర సర్పం తోక మీద నుంచుని అటూ, ఇటూ ఊగిపోతూ కనిపించింది.  ఎలాగో ధైర్యం చేసి స్వామికి నివేదన సమర్పిద్దామని పూజారి ముందడుగు వేయబోతే ఆ సర్పం ఒక్కసారి ఆయన మీదకు దూకుతున్నట్లు ఎగిరింది.   ఆయన భయంతో రక్షించు స్వామీ అని అరిచాడు.  ఆ సర్పం మాయమయింది.

 

ఈ వింత ఆ పూజారినే కాదు, జనాన్నీ,  దేశపాండేనీ కూడా భయభ్రాంతులను చేసింది.  ఆయన పూజ స్వామికి ఇష్టం లేదనుకుని ఆ పూజారి స్వయంగా తప్పుకున్నాడు.  దేశపాండే స్వయంగా ఈశ్వర భట్టు దగ్గరకు వచ్చి తన తప్పిదాన్ని మన్నించమని, తిరిగి స్వామివారి అర్చనలు యధావిధిగా చెయ్యమని కోరాడు.    ఆయన సంతోషంతో స్వామి దగ్గరకెళ్ళి ఈ కలి యుగంలో కూడా నువ్వు భక్త సులభుడవని నిరూపించుకున్నావు తండ్రీ, అయితే మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా నేనే నీ పూజ చేయాలని ఆజ్ఞాపించు తండ్రీ అని వేడుకుంటూ కళ్ళు మూసుకున్నాడు.  ఇంతలో రెండు సర్పాలు ఆయన శిరస్సు మీద పడగలు విప్పి అటూ ఇటూ నించున్నాయి.  ఆ దృశ్యాన్ని చూసి అంతా భక్తి పరవశులై నమస్కారాలు చేశారు.  దేశపాండే కూడా స్వామీ, నీ అభీష్టాన్ని తెలుసుకునే శక్తి నాకు లేక అలా ప్రవర్తించాను, క్షమించమని వేడుకున్నాడు.  ఆ నాటి నుంచీ, ఉప్పల వంశీకులే ఈ స్వామిని అర్చిస్తున్నారు. పూర్వం ఈ ఆలయాన్ని దర్శించి, పునరుధ్ధరించినవారిలో కాకతీయ రాజుల్లో ప్రసిధ్ధుడైన ప్రతాప రుద్ర దేవుడు, శ్రీకృష్ణ దేవరాయలు, తాడేపల్లి రాజుగారు ముఖ్యులు. 

భగవంతుడు నిరాకారుడనే సత్యం నిరూపిస్తున్నట్లు వుంటాడు ఇక్క సాలగ్రామ స్వరూప స్వామి.  అయితే మామూలు భక్తులు స్వామిని తమ మనసుల్లో నింపుకోవటానికి ఒక ఆకారం కావాలి.  తర్వాత అర్చకులలో ఒకరు, దేవీ ఉపాసకులు,  బ్రహ్మశ్రీ ఉప్పల రామయ్యగారు స్వయంభూ అయిన శ్రీ వెంకటేశ్వరస్వామి పక్కన శ్రీచక్ర రూపంలో అమ్మవారిని ప్రతిష్టించారు.  సాలగ్రామ రూపంలో వున్న వెంకటేశ్వరస్వామి వెనుక స్వామి విగ్రహాన్ని, శ్రీ చక్రాన్ని 1976లో ప్రతిష్టించారని తెలిపారు ఇక్కడ శ్రీ వెంకటేశ్వరస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించటానికి అదే మండలానికి చెందిన బనిగండ్లపాడు నివాసి, రాష్ట్ర మాజీ నీటిపారుదల శాఖామాత్యులు, శ్రీ శీలం సిద్దారెడ్డిగారి కృషి చాలా వున్నది.  1975 లో ఉప్పల వంశస్తులైన అర్చకులు, ధర్మకర్తలు దేవాలయ నిర్వహణకి 28 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు.  ఇంకా ఇతర గ్రామస్తుల సహకారంతో  ఈ దేవాలయం సర్వతోముఖాభివృధ్ధిని చెందుతున్నది.
.ఇక్కడి ప్రజలకు స్వామిమీద ఎంత విశ్వాసంమంటే, తమ పొలాలలో పంటలో, తన తోటల్లో కాసిన కాపులో, ఇలా ప్రతిదానిలో స్వామికి ముందు కొంత సమర్పిస్తారు.  వాటిని స్వీకరించటానికి విడిగా కౌంటర్ వున్నదంటే, స్వామిపై వారి భక్తి విశ్వాసాలు ఎంత వున్నాయో ఆలోచించండి.

ఉపాలయాలలో స్వామి పాదం, గోదా దేవి వున్నారు.

దర్శన సమయాలు

ఉదయం 7 గం. లనుంచీ 1 గం. దాకా, తిరిగి సాయంత్రం 3 గం.లనుంచీ 7దాకా.

వసతి, భోజనం

ఆలయం వారు చేసే ఏర్పాట్లు వున్నాయి.

మార్గము

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో వున్న జమలాపురం చేరుకోవటానికి రైలు, రోడ్డు మార్గాలున్నాయి.  విజయవాడనుంచి పాసెంజర్ రైలు, హైదరాబాద్ నుంచి వచ్చే కృష్ణా, గోల్కొండ ఎక్స్ ప్రెస్ లు ఎర్రుపాలెం స్టేషన్ లో ఆగుతాయి.  అక్కడనుంచి జమలాపురం ఆటోల్లో చేరుకోవచ్చు.  విజయవాడనుంచి దాదాపు 50 కి.మీ. ల దూరంలో వున్న ఈ ఆలయానికి స్వంత వాహనాల్లో కూడా వెళ్ళి రావచ్చు.

 

 

 

 

.... పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)