అస్థిత్వం ఒక అదృశ్య శక్తి..

 

అస్థిత్వం ఒక అదృశ్య శక్తి..

 

 

అస్తిత్వం అంటే ఉండటం. ఆస్తికుడు అంటే, ఉందని నమ్మేవాడు. ఆ నమ్మకం అనేది దేవుడి పైనే కాదు. తను చేసే పని మీద ఉన్నా ఆస్తికుడి కిందే లెక్క. నాస్తికుడు అంటే అస్థిత్వాన్ని నమ్మని వాడు. ఒక రకంగా చెప్పాలంటే పెసిమిస్ట్. నిరాశావాది. తనను నడిపించే శక్తి ఒకటి ఉందని తెలుసుకోలేక పోతే, మనిషి మనుగడకే అర్ధం ఉండదు. ఆ శక్తి ప్రకృతి కావచ్చు లేక వేరేదైనా కావచ్చు. నడిపించేది లేకుండా ఈ ప్రపంచంలో నడిచేవి ఉండవు. సైన్స్ కూడా ఇదే సూత్రాన్ని అనుసరిస్తుంది. సైన్స్ ను మాత్రమే నమ్మే నాస్తికుడు కూడా ఒకరకంగా ఆస్తికుడే. కానీ ఆ సైన్స్ కూడా చివరికి ఒక శక్తి ఉందనే చెబుతుంది. ఏదో ఒక చోట దాని పరిశోధన ఆగిపోతుంది. అలా ఆగిన చోటే దైవం ఉనికి మొదలవుతుంది.

 

కాలంలో వెనక్కి పరిగెత్తినా, ఎక్కడో ఒక చోట ఆగాల్సిందే. ఈ కాలాన్ని మొదలుపెట్టింది ఎవరు..? ఈ సకల చరాచర జీవరాశి ఎలా ఏర్పడ్డాయి..? బిగ్ బ్యాంగ్ థియరీ అంటూ ప్రతిపాదించే సైంటిస్టులు కూడా, అంతకు ముందు ఏముందో చెప్పలేకపోయారు. హేతువాదులకు కారణం కావాలి. అలాంటి వారికి సైన్స్ ఒక ఊతంగా ఉపయోగపడింది. కానీ కారణం లేని పరిస్థితికి చేరుకున్న సమయంలో, ఆ శూన్యంలో అసలు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దైవం ఉందా లేదా అనే ప్రశ్న ఇక్కడ అనవసరం. నమ్మకముందా లేదా అనేదే ముఖ్యం. సైన్స్ ప్రకారమైనా, ఏదో ఒక శక్తి ఈ సకల సృష్టి చక్రం నడవడానికి ఒక ఇరుసులా పనిచేస్తుండాలి కదా. ఆ శక్తికి, సైన్స్ తనకు తోచిన పేరు పెట్టుకుంటే, ఆస్తిత్వం మాత్రం దైవంగా కొలుస్తుంది. నమ్మకాన్ని ఏర్పరుచుకోమంటుంది. నమ్మకం ఉన్న చోట ధైర్యం లభిస్తుంది. సకల ఆస్తిత్వం వెనుక ఉన్న మూల కారణం మానవక్షేమమే. లోక కళ్యాణమే. ఇది తెలియని నాడు, మనిషికి తన మనుగడ మీదే అనుమానం ఏర్పడే ప్రమాదం లేకపోలేదు.