భారతీయ గృహస్థు ధర్మం ఎందుకు గొప్పది?

 

భారతీయ గృహస్థు ధర్మం ఎందుకు గొప్పది?

మనిషి ఎప్పుడూ ఇతర ప్రాణులతో విభేదిస్తాడు. మనిషికి ఆలోచనలున్నాయి. భావనలున్నాయి. ఆనంద విషాదాలున్నాయి. కామక్రోధాలున్నాయి. ద్వేషాలున్నాయి. ప్రేమలున్నాయి. కాబట్టి మనిషి ఏ పనీ లేకుండా ఉట్టిగా ఉండటం కుదరని పని.

నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ త్యకర్మకృత్||

కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః||

ఎవరు కూడా ఏ విధమైన కర్మాచరణా లేకుండా ఉండటం కుదరదు. ప్రకృతి నియమాలను అనుసరించి ప్రతి జీవీ ఏదో కర్మ చేయక తప్పదు అంటుంది భారతీయ ధర్మం.

కాబట్టి నిర్వ్యాపారంగా కూర్చుని, అన్నీ వదిలేయటం, 'ఆధ్యాత్మికం' కాదు, అన్ని పనులు సక్రమంగా నిర్వహిస్తూ సుళ్లు తిరిగే ప్రవాహంలో కూడా తన ప్రత్యేక అస్తిత్వాన్ని నిలుపుకోవటం ఆధ్యాత్మికతలో ఉచ్చస్థితి. ఇది మానవుడు సాధించవలసిన విజయం. అది అర్థం అయ్యేందుకే, ఈ విషయంలో ఎటువంటి అపోహలు లేకుండా ఉండేందుకే మన ధర్మంలో గృహస్థాశ్రమం అన్ని ఆశ్రమాలలోకీ ఉత్తమమైందని నిర్ణయించారు. బాల్యదశలో వ్యక్తికి రక్షణ కావాలి. ఆ రక్షణను సన్న్యాసులు, సర్వాన్ని త్యజించినవారు ఇవ్వరు. ఆ రక్షణను ఇచ్చేది గృహస్థు మాత్రమే. కానీ కొంతమంది అవగాహన లేనివారు గృహస్థాశ్రమం అంటే బంధాలతో కట్టివేయబడటం అని, సన్యాసజీవితం నిజమైన ధర్మమని అనుకుంటారు. అది చాలా తప్పు.

యౌవనంలో వ్యక్తికి మార్గదర్శనం కావాలి. తన కాళ్ల మీద తాను నిలబడేందుకు ఆసరా కావాలి. అది గృహస్థు మాత్రమే ఇవ్వగలడు. సమాజం నడవటానికి మానవజాతి అభివృద్ధి చెందేందుకు సంతానాన్ని కనాలి. అదీ గృహస్థు బాధ్యతనే. ఇక సన్యాసులకు భిక్ష ఇవ్వటం దగ్గర నుంచి, వారి బాగోగులు చూడటం, వారి అవసరాలను గుర్తించి, తీర్చటం గృహస్థు మాత్రమే చేయగలడు. వార్ధక్యంలో కూడా వ్యక్తికి నీడనివ్వగలిగింది గృహస్థే. 

దీన్ని బట్టి చూస్తేనే అర్ధమౌతుంది. సమాజానికి వెన్నెముక వంటివాడు గృహస్థు అని. సన్న్యాసి లేకున్నా సమాజం నడుస్తుంది. కానీ గృహస్థు లేకపోతే సమాజం లేదని స్పష్టమౌతుంది. అయితే ఇన్ని కార్యాలూ సాధించి, కర్తవ్యం నిర్వహించాలంటే గృహస్థుడికి డబ్బు సంపాదించటం తప్పనిసరి. కాబట్టి తన సంసారం గడవటానికి, పదిమందికి దానం చేసేందుకు, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు సరిపడ ధనం సంపాదించటం కూడా వ్యక్తి నిర్దిష్ట కర్తవ్యాలలో ఒకటి. అయితే ఈ ధనసంపాదన వెర్రిలా, వ్యామోహంలా, స్వార్థభావనతో కూడింది కాకూడదు. అందులో కూడా ఒక రకమైన సంయమనం ఉండాలి. 

కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగ్ సమాః॥ 

ఏవం త్వయి నాన్యధేతో అస్తిన కర్మలిప్యత్ సరే॥

అంటూ వ్యక్తపరిచారు మన పూర్వికులు. శాస్త్ర విహితములైన కర్మలు చేస్తూ మాత్రమే వందేళ్లు జీవించకోరాలి. జీవితంపై ప్రీతి ఉన్నంత కాలం దుష్కర్మ కాలుష్యాన్ని దూరం చేసుకోవాలి.

దీన్ని బట్టి చూస్తే మన భారతీయధర్మంలోని విజయభావన సంపూర్ణస్వరూపం అర్థమౌతుంది. మనం పరీక్షలు పాసు కావాలి. ఇంటర్వ్యూలలో గెలవాలి. మంచి ఉద్యోగాలు సంపాదించాలి. బాగా డబ్బు సంపాదించాలి. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించాలి. బిల్ గేట్స్ తలదన్నేట్టు ఎదగాలి. కానీ, ఇదే అంతిమలక్ష్యం కారాదు. ఇదే మన విజయానికి సంపూర్ణస్వరూపం కాకూడదు! ఈ కోరికల వెనుక, వాంఛల వెనుక కర్తవ్యపరాయణభావన ఉండాలి. ఆధ్యాత్మికభావన అంతర్లీనంగా ఉండాలి. వ్యక్తి తన సామాజికబాధ్యతను గుర్తించి, వ్యక్తిగత బాధ్యతలను అర్థం చేసుకొని వీటి మధ్య సమన్వయం సాధించాలి. ఇది అసలు విజయం. దీన్ని గృహస్థు మాత్రమే సాధించగలడు. అందుకే భారతీయ గృహస్థు ధర్మం చాలా గొప్పది.

                                         ◆నిశ్శబ్ద.