వసంత పంచమి.. సరస్వతి దేవి అనుగ్రహం పొందే మార్గం ఇదే..!
వసంత పంచమి.. సరస్వతి దేవి అనుగ్రహం పొందే మార్గం ఇదే..!
హిందువులు జ్ఞానాన్ని, విద్యను ప్రసాదించే దేవతగా సరస్వతి దేవిని పరిగణిస్తారు. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరు జ్ఞానం కోసం సరస్వతి దేవిని పూజిస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు చదువు బాగా రావాలని, వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని సరస్వతి దేవి అనుగ్రహం కోరుకుంటారు. అయితే సాధారణ రోజులలో కంటే మాఘ శుద్ద పంచమి రోజు వచ్చే వసంత పంచమి చాలా విశిష్టమైనది. ఈ రోజు సరస్వతి దేవిని ఆరాధిస్తారు. అయితే సరస్వతి దేవి అనుగ్రహం కోసం అమ్మను ఎలా ఆరాధించాలి? ఈ రోజు ఏం చేస్తే సరస్వతి అనుగ్రహం లభిస్తుంది? ఈ రోజు ఏ పనులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి? తెలుసుకుంటే..
సరస్వతి దేవి..
సరస్వతి దేవి సాగర మధనం నుండి ఉద్భవించింది. మాఘ మాస శుద్ద పంచమి రోజే ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే మాఘశుద్ద పంచమికి వసంత పంచమి అని, శ్రీ పంచమి అని కూడా అంటారు.
ప్రకృతి..
మాఘశుద్ద పంచమి సమయానికి ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. ప్రకృతి చిగుర్లు తొడిగి పచ్చగా కనిపిస్తుంది. అందుకే దీన్ని వసంత పంచమి అని కూడా పిలుస్తారు. అంటే వసంతంలో వచ్చింది కాబట్టి వసంత పంచమి అని పిలుస్తారు.
పసుపు రంగు..
వసంత పంచమి లేదా శ్రీ పంచమి రోజు పసుపు రంగుకు చాలా ప్రాముఖ్యత ఉంది. వసంత ఋతువు రాకతో చెట్ల ఫలాలు పసుపు రంగులోకి మారతాయి. అలాగే పువ్వులు ఎంతో విరివిరిగా విచ్చుకునే కాలం ఇది. అందుకే వసంత పంచమి రోజు సరస్వతి దేవికి పసుపు రంగు పువ్లులు, వస్త్రాలు సమర్పిస్తారు.
పూజ..
వసంత పంచమి పూజను పిల్లలు, పెద్దలు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ పూజ చాలా ముఖ్యం.
వసంత పంచమి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి, సరస్వతి దేవి ముందు పిల్లల పుస్తకాలు, పెన్నులు, సంగీత వాయిద్యాలు, పెద్దల వృత్తి పర పస్తువులు కూడా ఉంచి పూజిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం పిల్లలను ముందుగానే మానసికంగా సిద్దం చేస్తే పిల్లలు చక్కగా పూజ చేయగలుగుతారు.
శ్లోకాలు, స్తోత్రాలు..
వసంత పంచమి రోజు సరస్వతి అనుగ్రహం కోసం.. సరస్వతి కవచం, సరస్వతి ద్వాదశ నామాలు, శ్యామలా దండకం, శ్యామలా దేవి 12 నామాలు, మార్కండేయుడు రచించిన సరస్వతి స్తోత్రం వంటివి పెద్దలు చెబుతూ పిల్లల చేత చెప్పించడం చాలా మంచిది.
సంస్కృతం..
పిల్లల ధారణ శక్తి పెరగడానికి, వాళ్లలో వాక్పటిమ మెరుగ్గా ఉండటానికి సంస్కృతం నేర్పించడం చాలా మంచిది. ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది.
పసుపు రంగు..
సరస్వతి పూజ చేయించేటప్పుడు పిల్లలకు తప్పకుండా పసుపు రంగు దుస్తులు వేయడం మంచిది. పసుపు రంగుకు మెదడులో ఎడమవైపు భాగాన్ని ఉత్తేజం చేసే శక్తి ఉంటుంది. ఇది మెదడును చురుగ్గా ఉంచుతుంది. కాబట్టి సరస్వతి పూజ రోజు మాత్రమే కాకుండా.. అప్పుడప్పుడు పిల్లలకు పసుపు రంగు దుస్తులు వేయడం మంచిదని పండితులు చెబుతారు. అయితే రోజూ ఇవే వేసి పిల్లలను చిరాకు పెట్టకూడదు.
*రూపశ్రీ.