కార్తీక మాసంలో తప్పక చెయ్యాల్సిన పనులు!
కార్తీక మాసంలో తప్పక చెయ్యాల్సిన పనులు!
తెలుగు మాసాలలో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. శ్రావణమాసం, మాఘమాసం, బాధ్రపదమాసం, కార్తీక మాసం.. ఇలా ప్రతి మాసంలో వచ్చే పండుగలు, పూజలు, వ్రతాలు వేటి ప్రాధాన్యత వాటిదే. ఇక కార్తీకమాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రిమూర్తులే ఈ మాసమంత గొప్పది ఇంకోటి లేదని చెప్పినట్టు పురాణ కథలున్నాయి. అయితే కార్తీక మాసంలో తప్పకుండా కొన్ని పనులు చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి. కోరిన కోరికలు తీరతాయి. పుణ్యంతో పాటు ఐశ్వర్యం, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి.
తులసి ఆరాధన..
సనాతన ధర్మంలో కార్తీక మాసంలో తులసి పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో తులసి ముందు దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ మాసంలో ప్రతిరోజూ తులసి పూజ చేయడం, దీపం వెలిగించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. తులసి ఉన్న ఇంట్లోకి యమదూతలు ప్రవేశించరని పురాణాలలో చెప్పబడింది.
నదీ స్నానం..
కార్తీకమాసంలో గంగ, యమునా వంటి పుణ్యనదులలో స్నానం ఎంతో పుణ్యప్రదం. ఈ మాసంలో నదీ స్నానం చేయడం వల్ల రోగాల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంటిల్లిపాదికి శుభం కలుగుతుంది. సూర్యోదయానికి ముందు నదీ ప్రవాహం నక్షత్రాల నీడలో ఉంటుంది. ఇలాంటి సమయంలో నదీ స్నానం చేయడం మంచిది. ఒకవేళ గంగాస్నానానికి వెళ్లలేకపోతే స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కలపి ఇంట్లోనే నదీస్నాన శ్లోకం చెబుతూ స్నానం చేయవచ్చు.
లక్ష్మీ దేవి ఆరాధన..
కార్తీక మాసంలో అష్టలక్ష్మిని పూజించడం గొప్ప విశిష్టత. అపారమైన సంపద, సంతానం, కీర్తి కోసం కార్తీక మాసంలోని ప్రతి శుక్రవారం అష్టలక్ష్మిని పూజించాలి. అష్టలక్ష్మిని ఆరాధించడం ద్వారా, అమ్మవారు ప్రసన్నురాలై ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతోషం అన్నీ ప్రసాదిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద మామిడి లేదా అశోక ఆకుల తోరణాన్ని కట్టాలి. ఇది చాలా శుభాన్ని చేకూరుస్తుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇంట్లో ధన, ధాన్యాలకు లోటు ఉండకుండా చేస్తుంది.
దీపాలు వదలడం..
కార్తీకమాసంలో గంగ లేదా ఇతర పవిత్ర నదులలో సాయంత్రం దీపాలను వదలడం చాలా పవిత్రం. కాబట్టి ఈ మాసంలో పవిత్ర నది, చెరువు, దేవాలయం లేదా బహిరంగ ప్రదేశాలలో దీపాలు వదలాలి. ఇలా చేయడం వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి.
దానం చేయాలి..
సంతోషం, సౌభాగ్యం పెరగాలంటే కార్తీకమాసంలో అన్నం, పాలు, పండ్లు, నువ్వులు, జామకాయలు దానం చేయడం ఎంతో శ్రేయస్కరం. ఈ మాసంలో బ్రాహ్మణులకు, అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లకు వస్త్రాలు, కానుకలు ఇవ్వడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. దీనివల్ల తోబుట్టువుల మధ్య బంధం బలపడుతుంది కూడా. కార్తీక మాసమంతా కొద్దిగా పచ్చి పాలను నీటిలో కలిపి రావిచెట్టు యొక్క మొదట్లో పోయాలి.ఎందుకంటే లక్ష్మీ దేవి, విష్ణుభగవానుడు రావిచెట్టుపై నివసిస్తారట.
కర్పూరాన్ని వెలిగించడం..
ఈ మాసంలో ప్రతిరోజూ సాయంత్రం ఇంట్లోని దేవుడి ముందు కర్పూరం వెలిగించి దేవునికి హారతి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించి ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, వివాదాలు సమసిపోయి దేవుడి ఆశీస్సులు సకల కుటుంబీకులపైన ఉంటాయి.
*నిశ్శబ్ద