అఖండ జ్యోతికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసా!

 

 

 అఖండ జ్యోతికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసా!

 


హిందూ మతం, హిందూ ధర్మం ఆచరించేవారికి పూజల గురించి, దీపారాధన గురించి తెలిసి ఉంటుంది. అయితే ఇందులో చాలా రకాల ఉపచారాలు,  విధానాలు ఉన్నాయి.  దీపారాధనలో కూడా చాలా రకాలు ఉన్నాయి.  దీపం వెలిగించడం ఒక ఎత్తు అయితే అఖండ దీపం వెలిగించడం మరొక ఎత్తు.  చాలామంది పూజలు, వ్రతాలు చేసుకున్నప్పుడు అఖండ జ్యోతి వెలిగిస్తూ ఉంటారు.  ఇలాంటి వారు  ఎప్పడూ ఆ దీపం పట్ల ఎరుకతో ఉంటూ దీపం శాంతం కాకుండా దీపంలో నూనెను పోస్తూ ఉంటారు.  దీన్ని వెలిగించడం,  సంరక్షించడం  చాలా ఓపికతో కూడుకున్నది.  అఖండ జ్యోతిని వెలిగించిన తరువాత అది శాంతం అయితే అపశకునంగా భావిస్తారు. చాలా మందికి అఖండ జ్యోతి గురించి తెలియని విషయాలు.. పాంటించాల్సిన నియమాలు స్పష్టంగా తెలియవు..

అఖండ జ్యోతిని ఏదైనా పూజ, వ్రతం సమయంలో వెలిగిస్తారు.  దీన్ని ఒక రోజు,  మూడు రోజులు,  తొమ్మిది రోజులు.. ఇలా చేసుకునే పూజ,  వ్రతాన్నిఅనుసరించి వెలిగిస్తుంటారు. దేవీ నవరాత్రులు,  వినాయక నవరాత్రులు మొదలైన పూజలలోనే కాకుండా  అమావాస్య రోజులలో కూడా అఖండ దీపం వెలిగిస్తూ ఉంటారు.  

అఖండ దీపాన్ని వెలిగించడానికి పెద్ద ప్రమిదను వాడతారు.  చిన్న చిన్న వాటిలో ఈ దీపాన్ని వెలిగించడం కష్టం. దీన్ని సంరక్షించడం మరింత కష్టం.

అఖండ దీపాన్ని వెలిగించడానికి నువ్వుల నూనె,  ఆవనూనె లేదా నెయ్యిని ఉపయోగిస్తారు. ఎవరి ఆర్థిక స్థితికి తగ్గట్టు వారు నూనెను ఎంచుకోవచ్చు.  అలాగే దీపాన్ని వెలిగించే స్థలంలో గాలి ఎక్కువగా ఉండటం,  దీపాన్ని ఉంచే ప్రదేశం ఇరుకుగా ఉండటం వంటివి ఉండకూడదు.

అఖండ దీపం వెలిగించిన తరువాత ఎప్పటికప్పుడు దీపం కుందులో నూనెను గమనించుకుంటూ ఉండాలి. చాలామంది ఉపవాసం ఉంటూ అఖండ దీపాన్ని వెలిగించి దేవుడి ధ్యానం, జపంలో ఉంటూ దీపాన్ని గమనించుకుంటూ దేవుడి సమక్షంలో సమయం గడుపుతూ ఉంటారు.

ఏదైనా ఊహించని విధంగా  అఖండ జ్యోతి శాంతం అయితే నిరాశ పడకుండా స్నానం చేసి.. ఏ దేవతకు అఖండ జ్యోతిని పెట్టారో ఆ దేవత నామ జపంను 108 సార్లు చేసి  మళ్లీ దీపాన్ని వెలిగించవచ్చు.

అఖండ దీపాన్ని సంరక్షించే ఓపిక, ఆసక్తి లేనప్పుడు ఆర్భాటం కోసం ఎప్పుడూ వెలిగించకూడదు. దీని వల్ల కలిగే మేలు కంటే కీడు ఎక్కువగా ఉంటుంది.

                                                        *రూపశ్రీ.