అంతర్ ప్రపంచాన్ని చూడటం ఎలా?
అంతర్ ప్రపంచం అనేది ఎక్కడో భవిష్యత్తులో సాధించవలసిన వస్తువు కాదు. అది ఇపుడే, ఇక్కడే మీలోపలే వుంది. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఏవేవో ప్రయత్నాలు చేయకుండా అంతర్ ప్రపంచం మనలో ఉంది అని విషయాన్ని నమ్మినట్టైతే అది క్రమంగా అర్థమవుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నవారికి, ఆవైపు ఆలోచించేవారికి అంతర్ ప్రపంచం అంటే ఆత్మశక్తి అనే విషయం తెలిసి ఉంటుంది. ఎక్కడో సుదూర ప్రాంతానికి ప్రయాణం చేసి మీలోని ఆత్మశక్తిని దర్శించనవసరం లేదు.
ఎందుకంటే ఆ అంతర్ ప్రపంచమే మీరు అయినప్పుడు దానికోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. చేయాల్సిందంతా మీలోకి మీరు ప్రయాణం చేయడమే. మీ అంతర్ దర్శనాన్ని దైవత్వమన్నా, లేదా నిర్వాణం అన్నా ఈ రెండింటిల ఎలా పిలిచినా ఒకటే. సాధారణంగా అయినా, విశ్వాసంతో అయినా, సంపూర్ణ అమాయకత్వంతో అయినా, వీటిలో ఏదో ఒక విధానంలో సాధన చేసే వారికి మాత్రమే ఈ అంతర్ ప్రపంచం సులభంగా అనుభవంలోకి వస్తుంది.
ఇక్కడ తెలుసుకోవలసిన ఒక సూక్షమైన విషయం ఏమిటంటే మీరు చిన్నపిల్లల మాదిరిగా తయారయితే తప్ప ఆ అంతర్ ప్రపంచంలోకి మీరు ప్రవేశించలేరు. ఇక్కడ చిన్న పిల్లల్లా అంటే గుణం గురించి చెబుతున్నట్టు అర్థం. పసిపిల్లల్లాంటి అమాయకత్వం కావాలి. అహంకారంను పరిపూర్తిగా వదిలిపెట్టాలి. అలా చేసినప్పుడే అంతర్ ప్రపంచం సులభతరంగా పరిచయం అవుతుంది.
ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా మానవజాతి ఆందోళన, అసహనం, ఓర్పులేనితనం మొదలైన గుణాలకు లోనయింది. ఈ ప్రపంచంలో ఎక్కువశాతం ప్రజలకు ఓర్పు అనేది పూర్తిగా కరువయింది. టైమ్ కాన్షియస్నెస్ అనేది నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అన్ని తొందరగా జరగాలి, ప్రతి దాంట్లో ఫలితం తొందరగా రావాలి అనుకుంటారు. చివరకు యోగ సాధనలో కూడ నిముషాలు, గంటలు లేదా రోజులలో మోక్షం పొందాలనే ఆతృత ఎక్కువయింది.
ఇన్స్టంట్ కాఫీ లాగా, ఇన్స్టంట్ గా మోక్షం కావాలి అనుకుంటారు. అది అత్యాశ అనే విషయాన్ని ఆలోచించరు. అది సాధ్యమా కాదా అనే విచక్షణ అవసరం లేదు. ఉన్నదంతా తొందరే. దానికోసం కోసం పరుగులు తీస్తున్నారు. అన్నింటికీ లెక్కలు వేసుకుంటున్నారు. కాలం గురించిన స్పృహను వదిలిపెట్టి, పసిపిల్లల వంటి అమాయకత్వంతో ఈ విశ్వం ఇంకా అంతర్ ప్రపంచంపై పరిపూర్ణ విశ్వాసంతో యోగసాధనను చేస్తే ఒక క్షణంలో లేదా ఒక నిముషంలో లేదా ఒక గంటలో కూడా మోక్షం లభిస్తుంది. అంటే ఇక్కడ ఉండాల్సింది విశ్వాసం.
నిర్వాణం అంటే సాధించవలసిన లక్ష్యమో, లేదా కార్యమో, లేదా వస్తువో కాదు. అది ఒక బుద్ధి వికాసం చెందిన స్థితి. ఆ స్థితిలో శుద్ధసాత్విక గుణాలు ఇంకా నిర్గుణ స్థితి వుంటుంది. ప్రాపంచికమైన రాగద్వేషాలు, భవ బంధాలకు వ్యామోహలకు అతీతమైన స్థితి అది. భూమిపైగల జీవజాతులు, మానవ జాతికి చెందిన ధర్మసూక్ష్మాలు ఆ ధర్మ సూక్ష్మాలలో ఉన్న మెకానిజమ్ క్షుణ్ణంగా తెలిసిన స్థితి. బుద్ధుడు, మహావీరుడు, లావోట్టు, కబీరు, జీసస్ క్రైస్త్, రామకృష్ణ పరమహంస ఇలా ఎందరో యోగులు ఈ స్థితిని పొందారు. అంతర్ ప్రపంచం పట్ల శరణాగతిలో వుంటున్నపుడు మాత్రమే అంతర్శక్తి కూడా వినియోగంలోకి వస్తుంది. అంతర్ ప్రపంచం అనుభవంలోకి రావాలంటే తెలియాల్సింది ఇదే!!
◆నిశ్శబ్ద.