నిజమైన ధ్యానం ఎలా ఉంటుంది??
నిజమైన ధ్యానం ఎలా ఉంటుంది??
కర్మేన్దియాణీ సంయమ్య య ఆస్తే మనసా స్మరన్౹
ఇన్డ్రియార్థాన్విమూఢాత్మా మిథ్యాచార స్స ఉచ్యతే ॥
కొంత మంది బలవంతంగా ఇంద్రియములను నిగ్రహించి, ధ్యానంలో కూర్చుంటారు. కాని మనసు మాత్రం తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది. అనేక విషయములు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అటువంటి వారు విమూఢాత్ములు. వారు చేసేది మిథ్యాచారము. ధ్యానము కాదు.
కేవలము బయట వాళ్లు తాను ధ్యానం చేస్తున్నాను అని అనుకోవాలని కొంత మంది ధ్యానం చేస్తుంటారు. కాని లోపల మనసుతో అన్ని రకాల విషయాల గురించి ఆలోచిస్తుంటారు. వారి మనసు భగవంతుని మీద నిలువదు. అటువంటి వారిది కృత్రిమ ధ్యానము. వారు మిథ్యాచారులు, మూఢులు, డాంబికులు. ఇతరుల మెప్పుకోసం ధ్యానం చేస్తున్నట్టు నటిస్తుంటారు. ఇంద్రియములు మనసుతో కూడినపుడే కర్మలు చేస్తుంటాయి. తమంతట తాము ఏమీ చేయలేవు. కాబట్టి కేవలం ఇంద్రియములను కట్టడి చేసినందువలన ప్రయోజనము లేదు. మనసును కూడా నిగ్రహించాలి. అప్పుడే ధ్యానం కుదురుతుంది. మనసును నిగ్రహించాలి. అంటే ముందు మనం చేసే కర్మలు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఎటువంటి ఫలాపేక్షలేకుండా, కర్తృత్వ భావన లేకుండా చేయాలి. అప్పుడు మనసు నిర్మలంగా ఉంటుంది. అలా కాకుండా కేవలం కాళ్లు చేతులు కదలకుండా కూర్చుంటే, మనసును దాని ఇష్టం వచ్చినట్టు తిరగనిస్తే, అది మిథ్యాచారము, డంబాచారము అవుతుందే కానీ ధ్యానము కాదు.
అందుకే పరమాత్మ చెబుతున్నాడు ధ్యానం అంటే కేవలం ఇంద్రియాలు అదుపులో పెట్టుకోవడం స్థిరంగా కూర్చోవడం కాదు, మనసును ఏకాగ్రతా స్థితిలోకి తీసుకొచ్చి అప్పుడు ధ్యానం చేయాలి అని. మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ అన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే అది ధ్యానము అవ్వదు, దానికి పలితమూ ఉండదు.
కొంతమంది ఉంటారు. మేము సన్యాసులము సన్యాసం స్వీకరించాము అని అంటారు. కాషాయ బట్టలు కడతారు. ఇంద్రియములను నిగ్రహించి ధ్యానం చేస్తున్నట్టు నటిస్తారు. తాము యోగులము అంటారు. కాని వారి మనసు మాత్రం ప్రాపంచిక విషయములలో సంచరిస్తూ ఉంటుంది. అటువంటి వారిని మిథ్యాచారి, డాంబికుడు అంటారే కానీ జ్ఞాని అనరు. ఇటువంటి వారు మనకు తరచు కనపడుతుంటారు. వారిని వేల కొద్దీ జనం అనుసరిస్తుంటారు. ఇటువంటి వారు బయట ప్రపంచంలో విరాగుల వలె, యోగుల వలె నటిస్తుంటారు. యతి వేషము సన్యాసుల వేషము వేసుకుంటారు. వారు పైకి సన్యాసుల వలె కనపడతారే కానీ వారి మనసు మాత్రము విషయ వాసనలతోనూ, కామ వాంఛలతోనూ నిండి ఉంటుంది. ఇది పైకి తెలియకుండా సన్యాసి వేషం వేస్తారు, ఇంద్రియ నిగ్రహం ఉన్నట్టు నటిస్తారు. ఇటువంటి వారు తమను తాము మోసం చేసుకోవడమే కాకుండా ప్రజలను కూడా మోసగిస్తారు.
దీని వలన ఎన్నో మానసికవ్యాధులు వస్తాయని మనస్తత్వశాస్త్రము తెలిసిన వారు చెబుతారు. కాని వీరి కపట వ్యాపారము ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు. ఇటువంటి వారికి ఎన్నటికి కూడా ఆత్మతత్వము బోధపడదు. వారికి ముక్తి ఎన్నటికీ రాదు. అయితే ఒక చేదు నిజం ఏమిటంటే ఇలాంటి వాళ్ళ బండారం బయటపడుతూ ఉండటం ప్రజలు చాలా చూస్తున్నారు అందుకే నిజమైన సన్యాసులను కూడా ప్రజలు చాలా తొందరగా అపార్థం చేసుకుంటారు. కాబట్టి ఈ శ్లోకంలో భగవానుడు బాహ్య ఇంద్రియములను నిగ్రహించడమే కాదు, మనస్సు నిర్మలంగా ఉండటం, మనస్సును నిగ్రహించడం కూడా ప్రధానము అని చెప్పాడు.
◆ వెంకటేష్ పువ్వాడ