మనసును నియంత్రించాలంటే ఇలా సాధ్యం!

 

మనసును నియంత్రించాలంటే ఇలా సాధ్యం!

మనస్సు చంచలమైనది. స్వభావ సిద్ధంగా చంచలమైన మనస్సుకు బాహ్య పరిసరాలు కూడా తోడైతే అది ఆడించినట్లు ఆడడంతో జీవితం నిరర్థకమవుతుంది. నిద్ర లేచిన దగ్గర నుండి పడుకొనే వరకూ ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. మానసిక ఏకాగ్రత లేనిదే ఏ పనీ చేయలేం.

చంచల స్వభావంగల మనస్సుతో ఏకాగ్రత సాధించడం సాధ్యమా? ఈ విషయమై వెనకటికి చంచల మనస్కులు కొందరు ఒక గురువును ఆశ్రయించారట. మానసిక ఏకాగ్రత చేకూరేందుకు మీకో మంత్రం ఉపదేశిస్తానని ఆ గురువర్యులు చెప్పారు. 'సాధ్యమా గురువుగారూ?' అంటే, 'అసాధ్యం ఏదీ లేదు' అన్నారట. అంతేకాదు ఆ మంత్రశక్తితో భగవంతుడి దర్శనం అవుతుందని కూడా చెప్పారు. మంత్రం తీసుకునేందుకు అందరూ సంసిద్ధులైన తరువాత నియమాలు చెప్పారు. మంత్రం తీసుకునేందుకు వచ్చే రోజు ఉదయం నిద్ర లేవగానే కోతి రూపం గుర్తుకు రాకూడదన్నది నియమం. అలా కోతి మనస్సులో కనిపిస్తే ఆ మంత్రం పనిచేయదని చెప్పారు.

ఏ రోజైతే అలా కోతి రూపం మనస్సుకు గుర్తురాదో ఆ రోజు మంత్రం తీసుకునేందుకు రమ్మని చెప్పారు ఆ గురువు. విచిత్రంగా ఆ రోజు నుంచి నిద్ర లేవగానే కోతి రూపమే గుర్తొచ్చేది. ఒకవేళ అలా గుర్తురాకపోయినా.. గురువు గుర్తొస్తే చాలు కోతి గుర్తొచ్చేది. మనస్సు తత్వం ఇలా ఉంటుంది. ఏదైతే వద్దనుకుంటామో అదే తరచూ గుర్తుకొస్తుంది.  అలాంటి కోతి లక్షణం మనస్సుదని మనస్సు లోతులు తెలిసిన గురువు అంటారు. ఏదైతే వద్దనుకుంటామో మనకు తెలియకుండానే అదే విషయాన్ని స్మరిస్తూ ఉంటాం. నిగ్రహించుకుందామంటే కుదిరేది కాదు.

చంచల స్వభావం గల మనస్సు సామాన్యులనే కాదు, మహాత్ములను కూడా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ విషయమై అర్జునుడు, శ్రీకృష్ణుణ్ణి "మనస్సు చంచల స్వభావం కలది, బలమైనది కూడా. దానిని నిగ్రహించడం గాలిని పట్టుకోవడం లాంటిది. ఈ పరిస్థితుల్లో దానిని అదుపుచేయడం ఎలా" అని అడిగాడు. అందుకు పరమాత్ముడు "నీవు చెప్పినదంతా నిజమే అర్జునా! మనస్సు స్వభావం అవిశ్రాంతమనేది యథార్థం. మనస్సును అదుపు చెయ్యడం అంత సులభం కాదు. అలా అని అసాధ్యం కూడా కాదు. అభ్యాస, వైరాగ్యాల్ని పెంపొందించుకుంటే మనస్సును నియంత్రించవచ్చు" అని వివరించాడు.

మనోనిశ్చలత అనే సమస్య కొత్త విషయమేమీ కాదు. భూమిపైనున్న ప్రతి ప్రాణీ, వస్తువూ ఒక ప్రత్యేకమైన స్వభావం కలిగి ఉంటుంది. గాలి స్వభావం వీయడమైతే..  దహించడం అగ్ని స్వభావం. ప్రవహించడం నీటి స్వభావం. అదే విధంగా ప్రతి దానిలోనూ తలదూర్చడం, చెడు లక్షణాల్ని ఆకర్షించడం మనసు స్వభావం. ఇక్కడే పంచేంద్రియాల పాత్ర ముందుకు వస్తుంది.  కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం అనేవి మన మనసుకు చక్రాల లాంటివి. అందమైన వస్తువు మన కంట పడగానే మనకు కావాలనే కోరిక పుడుతుంది. కోరికలు గుఱ్ఱాలైతే మనస్సులో సంచలనం ప్రారంభమవుతుంది. మనస్సు  సంచలనానికి అసలు కారణం కోరికలు. ఆధ్యాత్మిక చింతనతోనే మనసును నియంత్రించడం సాధ్యం.