భారతీయులు సూర్యుడిని ఆరాధించడంలో అంతరార్ధం ఇదే..!
భారతీయులు సూర్యుడిని ఆరాధించడంలో అంతరార్ధం ఇదే..!
సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. సంక్రాంతి రోజు సూర్యుడు మఖర రాశిలోకి మారతాడు. ఈ కారణంగా దీన్ని మకర సంక్రాంతి అని కూడా పిలుస్తారు. సూర్యుడిని ప్రత్యక్ష దైవం అంటారు. సంక్రాంతి రోజు సూర్యుడి ఆరాధన గురించి, ఆ సూర్య భగవానుడి గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కింది విధంగా ప్రవచించారు..
ఏ దైవాన్నైనా ఆరాధించాలంటే ఆ దైవాన్ని మనస్సులో ధ్యానించాలి. అలా ధ్యానించలేనివారు విగ్రహాల మూలంగా ధ్యానించాలి, లేదా దేవాలయానికి వెళ్ళి అక్కడున్న విగ్రహాన్ని ధ్యానించాలి. మూల పదార్థాన్ని గుర్తుచెయ్యడానికే విగ్రహాలు కానీ విగ్రహాలు మూల పదార్థం కాదు.
సూర్యుణ్ణి ఆరాధించడానికి విగ్రహాలు కానీ, చిహ్నాలుకానీ అవసరం లేదు. సూర్యనారాయణ మూర్తి ఆకాశంలో కంటికి ఎదురుగా కనపడుతుంటాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలాల్లో ఆయనకి నమస్కరించి ధ్యానించే పవిత్ర ఆచారం భారతీయులకి ఉంది. ఆరాధించే వారికి ఎదురుగా కనపడతాడు కనుక ఆయన ప్రత్యక్షదైవం అయ్యాడు.
తాను ప్రకాశిస్తూ ఇతర వస్తువులని ప్రకాశింప చేసే పదార్థమే స్వయం ప్రకాశకమైన పరమాత్మ. పరమాత్ముడైన భగవంతుణ్ణి కానీ ఆయన ప్రకాశాన్ని కానీ మనం చూడలేం. అయితే భగవంతుడికి ప్రతినిధిగా ఉన్న సూర్యప్రకాశం ఆధారంగా దైవ ప్రకాశాన్ని తెలుసుకోవచ్చు.
భూమికీ, చంద్రుడికీ స్వయం ప్రకాశం లేదు. సూర్యుడు తాను జ్యోతిర్మూర్తిగా ఉండి భూమికి, చంద్రుడికి వెలుగునిస్తున్నాడు. అందువలననే దృశ్యపదార్థాలలో సూర్యుడు - పరమాత్మ స్వరూపుడిగా ఆరాధింపబడుతున్నాడు. సూర్యుడి వేడి వలన జీవులు జీవిస్తున్నాయి. మన శరీరంలోని ఉష్ణం (వేడిమి) సూర్యుని వలననే సంక్రమించింది. ప్రాణం నిలవడానికి వేడి ముఖ్యకారణం. మనుషులతో పాటు జంతువులు, పక్షులు, వృక్షాలు... వంటి జీవజాలమంతటికీ వేడినిచ్చి ప్రాణాలు నిల్పుతున్నవాడు సూర్యుడు. అందువలననే ఆయన శక్తిమంతుడైన ప్రత్యక్షదైవంగా చెప్పబడుతున్నాడు.
వేదాలు భగవంతుణ్ణి కాలస్వరూపుడిగా, అభయ ప్రదాతగా వర్ణిస్తున్నాయి. సూర్యుని సహాయం లేనిదే కాలాన్ని కొలవడం సాధ్యం కాదు. రాత్రింబవళ్ళు... రోజులు... వారాలు... నెలలు... సంవత్సరాలు సూర్యుడి సంచారం వలననే ఏర్పడుతున్నాయి. కనుక సూర్యుడే కాల స్వరూపుడైన భగవంతుడని కీర్తింపబడుతున్నాడు. చీకటి పడగానే ప్రాణులన్నీ నిద్రాదేవికి వశమవుతున్నాయి. సూర్యోదయమవగానే నిద్రలేచి తమ పనులు చేసుకునే శక్తిని పొందుతున్నాయి. కాబట్టి సూరుణ్ణి అభయ ప్రదాతగా భావించి, ప్రత్యక్షదైవంగా పూజిస్తున్నారు. పండుగలు, ఉత్సవాలు, పూజలు, వ్రతాల పేరిట వేడుకలు జరుపుతున్నా మూలతత్త్వమైన పరమాత్మను చేరడానికి సాధనమైన ఆధ్యాత్మిక తత్త్వాన్ని ఈ విధంగా ఆచరణలో చూపెడుతున్నారు మనవాళ్ళు... ఇదే భారతీయుల ప్రత్యేకత.
*నిశ్శబ్ద.