కార్తీక మాసం స్పెషల్... గరళ కంఠుడు నంజుండేశ్వరుడు
కార్తీక మాసం స్పెషల్... గరళ కంఠుడు నంజుండేశ్వరుడు
వెయ్యి సంవత్సరాన పైన చరిత్ర కల ఆలయం ఇది. కర్ణాటక రాష్ట్రంలో మైసూరు సమీపంలో కపిల నది ఒడ్డున వున్నది. పూర్వం సాక్షాత్తూ పరమేశ్వరుడు ఇక్కడ నివసించాడని భక్తుల నమ్మకం. ఇక్కడ శివుడి పేరు నంజుండేశ్వరుడు. అంటే విషాన్ని కంఠంలో నిలుపుకున్నవాడు. సముద్ర మధనం సమయంలో వెలువడిన విషాన్ని లోక రక్షణార్ధం శివుడు తాగటం, పార్వతీ దేవి అడ్డుపడి ఆ విషం ఆయన కంఠంలోనే నిలుపుకునేటట్లు చేయటం మీకు తెలిసిన కధేగా. శివుడు విషాన్ని తాగాడుగనుక నంజుండేశ్వరుడు. ఆ విషాన్ని తన కంఠంలోనే నిలుపుకుని శ్రీ కంఠుడయ్యాడు. ఇక్కడ శివుణ్ణి శ్రీ కంఠేశ్వరుడు అనికూడా పిలుస్తారు.
నంజుండేశ్వరునికి జబ్బులను నయం చేసే శక్తి వున్నదని భక్తుల నమ్మకం. చారిత్రక కధనాల ప్రకారం టిప్పు సుల్తానుకి అత్యంత ప్రీతిపాత్రమైన ఏనుగుకి చేసిన జబ్బు, (కళ్ళు కనబడకుండా పోవటం అని కొందరంటారు) నంజుండేశ్వరుని ప్రార్ధించిన తర్వాత పూర్తిగా నయమయింది. అందుకని టిప్పు సుల్తాను ఈ స్వామిని హకీమ్ నంజుండ అని అనేక కానుకలు సమర్పించాడుట. ఇక్కడి నీటిలో, ఈ మన్నులో వ్యాధులను నయం చేసే శక్తి వున్నదని, కపిల నదిలో స్నానం చేసి ఈ స్వామిని సేవిస్తే అన్ని జబ్బులు నయమవుతాయని భక్తులు ఇప్పటికీ నమ్ముతారు.
ఆలయ నిర్మాణం: 11 శతాబ్దాలలో చోళ రాజులచే ప్రారంభింపబడిన ఈ ఆలయం తర్వాత హొయసాల, విజయనగర రాజులచే విస్తరించబడి, మైసూరు రాజుల సమయంలో పూర్తిగా అభివృధ్ధి చెందింది. ముఖ్యంగా మైసూరు రాజు కృష్ణరాజు ఒడయార్ కి ఈ స్వామిపై వున్న భక్తి కారణంగా ఆలయాభివృధ్ధికి బాగా తోడ్పడ్డారు. మహాద్వార గోపురం ఎత్తు 120 మీటర్లు. ఏడు అంతస్తులతో పైన బంగారు రేకు తో తాపడం చేయబడిన ఏడు కలశాలతో అందంగా అలరారుతూ వుంటుంది. చుట్టూ వున్న ప్రాకారం ఎత్తు 12 అడుగులు. 50,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మింపబడిన ఈ ఆలయంలో, ద్వారపాలకుల విగ్రహాలతో సహా 122కన్నా ఎక్కువ విగ్రహాలను భక్తులు దర్శించవచ్చు. వీటిలో శివుని అనేక రూపాల విగ్రహాలు భక్తులనాకర్షిస్తాయి. లోపల గోడపై ముద్గల పురాణంలో చెప్పబడ్డ గణపతి 32 రూపాల విగ్రహాలున్నాయి. ఈ ప్రాంగణంలో ముఖ్యాలయాలు మూడు. శ్రీ నంజుండేశ్వరుడు, పార్వతీదేవి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మహావిష్ణువు, లింగ రూపంలో వున్న పరమ శివుడు.
పరశురామ క్షేత్రం: నంజన్గూడు దగ్గర కపిల, కౌండిన్య నదుల సంగమ స్ధానం వున్నది. పూర్వం పరశురాముడు తన తల్లిని చంపిన పాపాన్ని పోగొట్టుకునేందుకు అనేక క్షేత్రాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చాడు. ఈ క్షేత్రంలో ఆయనకి ఎక్కడా దొరకని అమితమైన ప్రశాంతత లభించింది. అందుకే ప్రస్తుతం నంజుండేశ్వరుని ఆలయం వున్న ప్రదేశంలో తపస్సు చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు అక్కడ ఆది కేశవుని ఆలయం మాత్రం వున్నది. ఆ ప్రదేశాన్ని తన గొడ్డలితో శుభ్రం చేస్తుండగా గొడ్డలి భూమిలో వున్న శివ లింగానికి తగిలి రక్తం కారిందింట. అది చూసి పరశురాముడు, తాను ఒక పాపాన్ని కడుక్కోబోయి, ఇంకొక ఘోర తప్పిదాన్ని చేశానేమోనని కంగారు పడ్డాడు. శివుడు ప్రత్యక్షమై అతనికి అభయం ఇచ్చి, ఆది కేశవాలయం పక్కనే తనకి ఆలయం నిర్మించమని ఆదేశించాడు. శివుని ఆదేశం ప్రకారం పరశురాముడు ఇప్పుడు ఆయన ఆలయం వున్న ప్రదేశంలో తపస్సు చేశాడు. పరశురాముని తపస్సుకి సంతసించిన శివుడు తనని దర్శించిన భక్తులు పరశురాముని ఆలయాన్ని తప్పక దర్శించాలని, అప్పుడే వారి యాత్ర పరిపూర్ణమవుతుందని వరమిచ్చాడు. కపిలానది ఒడ్డున వున్న ఈ ఆలయాన్ని భక్తులు తప్పక దర్శిస్తారు. అక్కడ ఉప్పు, బెల్లం అమ్ముతారు. భక్తులు, తమకి ఆరోగ్యాన్ని ప్రసాదించమని భగవంతుని వేడుకుంటూ వాటిని నదిలో వేస్తారు.
రాఘవేంద్రస్వామి మఠం: ప్రధాన ఆలయానికి 500 మీటర్ల దూరంలో శ్రీ రాఘవేంద్రస్వామి మఠం వున్నది. శ్రీ రాఘవేంద్రస్వామి రాతి విగ్రహం ఇక్కడ మాత్రమే వున్నదంటారు. అంతేకాక, శ్రీ రాఘవేంద్రస్వామి పరంపరలో ఐదుగురి స్వాముల బృందావనాలు ఇక్కడ వున్నాయి. ఈ ప్రాంతంలో ఇంకా గౌతమ, గణపతి, దత్తాత్రేయ, మారుతి ఆలయాలున్నాయి.
విశేషాలు: గౌతమ మహర్షి ఇక్కడ కొంతకాలం నివసించి, శివలింగాన్ని ప్రతిష్టించాడంటారు. కపిల (కబిని) నదిమీద వున్న రైలు, రోడ్డు వంతెన అతి పురాతన రైలు, రోడ్డు రవాణా సదుపాయం వున్న వంతెన. ఈ వంతెన వూరిలోకి ప్రవేశించే ముందే వున్నది. 1735లో నిర్మింపబడిన ఈ వంతెన హెరిటేజ్ మాన్యుమెంట్ గా డిక్లేర్ చేశారు. ఈ ప్రదేశం ఇదివరకు ఆయుర్వేద మందులకు ప్రసిధ్ధి చెందింది. స్వ. బి.వి. పండిట్ గారు తయారు చేసిన ఆయుర్వేద మందులు 1950మధ్య ఇండియా మొత్తం మార్కెట్ చెయ్యబడ్డాయి. ఆ సమయంలో నంజన్ గూడు పళ్ళపొడి చాలా ప్రసిధ్ధి పొందిది. ఇక్కడ వివిధ రకాల పరిశ్రమలు కూడా వున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు తర్వాత నంజన్ గూడు తాలూకానే అత్యధికంకా సేల్స్ టాక్స్ చెల్లించే తాలూకా. క్కడ పండే అరటి పళ్ళు, నంజన్ గూడు రసబాలే చాలా ప్రఖ్యాతి పొందాయి.
ఉత్సవాలు: నిత్య పూజలు కాక జులై లో గిరిజా కళ్యాణం జరుగుతుంది. ఈ ఆలయానికి అద్భుతంగా చెక్కబడిన 5 కొయ్య రధాలున్నాయి. నవంబరులో జరిగే చిక్క జాతరలో 3 రధాలలో దేవతా మూర్తులను ఊరేగిస్తారు. ఏప్రిల్ లో జరిగే పంచ మహా రధోత్సవంలో (10 రోజుల ఉత్సవం) 5 రధాలపై గణపతి, శ్రీకంఠేశ్వరుడు, చండికేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, పార్వతీ దేవి విగ్రహాలను ఊరేగిస్తారు. భక్తులు ఈ రధాలని అత్యంత ఉత్సాహంతో, భక్తి ప్రపత్తులతో లాగుతారు. ఇవేకాక మహా శివరాత్రి, నవరాత్రులు మొదలగు పండగలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి.
దర్శన సమయాలు: ఉదయం 6 గం. ల నుంచి మధ్యాహ్నం 1 గం. దాకా, తిరిగి సాయంత్రం 4 గం. ల నుంచి రాత్రి 8దాకా. ఉత్సవాల రోజులలో, ఆది, సోమవారాలలో ఉదయం 6 గం. ల నుంచి రాత్రి 8-30 దాకా.
ఫోన్ నెంబర్లు ఆఫీసు 08221 – 226245
ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ 08221 223320
- పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)