కార్తీకమాసం 4వ సోమవారం స్పెషల్... గోపి తలాబ్
కార్తీకమాసం 4వ సోమవారం స్పెషల్ గోపి తలాబ్
కార్తీక మాసం హరి హారాదులకి ప్రత్యేక మాసం.. అందుకే ఈ సోమవారం శ్రీకృష్ణుడు గోపికలతో ఆడిన రాసకేలి ప్రాంతమైన గోపి తలాబ్ విశేషాలు ఈ వారం ..... ఇది ద్వారకా పట్టణానికి దగ్గరలో వుంది. గోపి తలాబ్ లేక గోపికా సరస్సు గుజరాత్ రాష్ట్రం లోని ద్వారకా పట్టణానికి దగ్గరలో వుంది. ద్వారకాధీసుని చూసిన వారంతా ఇక్కడికి తప్పకుండా వస్తారు. ద్వారకా నగరం నుంచి ఆటోలు, ప్రైవేట్ వాహనాలలో ఇక్కడికి చేరుకోవచ్చు.
స్థల పురాణం:
ఈ సరస్సు పురాణాల కాలం నుంచి విశేషమైన చరిత్రని కలిగి వుంది. పురాణాల ప్రకారం భాగవతంలో గోపికలు ద్వారకలో వున్న శ్రీ కృష్టుని ఇక్కడే కలుసుకునే వారు. శ్రీకృష్ణ రాస లీలలు ఇక్కడే జరిగేవని కుడా చెబుతుంటారు. శ్రీకృష్ణుడు నరకాసురుని చంపి ఆ రాక్షసుడు బంధించిన 16,000 రాకుమార్తెలని, గోపికలని రక్షించి, వారిని విడిపించాడు. గోపికలందరూ తమని విడిపించిన శ్రీకృష్ణుడిని ప్రేమించి, కృష్ణుడినే వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. అంతే కాదు పరాయి పురుషుని బందీఖనాలో వున్న కన్నెలను ఎవరూ వివాహం చేసుకోడానికి ముందుకు రారు కనుక తమని రక్షించి వివాహం చేసుకోమని అర్దిస్తారు. వారిని కృష్ణుడు వివాహం చేసుకుని ముక్తిని ప్రసాదిస్తాడు. గోపాలుడు చిన్నతనంలో బృందావనంలో గోపికలతో ఆడి పాడి, గోపికల మనసు దోచాడు. శ్రీకృష్ణుడు బృందావనం, మధుర వీడి ద్వారకకు వచ్చినపుడు ఆ గోపికలందరూ విరహ వేదనతో కృష్ణుని కోసం ద్వారకకు వచ్చి ఈ గోపికా సరస్సు వద్దనే కృష్ణుని కలుసుకుంటారు. వారందరూ మరొక్కసారి కృష్ణునితో రాసలీల నృత్యం చేస్తారు.
శ్రీ కృష్ణ నిర్యాణానంతరం గోపికలందరూ కృష్ణయ్యని విడిచి వుండలేని వారందరు ఇక్కడే సరస్సులో దూకి ఆత్మార్పణం చేసుకుని ఆ పరమాత్మలో లీనమవుతారు. ఈ గోపికలందరూ పూర్వ జన్మలో ఋషులు, ఋషి పత్నులు, దివ్య పురుషులూను. కృష్ణ నిర్యానంతరం వారి పంచ భౌతిక శరీరాలను వీడి దివ్య లోకాలను చేరుకుంటారు. వారి శరీరాలు ఇక్కడ సరస్సులో ఐక్యం అయిన కారణంగా ఇక్కడ మన్ను గోపి చందనంగా పిలవ బడుతూ పసుపు రంగులో, మెత్తగా వుంటుంది.
ద్వారకా నగరానికి 20 కి.మీ. దూరంలో ఈ గోపికా సరస్సు వుంది.
చెరువు ఒడ్డున ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. గుజరాత్ వస్తువులు బాగులు, గొలుసులు, కచ్ వర్క్ బట్టలు, ఇంకా అనేక వస్తువులు యాత్రికలను ఆకర్షిస్తాయి.
ఇక్కడ గోపిచందనం పది రూపాయలకి 4 పాకెట్స్ వస్తాయి. యాత్రికులు 25 కేజీలు, గడ్డల రూపంలో బస్తాలలో తీసుకెడుతుంటారు. ఇక్కడి మట్టికి మహత్తరమైన శక్తి వుందని నమ్ముతారు. కొంతమంది శ్రీకృష్ణుని రూపంగా భావించే శంఖ, గద, చక్ర రూప ముద్రలను శరీరం పైన ధరిస్తారు.
గోపిచందనం, పారాడే శ్రీకృష్ణుడు, శంఖ, చక్ర,గడ ముద్రలు, చక్రాంకితాలు
గోపిచందనం స్టిక్స్
....Mani Kopalle