Read more!

పూజ ఎందుకు చేయాలి? (Purpose of Prayer)

 

పూజ ఎందుకు చేయాలి?

(Purpose of Prayer)

 

మన హిందువులకు ఉన్నంతమంది దేవుళ్ళు మరే మతం వాళ్ళకీ లేరు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, గణపతి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు - ఇలా ఎందరో దేవుళ్ళు ఉన్నారు. సూర్యుడు, చంద్రుడు, భూమి, అగ్ని, వాయుదేవుడు, వరుణదేవుడు - ఇలా సృష్టి, స్థితి, లయలలో మనకు మేలు చేస్తున్న శక్తులు అన్నిటినీ అర్చిస్తున్నాం.

 

అంతెందుకు, ఇల్లు ఊడ్చే చీపురుకట్టను కూడా పరమ పవిత్రంగా భావిస్తాం. చీపురుకట్టను తొక్కితే పాపం వస్తుంది అని చెంపలు వేసుకోవడం మీరు గమనించే ఉంటారు. ఈ ఆచారం ఈనాటిది కాదు, వేదాల్లోనే ఉంది. ఈ లెక్కన మనకు వందమందో, వెయ్యిమందో కాదు, ఏకంగా ముక్కోటి దేవతలున్నారు.

 

ఇంతమంది దేవుళ్ళలో ఎవర్ని పూజించాలి, ఏ విధంగా పూజించాలి అంటే, ఎవరికి వాళ్ళు తమకు నచ్చిన రూపాన్ని, నచ్చిన రీతిలో పూజిస్తారు. ఇంతకీ అసలు దేవుళ్ళకు రూపాలు ఉన్నాయా? తలమీద కొప్పు, మెడలో సర్పం ఉంటేనే శివుడా? విల్లు, బాణం ధరిస్తేనే రాముడా? - తరహాలో కొందరు ప్రశ్నలు సంధిస్తారు. అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించమని తర్కించేవాళ్ళు కూడా ఉన్నారు.

 

ఇలాంటి వాదాలకు సమాధానం చెప్పడం కుదరదు. మనం ఆలోచిస్తాం. ఊహలు చేస్తాం. కలలు కంటాం. వాటన్నిటికీ ఆధారాలు చూపమంటే కుదురుతుందా? మనసులో ఉండే ఆనందం లేదా ఆందోళన గురించి మాటల్లో చెప్పగలం కానీ పట్టి చూపమంటే వీలవుతుందా? కనుక దేవుడూ అంతే. ఉన్నాడని నమ్మినవాళ్ళకి నిదర్శనాలు కనిపిస్తాయి. నమ్మకం లేనివారిని బలవంతంగా ఒప్పించాల్సిన పని లేదు.

 

దేవుణ్ణి నమ్మేవాళ్ళలో కూడా రెండు రకాలు ఉన్నారు. దేవుడు నిరాకారుడు, నిర్గుణుడు, ఆయనకు రూపం ఇవ్వడమేంటి అనేవారు కొందరు. దేవుడికి ఆకారమిచ్చి, పూజలు చేసేవారు కొందరు.

 

రూపం ఏదయితేనేం దేవుడి విగ్రహం ముందు కూర్చుంటే సుఖశాంతులు అనుభూతికి వస్తాయి. కాసేపు దేవాలయానికి వెళ్తే, మనసెంతో ప్రశాంతంగా ఉంటుంది. కష్టాలు, కలతలు మర్చిపోతాం. మనకు తెలీని ఒక అతీతమైన శక్తి కాపాడబోతున్నట్లు, అండగా ఉన్నట్లు అనిపించి ధైర్యంగా ఉంటుంది. కొండంత ఉపశమనం కలుగుతుంది.

 

ఈ అనంత విశ్వంలో అణువణువునా ఉన్న భగవంతునికి రూపం ఎందుకు అంటే, అది స్థిరత్వం కోసం. మనసును నిమగ్నం చేయడం కోసం. కొందరికి గణపతి ఆరాధ్యదైవం అయితే, మరికొందరికి హనుమంతుడు ఇష్టదైవం. ఎవరి నమ్మకం వారిది, ఎవరి పద్ధతి వారిది. ఏ ఆకృతీ లేకుండా, సృష్టిని నడిపిస్తున్న ఒక అతీత శక్తి ఉందని నమ్మి ప్రార్ధించేవారు చాలా తక్కువ. మనసులో ఏదో ఒక రూపాన్ని ప్రతిష్ఠించుకుని ఆరాధించేవారే అధికశాతం.

 

రాముడు, కృష్ణుడు, దుర్గాదేవి, లక్ష్మీదేవి - ఈ దేవుళ్ళ రూపాలు మన పూజామందిరంలోనే కాదు, గుండె గుడిలోనూ ప్రతిష్టించుకున్నాం. ఆ రూపాన్ని అర్చిస్తున్నప్పుడు మనసు అక్కడ నిమగ్నమౌతుంది. ఆ కాసేపూ ఇతర ఆలోచనలు లేకుండా దేవునిమీద కేంద్రీకృతం అవుతుంది. అందుకే దేవుని సాకారంగా పూజిస్తాం.


Hindu Gods and prayer, Purpose of Prayer, Peace with prayer, great and graceful god, prayer is equal to meditation