వరలక్ష్మీ వ్రతం (Varalakshmee Vratam)
వరలక్ష్మీ వ్రతం
(Varalakshmee Vratam)
శ్రావణ మాసం వచ్చేసింది. ఇక ఎక్కడ చూసినా సందడే సందడి. వీధివీధినా బంతులు, చేమంతులు గుట్టలు పోసి కనువిందు చేస్తాయి. గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు లాంటి శుభకార్యాలకు ఈ నెలలో భలే మంచి ముహూర్తాలు! అంతకు మించి శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళ వారాల పూజలతో ఇళ్ళన్నీ కళకళలాడుతుంటాయి.
రెండో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం ఆనవాయితీ. ఎక్కువమంది రెండోవారమే పూజ చేసుకుంటారు. ఆ వారం గనుక కుదరకపోతే, ఇతర శుక్రవారాల్లో వరలక్ష్మీ వ్రతం నోచుకోవచ్చు. మన తెలుగువాళ్ళే కాకుండా, కర్ణాటక ప్రాంతీయులు కూడా వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటారు.
ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి - ఇలా అష్ట లక్ష్ములు ఉన్నారని తెలుసు కదా! వరలక్ష్మీ వ్రతంతో మనకు సర్వం ప్రాప్తిస్తాయి. శ్రీ (ధనం), భూ (భూమి), సరస్వతి (చదువు), ప్రీతి (ప్రేమ), కీర్తి, శాంతి, తుష్టి (సంతోషం), పుష్టి (బలం) కలుగుతాయన్నమాట.
"పద్మాసనే పద్మాకరే సర్వ లోకైక పూజితే
నారాయణ ప్రియదేవి సుప్రీతా భవ సర్వదా"
అని ప్రారంభించి వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటే లక్ష్మీ కటాక్షం మనపై ఉంటుంది. సర్వ సుఖాలూ సంప్రాప్తిస్తాయి. పెళ్ళయిన స్త్రీలే కాకుండా, వివాహం కాని కన్యలు కూడా వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటారు.
వరలక్ష్మీ వ్రతానికి ఆర్భాటాలు, ఆడంబరాలు అక్కర్లేదు. అమ్మవారి ప్రతిమ, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, కర్పూరం, అగరొత్తులు, తమలపాకులు, వక్కలు, గంధం, అక్షతలు, కొబ్బరికాయ, కలశం, కలశ వస్త్రం, దీపం ఉంటే చాలు. నైవేద్యంగా పాయసం, వడపప్పు, పంచామృతం, శక్తికొద్దీ రెండుమూడు పిండివంటలు చేసి లక్ష్మిని ఆరాధించి ప్రసాదం పంచిపెడితే ఇహంలో సుఖశాంతులు, పరంలో ముక్తి లభిస్తాయి.
వరలక్ష్మీ వ్రత విధానం, పిండివంటలు తదితర అంశాల గురించి మరింత వివరంగా తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
teluguone.com/bhakti/varalakshmi/pujavidanamvideo.html