దేవరుణం ఎలా తీర్చుకోవాలి?

 

దేవరుణం ఎలా తీర్చుకోవాలి?

 

రుణ శేషం, శత్రు శేషం ఉండకూడదు అంటారు. ఈ జన్మలో ఎవరికైనా రుణపడితే, వచ్చే జన్మలో వాళ్ళ ఇంట్లో కుక్కగా పుట్టి ఆ బాకీ తీర్చుకుంటామని పెద్దలు చెప్తుంటారు. ఇంతకీ రుణం అంటే ఇమిటి? బంధుమిత్రుల వద్ద డబ్బు అప్పుగా తీసుకోవడం అని మాత్రమే చాలామందికి తెలుసు. కానీ మరొకరి వస్తువులు లేదా పదార్ధాలు తీసుకుని, తిరిగి ఇవ్వకున్నా అది కూడా బాకీపడటమే అవుతుంది. ఈ సాధారణ రుణాల సంగతి అలా ఉంచితే అనుబంధాల రీత్యా కూడా ఋణపడతాం. ఈ రుణానుబంధాల్లో మొదటిది దేవరుణం.

జీవరాశుల్లోకెల్లా ఉత్కృష్టమైంది మానవ జన్మ. ఎందుకంటే, మనిషికి మాత్రమే మనసు, మేధస్సు ఉన్నాయి. మరి ఇంత ఉన్నతమైన మానవజన్మను మనకు ప్రసాదించిన దేవుడికి తప్పకుండా రుణపడతాం. అందువల్ల దేవ రుణం తప్పకుండా తీర్చుకోవాలి. అది మన కర్తవ్యం.

దేవుడు మనకు కేవలం జన్మను మాత్రమే ఇవ్వలేదు. ప్రకృతిని ప్రసాదించాడు. జీవితంలో కావలసినవన్నీ ఇస్తున్నాడు. నలుసంత గింజలో వట వృక్షాన్ని ఇమిడ్చాడు. మన శరీర ప్రక్రియను మించిన అద్భుతమైన యంత్రం ఉందా? మరి ఈ అపురూపమైన మానవజన్మను సక్రమంగా వినియోగించుకుంటే సుఖం, శాంతి ఉంటుంది. మన పుట్టుక సార్ధకమౌతుంది.

దేవ రుణం ఎలా తీర్చుకోవాలి అంటే, దేవునికి సంపదలేం సమర్పించనవసరం లేదు. ఆరాధనతోనే రుణం తీర్చుకోవాలి. రోజూ సంధ్యావందనం చేయాలి. సంధ్య సమయంలో తప్పనిసరిగా యజ్ఞ కర్మ ఆచరించాలి. సమిధలు, మూలికల మిశ్రమం, ఆవునెయ్యి ఉపయోగించి, యజ్ఞ కర్మ ఆచరించాలి.

యజ్ఞ కర్మ వల్ల మానసిక శాంతి కలగడమే కాదు, వాతావరణ కాలుష్యం నివారణ అవుతుంది. యజ్ఞగుండం ద్వారా వచ్చే పొగలు వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని పోగొట్టి, స్వచ్చతకు దారితీస్తాయి. దీనివల్ల అతివృష్టి, అనావృష్టి సమస్యలు ఏర్పడవు.

కనుక యజ్ఞ కర్మ చేసే వ్యక్తి మాత్రమే కాదు, ఇల్లు, పరిసరాలు బాగుపడతాయి. చుట్టుపక్కల ప్రజలందరూ లబ్ధి పొందుతారు. పంటలు సమృద్ధిగా పండుతాయి. పశుపక్ష్యాదులు బాగుంటాయి. అంటువ్యాధులు వ్యాపించవు. అనారోగ్యాలు దరిచేరవు. అందుకే మన ఇతిహాసాలు, పురాణాల్లో హోమాలు, యజ్ఞాల ప్రస్తావన తరచుగా కనిపిస్తుంది.

ఇప్పుడు యజ్ఞం చేసేవారు అరుదైపోయారు. ఎప్పుడో నూటికికోటికి ఒకసారి యజ్ఞం మాట వినిపిస్తుంది. కానీ, ఇది సరికాదు. యజ్ఞం వల్ల ఒనగూరే లాభాల గురించి తెలిసిన తర్వాత అయినా యజ్ఞ కర్మ నిర్వహించడానికి ముందుకు రావాలి. యజ్ఞయాగాదులు చేయడమేంటి... మనం రాజుల కాలానికి వెళ్తున్నామా అనే అపోహ నుంచి బయటపడాలి. యజ్ఞాలు నిర్వహిస్తే, మనము, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. యంత్రాలు, వాహనాల వల్ల పేరుకుపోతున్న కాలుష్యాన్ని కొంతయినా నిరోధించగల్గుతాం. యజ్ఞయాగాదులు నిర్వహించడం ద్వారా దేవరుణం తీర్చుకున్నట్టు అవుతుంది అని చెప్తున్నాయి పురాణాలు. ఒకరకంగా దేవ రుణం తీర్చుకోవడం అంటే, మనకు మనం మేలు చేసుకోవడమే! కాదా, మీరే చెప్పండి?!