కేరళీయుల విశిష్ట పండుగ ఓనం!

 

కేరళీయుల విశిష్ట పండుగ ఓనం!


పండుగలు కేవలం మతాలకు అనుగుణంగానే కాదు. రాష్ట్రాలు మారితే పండుగల తీరు, తెన్ను కూడా మారుతుంది. ప్రతి సంవత్సరం  కేరళ ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ ఒకటుంది. అదే ఓనమ్. ఓనం అనేది కేరళలో జరుపుకునే పది రోజుల పండుగ.  ఈ శుభ సందర్భంగా మహాబలి తిరిగి వస్తాడని వారు అభిప్రాయపడతారు. అసలు ఓనం పండుగ ఏంటి?? దాని వెనుక కథ ఏంటి?? పదిరోజుల ఈ పండుగ జరిగే తీరు, తెన్ను, కెరళీయులు ఈ పండుగకోసం చేసే సందడి తెలుసుకోవలసిందే!!

కేరళలో శుభప్రదమైన పండుగ - తిరు ఓణం లేదా తిరువోణం అని కూడా పిలువబడే ఓనంను  కేరళ ప్రజలు  పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటారు ఓనం అనేది  రాజు మహాబలి రాష్ట్రానికి తిరిగి వచ్చిన సందర్భంగా జరుపుకునే పండుగ. అంతేకాదు కేరళ వారికి వరికోత జరిగే సమయం కూడా ఇదే. అంటే తెలుగువారి సంక్రాంతిలా కెరళీయులకు ఇది  అన్నమాట. ఈ పండుగ మలయాళీ క్యాలెండర్ ప్రకారం ఆగస్ట్,  సెప్టెంబర్  నెలల మధ్యలో వస్తుంది.  ఇది మలయాళ సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది, మాలయాళీయుల ప్రకారం దీనిని కొల్ల వర్షం అని పిలుస్తారు.  ఇది 10 రోజుల సుదీర్ఘ పండుగ, ఈ పది రోజులలో ప్రతి ఒక్కటి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. 

పది రోజులు ఏవంటే….


తెలుగువారు నవరాత్రులు జరుపుకున్నట్టు మలయాళీ ప్రజలు కూడా ఓనం పండుగను పదిరోజుల పాటు జరుపుకుంటారు. ఈ పదిరోజులకు పేర్లు కూడా ఉన్నాయి. మొదటి రోజును అతం అని, ఆ తర్వాత చితిర, చోడి, విశాఖం, అనిజం, త్రికెట్ట, మూలం, పూరాదం, ఉత్రదోమ్ మరియు తిరువోణం అని పిలుస్తారు.  తిరువోణం చివరి రోజు. దీన్నే ఓనం అని అంటారు. ఇది అత్యంత పవిత్రమైన పండుగగా వారు భావిస్తారు.


పండుగ వెనుక కథ!!


ఓనం పండుగ వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరమైనది మాత్రమే కాదు అందరికీ తెలిసినది కూడా. మహాబలిగా పిలవబడే ప్రహ్లాదుడి మనవడు మహాబలి చక్రవర్తి. ఈయన ప్రహ్లాదుడి ఒడిలో కూర్చుని మహావిష్ణువు గురించిన భక్తి పెంచుకున్నాడు. అయితే ఇతనిలో అహంకారం ఎక్కువ. ఆ అహంకారాన్ని అణిచివేయాలని మహావిష్ణువు వామనుడి అవతారం ఎత్తి బలి చక్రవర్తి దగ్గరకు వెళతాడు. అప్పుడు బలి చక్రవర్తి వామనుడిని చూసి "బ్రాహ్మణుడా నీకేం కావాలి??" అని అడుగుతారు.


వామనుడు "నేను అడిగింది నువ్వు ఇవ్వలేవు" అని అంటాడు. అయితే మాట తప్పే అలవాటు లేని మహాబలి వామనుడితో "నువ్వేమడిగినా ఇస్తాను. నేను ఇవ్వలేనిది అంటూ ఏది లేదు నాకు అంతా సాధ్యమే" అంటాడు. ఆ అహంకారమే మహాబలిని దెబ్బ తీసింది. వామనుడు మూడు అడుగుల నేల అడగగా ఇదేమంత కష్టం కాదని సరే అంటాడు మహాబలి. అప్పుడే వామనుడు విశ్వరూపానికి మారిపోయి భూమి మీద ఒక అడుగు, ఆకాశం మీద ఒక అడుగు పెట్టి ఇంకొక అడుగు ఎక్కడ తీసుకోవాలి అని అంటాడు.


బలిచక్రవర్తి తన తలను చూపించి, మూడవ అడుగు నా మీద పెట్టండి అని వామనుడి ముందు కూర్చుండిపోతాడు. వామనుడు తన అడుగును మహాబలి తలమీద ఉంచి ఆయన్ని పాతాళానికి తొక్కేస్తాడు. అప్పటి నుండి మహాబలి పాతాళంలో ఉండిపోయాడు. ఆయన ప్రతిసంవత్సరం కేరళలో ఉన్న రాజ్య ప్రజలను చూడటానికి వచ్చే సందర్భమే ఓనం. ఆయన ఓనం సందర్భంగా కేరళలో అందరినీ కలుసుకుంటారని, ఆరోజు అందరి ఇళ్లకు ఆయన వచ్చి వెళతాడని నమ్ముతారు. అందుకోసమే ఎంతో గొప్పగా ఓనం పండుగను చేసుకుంటారు.


ఓనం సందడి ఎలా ఉంటుంది??


అందరూ పండుగలు చేసుకున్నట్టు కేరళ వారు ఓనం పండుగను తమదైన శైలిలో చేసుకుంటారు. ఉదయాన్నే స్నానం, కొత్త బట్టలు. ముఖ్యంగా తెలుపు, బంగారు రంగు అంచు కలిగిన బట్టలు ధరించడం వీరి సంప్రదాయం. అలాగే పువ్వులు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి వీరి పండుగలో. ఇల్లంతా పువ్వులతో అలంకరిస్తారు. ఇంటిముందు ముంగిట్లో ముగ్గులాగా రంగురంగుల పువ్వులతో పూకలం వేస్తారు. ఇది మాత్రమే కాకుండా ఇల్లంతా కలసి ఒకటే అరటి ఆకులో భోజనం చేయడం ఈ పండుగ రోజు ప్రత్యేకత. పెద్ద అరటి ఆకులో చాలా ఆహారాన్ని, వడ్డించి అందరూ కలసి తింటారు. దాదాపు 26 రకాల ఆహారపదార్థాలు వీరి భోజనంలో ఉంటాయి.


మరికొన్ని సందడులు!!


ఓనం పండుగరోజు ప్రజలు ఒనకలికల్ (పండుగ సమయంలో ఆడే వివిధ ఆటలు) ఆడతారు. అడవిజాతి వారి నృత్యాన్ని పోలి ఒకరినొకరు జట్టుగా పట్టుకుని వీరు ఆడే ఆట ముచ్చటగా ఉంటుంది. ఇంకా వల్లంకలి అని పిలువబడే పడవ పందెం, పులికలి అని పిలవబడే పులులు, వేటగాళ్ల లా అభినయించే ఆట ముఖ్యంగా ఉంటాయి.  ఓనం సమయంలో విలువిద్య వంటి విభిన్న కార్యకలాపాలను కూడా అక్కడక్కడా ప్రదర్శిస్తూ ఉంటారు.


ఇలా కేరళీయుల ఓనం పండుగ  భారతీయ పండుగలలో ఒక విశిష్టతను సంపాదించుకుంది.


                                  ◆నిశ్శబ్ద.