తెలుగు వారి అసలైన హనుమాన్ జయంతి విశేషమిదే!

 

తెలుగు వారి అసలైన హనుమాన్ జయంతి విశేషమిదే!

హనుమాన్ పేరు వినగానే చెప్పలేనంత దైర్యం, శక్తి పోగవుతాయి.  భారతదేశంలో హనుమాన్  జయంతిని ఏడాదిలో రెండుసార్లు జరుపుకుంటారు. చైత్ర శుద్ద పౌర్ణమి రోజు జరుపుకునే హనుమాన్ జయంతి ఒకటైతే.. వైశాఖ మాస బహుళ దశమి రోజున జరుపుకునే హనుమాన్ జయంతి రెండవది.  పరాభవ నామ సంవత్సరంలో వైశాఖ మాస బహుళ దశమి మే 12వ తేదీన వచ్చింది.  అందులోనూ ఈసారి వైశాఖ మాస బహుళ దశమి తిథి మంగళవారం నాడు రావడంతో ఈసారి హనుమాన్  జయంతికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ హనుమాన్ జయంతి విశేషం,  హనుమాన్ జయంతి రోజు హనుమంతుడిని ఎలా ఆరాధిస్తే ఫలితం ఉంటుంది?  తెలుసుకుంటే..

హనుమాన్ జయంతి..

హిందూ పంచాగం ప్రకారం తెలుగు రాష్ట్రాలలో హనుమాన్ జయంతిని వైశాఖ బహుళ దశమి రోజు జరుపుకుంటారు. పురాణాల ప్రకారం హనుమంతుడు వైశాఖ బహుళ దశమి రోజునే జన్మించాడట. ఇతర రాష్ట్రాలలో హనుమాన్ జయంతిని చైత్ర మాసంలో జరుపుకుంటే.. తెలుగు రాష్ట్రాలు మాత్రం వైశాఖ మాసంలో జరుపుకుంటారు.

హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణ..

హనుమాన్ జయంతి  సందర్బంగా హనుమాన్ చాలీసా సామూహిక పారాయణలు,  సుందరకాండ పారాయణ మొదలైనవి ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. అలాగే హనుమంతుడికి వడపప్పు, పానకం నైవైద్యంగా పెడతారు.

హనుమాన్ దీక్ష..

చాలామంది హనుమాన్ దీక్ష వేసుకుంటారు.  ఈ హనుమాన్ దీక్షను 41రోజుల పాటు కొనసాగించి..చివరగా మండలం రోజులు ముగిశాక హనుమాన్ జయంతి నాడు ముగిస్తారు.

హనుమ అనుగ్రహానికి పరిహారాలు..

తమలపాకు పూజ..

హనుమంతుడికి తమలపాకుల పూజ అంటే చాలా ప్రీతి.  చాలావరకు హనుమంతుడి దేవాలయాలలో తమలపాకుల పూజ పెద్ద ఎత్తున చేయిస్తూ ఉంటారు.  హనుమాన్ జయంతి రోజు దేవాలయాలలో లేదా.. ఇంట్లో అయినా.. హనుమంతుడికి తమలపాకుల పూజ చేసుకోవడం ఎంతో ఉత్తమం. ముఖ్యంగా హనుమంతుడి అష్టోత్తరం చదువుతూ 108 తమలపాకులతో పూజ చేసుకోవడం లేదా తమలపాకులను మాలగా తయారు చేసి హనుమంతుడికి వేయడం వల్ల హనుమంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చు.

నవ ధాన్యాల దీపం..

హనుమాన్ జయంతి రోజు నవధాన్యాల దీపం పెట్టడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.  హనుమాన్ జయంతి రోజు ఒక  తమలపాకుపై నవ ధాన్యాలు పోసి దానిపై మట్టి ప్రమిద ఉంచాలి. సింధూరం, ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెను ఉపయోగించి ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఇలా ఐదు వత్తులతో వెలిగించే దీపం గ్రహాల పరంగా ఉన్న దోషాలను అన్నింటిని తొలగిస్తుందట.

ఎరుపు అక్షింతలు..

విరగని బియ్యంలో ఆవునెయ్యి, సింధూరం వేసి ఎరుపు అక్షింతలు తయారు చేసుకోవాలి. ఇంట్లో హనుమంతుడి పటం లేదా విగ్రహానికి ఎరుపు అక్షింతలను పూజలో వాడాలి.

హనుమంతుడు రాముడిని తలచితే తొందరగా ప్రసన్నుడు అవుతాడు. అందుకే..

"ఆపదమపహార్థారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం"  అనే మంత్రాన్ని కానీ

"శ్రీరామ దూతస్య శరణం ప్రపద్యే" అనే మంత్రాన్ని కానీ జపం చేయాలి.

                                 *రూపశ్రీ.