సంతోష దుఃఖాల గురించి మనువు ఏమి చెప్పాడు?
సంతోష దుఃఖాల గురించి మనువు ఏమి చెప్పాడు?
సంతోషము, దుఃఖం మనిషి జీవితంలో ఎంతో ప్రముఖమైనవి. అవి నిరంతరంగా జీవితలలోకి ఒకదాని తరువాత మరొకటి వచ్చి పోతూ ఉంటాయి. అయితే ఈ సంతోష, దుఃఖాల గురించి మనుస్మృతిలో మనువు ఎంతో చక్కగా వివరించాడు. అప్పటి కాలానికే మనిషి తత్వాన్ని ఇంత బాగా వివరించడం మనిషి మనస్తత్వాన్ని చక్కగా అర్థం చేసుకుంటేనే సాధ్యమని అనిపిస్తుంది. మనుస్మృతిలో ఉన్న ఈ శ్లోకాలు చూస్తే… వాటి వివరణ అర్థం చేసుకుంటే అదే విషయం స్పష్టమవుతుంది.
యద్యుత్పరవశమ్ కర్మ తత్తద్యత్నేన వర్జయేత్।
యద్యదాత్మవశమ్ తు స్యాత్తత్తద్సేవేత్ యత్నతః॥
ఇతరులపై ఆధారపడేట్టు చేసే పనులకు దూరంగా ఉండాలి. తాను నియంత్రించ గలిగే పనులను వదలకుండా చేయాలి.
మనుస్మృతిలో మనువు చేసిన సూచన ఇది. మానవ మనస్తత్వాన్ని కాచి వడబోసి చేసిన సూత్రం ఇది. సాధారణంగా ప్రతి వ్యక్తి స్వతంత్రంగా ఉండేందుకే ఇష్టపడతాడు. గమనిస్తే, చిన్న పిల్లవాడు సైతం, కాస్త ఆత్మవిశ్వాసం రాగానే పెద్దల చేయి విదిలించుకుని తనంతట తానే నడవటానికి ఇష్టపడతాడు. నాలుగు అడుగులు వేసి పడిపోయినా, గర్వంగా, సంతోషంతో కిలకిల నవ్వుతాడు. అలా స్వయంగా నడిచి, సంతోషించే పిల్లవాడి సంతోషం తల్లిదండ్రులకు అపరిమితమైన ఆనందం కలిగిస్తుంది. కానీ స్వతంత్రంగా నడవటం నేర్చిన పిల్లవాడు, తనంతట తాను పరుగులిడాలని ఉబలాట పడుతూంటే పెద్దలు ఆ ఉత్సాహానికి అడ్డుకట్ట వేయాలని చూస్తారు. అతడి స్వేచ్ఛను అరికట్టాలని చూస్తారు. అనేక సంఘర్షణలకు, అసంతృప్తులకు ఇది దారి తీస్తుంది.
తాను స్వతంత్రంగా పని నిర్వహించగలనన్న ఉత్సాహం పిల్లవాడిది. స్వతంత్రంగా పని సమర్ధంగా నిర్వహించగలడో, లేదోనన్న భయం పెద్దలది. ఇది అర్థం చేసుకున్న మనువు సంతోషాన్ని, దుఃఖాన్ని నిర్వచించాడు.
సర్వ పరవశం దుఃఖం సర్వమాత్మవశం సుఖమ్ ఏతద్విద్యా త్వమాసేన లక్షణం సుఖదుఃఖయో
అన్ని విధాలుగా స్వతంత్రంగా ఉండటం సంతోషం, పరులపై ఆధారపడి ఉండటం దుఃఖం. ఇదే సుఖదుఃఖాల అసలైన నిర్వచనం.
ఒక రకంగా మన ఉద్యోగాల వల్ల మనలో కలిగే అసంతృప్తికి, దుఃఖానికి ఇది ప్రధానకారణం. 'స్వాతంత్ర్యం' అనేది విశృంఖలత్వం కాదు. తన ఇష్టానుసారం వ్యక్తి స్వచ్ఛందంగా నియమాలలో ఒదిగి ఉండటం నిజమైన స్వాతంత్ర్యం. పెద్దల మాట వినటం, సామాజిక నియమాలు పాటించటం, తన వారిని గౌరవించటం, దాంపత్య ధర్మం పాటించటం వంటివన్నీ వ్యక్తి స్వాతంత్య్రానికి ఏ రకంగానూ భంగం కలిగించవు.
కానీ ఉద్యోగం విషయంలో వ్యక్తి తీవ్రంగా గాయపడతాడు. తన ఇష్టానికి, ఉద్యోగానికి నడుమ సంఘర్షణకు గురవుతాడు. ఎందుకంటే ప్రస్తుతం మనం చేస్తున్న ఉద్యోగాలు ఏ రకంగానూ మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించవు. మనలోని ప్రవృత్తిని ప్రకటించవు. మనలో నిద్రాణ స్థితిలో ఉన్న సృజనాత్మకతను ఏ రకంగానూ సంతృప్తి పరచలేవు. అందుకే ప్రస్తుత కాలంలో ఎంతోమంది ఉద్యోగాలు చేసే విషయంలో అంతఃసంఘర్షణకు లోనవుతూ ఉంటారు.
ఇక్కడ గమనించవలసిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే… కొందరికి లభించిన ఉద్యోగం చేస్తుండటం ఇష్టం ఉండదు. అలాగని వదిలేద్దామా అంటే వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండదు. అందువల్ల వారిలో నిత్యం ఉద్యోగానికి, తృప్తికి నడుమ వాదులాట జరుగుతూనే ఉంటుంది. దీన్నే మనుస్మృతిలో ఎప్పుడో వివరించి చెప్పారు.
◆నిశ్శబ్ద