హిడింబికి కూడా గుడి ఉంది తెలుసా

 

 

హిడింబికి  కూడా గుడి ఉంది తెలుసా

 


మన దేశంలో గుడులు ఎంత ప్రాశస్త్యం పొందాయో మళ్లీ మళ్లీ చెప్పక్కర్లెద్దు. ఒక వైపు యముడికి గుడి ఉంటే  మరో వైపు బ్రహ్మదేముడికి గుడి ఉంది. అలాగే భీముడి భార్య అయిన హిడింబికి కూడా మన దేశంలో ఒక గుడి ఉంది. అది కూడా ఎక్కడో కాదు హిమాచల్ ప్రదేశ్ లోని  కులులో ఉంది.


హిడింబి, హిడింబాసురుడు ఇద్దరు అన్నా, చెల్లెళ్ళు. హిడింబికి తన అన్నయ్య బలాన్ని చూసి ఎంతో గర్వంగా ఉండేది. ఎవరైతే తన అన్నను ఓడిస్తాడో అతనినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. పాండవులు అరణ్యవాసం చేసే రోజుల్లో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు బస చేసారట. ఆ సమయంలో హిడింబాసురుడు భీమునిపై యుద్ధానికి వెళ్లి ఓడిపోయి, భీముని చేతిలో మరణిస్తాడు. ఆ తరువాత భీముడికి, హిడింబికి పెళ్లి జరుగుతంది. వీళ్ళ ఇద్దరికీ పుట్టినవాడే ఘటోత్కచుడు. అయితే పాండవులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళేటప్పుడు హిడింబి వారితో కలిసి వెళ్ళకుండా అక్కడే ఉండిపోయి, తరువాతి కాలంలో తపస్సు చేసుకుంటూ కాలం గడిపిందిట.

 


హిడింబి తపస్సు చేసుకుంటూ మోక్షం పొందిన దగ్గరే గుడి కట్టారని ఆలయ చరిత్ర చెపుతోంది. ఆలయం మొత్తం చెక్కతో కట్టబడింది. ఈ గుడి దగ్గర నుండి 70 మీటర్ల దూరంలో ఘతోత్కచుడికి కూడా ఒక గుడి ఉందిట. హిడింబి గుడి లోపల ఒక పెద్ద రాయి మీద హిడింబా దేవి కాలి ముద్ర కూడా ఉంటుంది. గూగుల్ మ్యాప్ లో చూసినా ఈ కాలి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది కూడా.


ఇక ఉత్సవాల విషయానికి వస్తే ఇక్కడ జరిగే డూన్గరి మేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ మేళాలో అక్కడి ఆడ పిల్లలు సంప్రదాయ దుస్తుల్లో తయారయ్యి హిడింబి దేవి అనుగ్రహం కోసం నృత్యం చేస్తారు. వసంత ఋతువులో జరిగే ఉత్సవం కావటం వల్ల భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి హిడింబా దేవిని పూజిస్తారు. కులూ వెళ్ళాల్సి వస్తే ఈ గుడిని తప్పకుండా దర్శించి తీరాల్సిందే.

..కళ్యాణి