పూర్వం గురుకులాలు ఎలా ఉండేవి? (Gurukulas)
పూర్వం గురుకులాలు ఎలా ఉండేవి?
(Gurukulas)
ఈరోజు "ఉపాధ్యాయుల దినోత్సవం". మనమంతా అనేకమంది గురువుల దగ్గర చదువు నేర్చుకుని వచ్చిన వాళ్ళమే. వాళ్లకి మనం ఎప్పటికీ రుణపడే ఉంటాం. ''తల్లీ తండ్రీ గురువూ దైవం'' అంటారు. తల్లిదండ్రుల తర్వాతి స్థానం తప్పనిసరిగా గురువు గారిదే. అవును, దేవుడి స్థానం కూడా గురువు తర్వాతే. అందుకే
''గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరా
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః''
అన్నారు. ఉపాధ్యాయుడు ప్రత్యక్షంగా కనిపించే దైవం అంటే ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. గురువులే లేకపోతే లోకమే చీకట్లో పడి కొట్టుకుపోతుంది. ఈ ''టీచర్స్ డే'' ను పురస్కరించుకుని ఒకసారి వెనకటి గురుకులాలను గుర్తుచేసుకుందాం.
పూర్వం విద్యాభ్యాసం చేయదలచిన చిన్నారులను తల్లిదండ్రులు గురుకులానికి పంపేవారు. ఇక ఆ విద్యార్థులు 12 సంవత్సరాలపాటు గురువుగారి దగ్గరే ఉండి వేదాలు, రామాయణ, మహాభారతాలు, ఇతర కావ్యాలు అభ్యసించేవారు. భోజన వసతులు గురువుగారే కల్పిస్తారు. కేవలం ఉద్గ్రంధాలే కాదు, ఇతర శిక్షణలు కూడా ఇచ్చేవారు. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేవారు.
చదువుకునేందుకు గురుకులానికి వెళ్ళిన శిష్యులు, అచ్చం గురువుగారి పిల్లల్లాగే నడచుకునేవారు. గురువుగారి పట్ల ఆత్మీయతను పెంచుకుని, వినయంగా, విధేయంగా ఉండేవారు. తమకు విద్యాబుద్దులు నేర్పే గురువుగారికి సదా సేవ చేస్తూ ఆయన కనుసన్నల్లో మెలిగేవారు. మహా పండితుల పుత్రులైనా, ధనవంతుల పుత్రులైనా చదువుకుంటూనే అక్కడి పనుల్లో పాలుపంచుకోవాలి.
గురుకులానికి కొంత భూమి ఉంటుంది. ఆ పొలం సాగుచేయడంలో విద్యార్థుల పాత్ర ముఖ్యమైంది. గురుకులంలో ఉన్న పశువులను మేపుకుని వచ్చేవారు. ఈ పాడీపంటా గురుకుల అవసరాలు తీరగా మిగిలినవాటిని విక్రయించేవారు. ఆ సొమ్ముతో తమకు అవసరమైన సరకును కొనుగోలు చేసేవారు. ఇంకా మిగిలితే ఆ ధనాన్ని గురుకులం పేరుతో భద్రపరిచేవారు.
విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కనుక పనులను అందరూ పంచుకునేవారు. దాంతో ఏ ఒక్కరికీ పని భారంగా అనిపించేది కాదు. పైగా అందరూ కలసిమెలసి ఆడుతూపాడుతూ చేసుకునే వాతావరణం ఉండేది. దాంతో అసలే అలసట తెలిసేది కాదు.
ఇకపోతే ప్రతి విద్యార్థికీ ఒక మోదుగు కర్రను ఇచ్చేవారు. గురుకులాలు ఎప్పుడూ ఊరికి దూరంగా ప్రశాంత వాతావరణంలో ఉండేవి. దాంతో అడవి మృగాలు వచ్చే అవకాశం ఉండేది. అలాగే, విద్యార్థులు వ్యవసాయ పనులు, పశువులను కాయడం మొదలైన పనులు చేసేటప్పుడు పామూపుట్రా ఎదురయ్యేందుకు అవకాశం ఉండేది. ఒకవేళ ఇలాంటి ప్రమాదాల బారినపడితే తమను తాము రక్షించుకునేందుకు మోడుగుకర్ర ఉపయోగపడేది.
''ఆయుర్వర్చో యశో బలాభివ్రుద్ధ్యర్థం
గో సర్ప భయనివృత్యర్థం పలాశ దండ ధారణం కరిష్యే''
అనే మంత్రాన్ని స్మరిస్తూ మోదుగు దండాన్ని ఉపయోగిస్తారు. మోదుగ వృక్షంపై చంద్రుని ప్రభావం ఉంటుంది. ఈ కర్రను చేతిలో ఉంచుకోవడం వల్ల రక్షణ లభించడం మాత్రమే కాక శాంతి చేకూరుతుంది. మోదుగు కర్రను ఏదో తమాషాకో, ఎవర్నో దండించదానికో, కొట్టదానికో ఉపయోగించకూడదు. విష జంతువులూ, క్రూర మృగాల బారినుండి తమను తాము రక్షించుకోడానికి ఉపయోగించాలి. చంద్రుడిలాగే మోదుగు చెట్టు కూడా శాంతమైంది, సాత్వికమైంది. మోదుగు వృక్షంలో ఔషధ గుణాలు ఉన్నాయి. అందువల్ల అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతుంది. సాత్వికంగా ఉండేందుకు దోహదపడుతుంది.