ఇంట్లో పొరపాటున కూడా లక్ష్మీ దేవి ఫొటో ఇలా ఉన్నది పెట్టకండి..!
ఇంట్లో పొరపాటున కూడా లక్ష్మీ దేవి ఫొటో ఇలా ఉన్నది పెట్టకండి..!
దేవతలను పూజించడం హిందూ సంప్రదాయంలో ప్రధాన భాగం. సాధారణంగా ఇంటి దేవుడు, కుల దేవుడు, గురువు, ఆర్థిక పరిస్థితి, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించే ఉద్దేశ్యంతో వివిధ రకాల దేవుళ్ల విగ్రహాలు, చిత్రపటాలను పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటాం. తమ ఇంట్లో ధనానికి లోటు ఉండకూడదని, ఆర్థికంగా బాగుండాలనే ఆలోచనతో లక్ష్మీదేవి ఫొటోను ఇంట్లో పెట్టుకుంటారు. కొందరు లక్ష్మీదేవి విగ్రహాలు కూడా పెట్టుకుంటారు. అయితే లక్ష్మీదేవి చిత్రపటం ఎలా ఉన్నా అందులో ఉన్నది అయితే లక్ష్మీదేవినే కదా అని చాలామంది అనుకుంటారు. నిజానికి దేవుడు ఏ రూపంలో ఉన్నా మంచే చేస్తాడు కదా అనే మూర్ఖత్వం చాలామందిలో ఉంటుంది. పూజించదగిన రూపాలు కొన్ని ఉంటాయి. అలాంటి విగ్రహాలు, చిత్రపటాలను ఇంట్లో ఉంచుకుంటేనే మంచిది. ఇంతకీ లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటాన్ని పూజకోసం ఎలాంటిది ఉంచుకోవాలి? ఎలాంటిది ఉంచుకోకూడదు? తెలుసుకుంటే..
గుడ్లగూబ..
లక్ష్మీదేవిని ఐశ్వర్య దేవతగా భావిస్తారు. గుడ్లగూబ తన వాహనంగా పరిగణించబడుతుంది. అయితే గుడ్లగూబపై స్వారీ చేస్తున్న లక్ష్మీ దేవి చిత్రాన్ని ఇంట్లో ఉంచకూడదు. లక్ష్మీ దేవి గుడ్లగూబతో కలిగిన చిత్రపటం లేదా విగ్రహం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి గుడ్లగూబపై స్వారీ చేస్తుందని ఒక నమ్మకం. అంటే ధనం నిలకడగా, స్థిరంగా ఉండదట. అందువల్ల గుడ్లగూబతో కూడిన లక్ష్మీ దేవి చిత్రపటం ఇంట్లో ఉండటం మంచిది కాదు.
నిలబడి..
శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి నిలబడి ఉన్న భంగిమలో ఉన్న ఫొటో ఇంట్లో ఉండటం మంచిది కాదట. నిలబడి ఉన్న భంగిమలో లక్ష్మీ దేవి ఒక చోట నిలకడగా ఉండదట. ఈ భంగిమలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆ ఇంట్లో ధనం కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోతూ ఉంటుందట. లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం ఎల్లప్పుడూ కూర్చుని ఉన్న భంగిమలోనే ఉండాలట.
ఎలాంటి చిత్రపటం మేలు..
లక్ష్మీదేవి తామరపువ్వుపై కూర్చొని బంగారు నాణేలను కురిపిస్తున్న చిత్రం శుభప్రదంగా పరిగణించబడుతుంది . ఇలాంటి చిత్రపటాలు సంపద, శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీ దేవి శక్తిని సూచిస్తాయి. ఇలాంటి ఫొటోలు ఇంట్లో ఉంటేనే మంచిది.
ఆశీర్వాద భంగిమలో కూర్చొన్న లక్ష్మీదేవి పటాన్ని కూడా ఇంట్లో ఉంచడం శుభప్రదం . అలాంటి చిత్రం ఇంట్లో ఉంటే ఇంట్లో సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది. లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఆ ఇంటి వ్యక్తులపై ఉంటుంది.
*రూపశ్రీ.