వినాయకుడి విశేషాలెన్నో చెప్పే గణేశ పురాణం

 

వినాయకుడి విశేషాలెన్నో చెప్పే గణేశ పురాణం!

 

 


హిందూ ధర్మంలో అష్టాదశ (18) పురాణాల ప్రత్యేకత చాలామందికి తెలిసిందే! వివిధ దేవీదేవతల మహిమలను కీర్తిస్తూ సాగే ఈ గ్రంథాలను మహాపురాణాలు అని కూడా అంటాము. ఇవే కాకుండా మనకి 18 ఉప పురాణాలు కూడా ఉన్నాయి. వివిధ దేవతల చరిత్రలను చెబుతూ సాగే ఈ ఉపపురాణాలలో ‘గణేశ పురాణం’ చాలా ప్రముఖమైనది. ఆ గణేశ పురాణంలోని కొన్ని విశేషాలు ఇవిగో…

 

- గణేశ పురాణానికి వినాయక పురాణం అని కూడా పేరు. దీని రచనా కాలం ఎప్పటిది అన్న విషయం మీద చాలా వాదనలు వినిపిస్తున్నాయి. బహుశా 13వ శతాబ్దం నాటిదై ఉంటుందని చాలామంది అభిప్రాయం.

 

- 13వ శతాబ్దం నాటికి మన దేశం అన్యమతస్థుల దాడిలో అతలాకుతలం అయిపోతోంది. దేవాలయాలను ధ్వంసం చేయడం, బలవంతపు మతమార్పిడి లాంటి ఘటనలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అలాంటి సమయంలో రాయబడిన ఈ గణేశ పురాణం హిందూ మతం ఎలాంటి దాడినైనా తట్టుకుని నిలబడేందుకు తగిన శక్తిని అందించి ఉంటుందనడంలో సందేహం లేదు.

 

- గణపతి పురాణం రెండు భాగాలుగా కనిపిస్తుంది. మొదటి భాగం ఉపాసనాఖండం. ఇందులో ఆ గణేశుని పూజించే తీరు కనిపిస్తుంది. ధ్యానం ద్వారా ఆయనను నిర్గుణంగానూ, విగ్రహారాధన ద్వారా సగుణంగానూ ఆయనను పూజించవచ్చని చెబుతుంది. ఇక రెండో భాగం క్రీడాఖండం. ఇందులో ఆ గజాననుడి అవతార విశేషాలన్నీ వివరంగా కనిపిస్తాయి.

 

- గణేశుని ఆరాధకులకు ఇష్టమైన ‘గణేశ సహస్రనామం’ ఈ పురాణంలోనే కనిపిస్తుంది. ‘గం’ అనే బీజమంత్రం ద్వారా ఆ స్వామి ప్రసన్నుడవుతాడనే రహస్యమూ ఇందులోనే కనిపిస్తుంది. గణేశ పురాణంలో కనిపించే మరో విశేషం ‘గణేశ గీత’. వరేణ్యుడనే రాజుకీ, గజాననుడికీ మధ్య జరిగే సంవాదమే ఈ గణేశ గీత. ఇది ఇంచుమించు భగవద్గీతనే తలపిస్తుంది. భక్తి, జ్ఞాన, కర్మయోగాల ప్రస్తావన కనిపిస్తుంది.

 

- గణేశ పురాణం ప్రకారం ఆయన నాలుగు యుగాలలోన నాలుగు అవతారాలని ధరించాడు. కృతయుగంలో సింహ వాహనుడైన వినాయకునిగా, త్రేతాయుగంలో మయూరం వాహనంగా కల మయూరేశ్వరునిగా, ద్వాపర యుగంలో మూషిక వాహనుడైన గజాననుడిగా, కలియుగంలో అశ్వారూఢుడైన ధూమ్రకేతునిగా ఈ స్వామి అవతరించి ఆయా కాలాలలోని దుష్టులను సంహరించినట్లుగా గణేశ పురాణం పేర్కొంటోంది.

 

- హిందూమతంలో కొందరు గణపతినే ఈ సృష్టికి అధిపతిగా భావిస్తారు. ఈ శాఖను గాణపత్యం అంటారు. ఈ శాఖవారికి గణేశ పురాణమే మూల గ్రంథం.

 

- వినాయకుని మహిమను వివరించేందుకు ముద్గల పురాణం అనే మరో ఉపపురాణం కూడా ఉంది. మనం తరచూ వినే 32 రూపాల వినాయకుని గురించి ఈ ముద్గల పురాణంలోనే కనిపిస్తుంది.

- నిర్జర.