Read more!

తల్లిప్రేమకు ఓ చక్కని నిదర్శనం!!

 

తల్లిప్రేమకు ఓ చక్కని నిదర్శనం!!

రామాయణంలో రాముడు అడవులకు వెళ్ళిపోయాక, దశరథ మహారాజు చనిపోయాక, దశరథ మహారాజు అంత్యక్రియలు చేయించడానికి భరతుడిని పిలిపిస్తారు. గతం రోజు తనకు వచ్చిన కలతో బెంగగానే అయోధ్య నగరానికి చేరుకుంటాడు భరతుడు. అతను వచ్చి రాగానే ధశరథుడిని చూడాలని వెతుకుతూ కైకేయ దగ్గరకు వెళ్లగా, కైకేయ జరిగింది మొత్తం వివరంచి చెప్పి "భరతా!! నీకోసమే ఇంత చేసాను. ఇప్పుడు ఇక్కడ నీకు అడ్డుగా ఎవరూ లేరు. దీనికి నువ్వే రాజువు అవుతావు. అయోధ్య రాజ్యం ఇక నుండి నీదే. మీ నాన్న అంత్యక్రియలు అయిపోగానే వశిష్టుడితో మాట్లాడి పట్టాభిషేకం చేయించేద్దాం అంటుంది.

అప్పుడు భరతుడు కైకేయ వైపు అసహ్యంగా చూస్తూ "ఒకానొకనాడు ఆకాశంలో కామధేనువైన సురభి(దేవతా ఆవు) వెళ్ళిపోతుండగా, భూమండలం మీద ఒక రైతు విపరీతమైన ఎండలో, శోషించిపోతున్న రెండు ఎద్దులని నాగలికి కట్టి, డొక్కలతో పొడుస్తూ సేద్యం చేయిస్తుంటే సురభి కన్నులవెంట నీరు కార్చింది (ఈ భూమండలం మీద ఉన్న ఆవులు, ఎద్దులు ఆ సురభి యొక్క సంతానమే). దేవేంద్రుడు ఐరావతం మీద వెళుతుండగా, ఆయన చేతి మీద సురభి కన్నీటి చుక్కలు పడ్డాయి. దివ్యపరిమళం కలిగిన కన్నీటి బిందువులు ఎవరివా అని ఇంద్రుడు పైకి చూసేసరికి, సురభి ఏడుస్తూ కనిపించింది. 

వెంటనే ఇంద్రుడు ఐరావతం దిగి "అమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు" అని అడిగాడు. 

అప్పుడా సురభి "నాకు కొన్ని కోట్ల మంది బిడ్డలు ఉండచ్చు. ఈ భూమండలంలో ఉన్న ఆవులు, ఎద్దులు నా శరీరం నుండి వచ్చినవే. ఇంతమంది బిడ్డలు ఉన్నా, ఈ రెండు ఎద్దులని రైతు పొడుస్తూ, ఎండలో సేద్యం చేయిస్తుంటే, నా బిడ్డలని ఇంత కష్టపెడుతున్నాడని దుఖం ఆగక ఏడిచాను" అని, కోట్ల మంది బిడ్డలు కలిగిన సురభి అని పలికింది.

 మరి ఒక్కగానొక్క కుమారుడు అమ్మా కౌసల్యకి, లేకలేక పుట్టినవాడు, ధర్మాత్ముడు, అటువంటి వాడిని 14 సంవత్సరములు అరణ్యాలకి పంపావే, కొడుకు పక్కన లేడని, భర్త మరణించాడని కౌసల్య ఎంత ఏడుస్తుందో ఆలోచించావ. నువ్వు చెప్తే రాజ్యాన్ని ఏలుతాననుకున్నావా, ఒక్కనాటికి అది జరగదు. ఇక నువ్వు బతికుండడం అనవసరం. వెంటనే అంతఃపురానికి వెళ్ళి ఉరివేసుకో, అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తం" అని భరతుడు అన్నాడు.

ఈ మాటలు విన్న కైకేయ మీద పిడుగుపడినట్టు అయ్యింది, భరతుడు వేసిన కేకలకి మంత్రులందరూ చుట్టూ చేరారు. ఈ కేకలు విన్న కౌసల్య, భరతుడు వచ్చాడని గ్రహించి, భరతుడిని చూద్దామని సుమిత్రతో కలిసి బయలుదేరింది. ఇక నేను ఈ కైకేయ మందిరంలో ఉండనని, భరతుడు కౌసల్య మందిరానికి బయలేదేరాడు. భరతుడి వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు. అటువేపు నుండి కౌసల్య, సుమిత్రతో భరతుడికి ఎదురురాగా, భరతుడు కౌసల్య పాదాల మీద పడి ఏడిచాడు. 

అప్పుడు బాధలో ఉన్న  కౌసల్య భరతుడిని పైకి లేపి "రాజ్యం కావాలని కోరుకున్నావు కదా, మీ అమ్మ నీ కోరిక తీర్చింది. నువ్వు లేనప్పుడు రెండు వరాలు అడిగింది. నా కొడుకు అడవులని పట్టి వెళ్ళిపోయాడు. నీకు ఎటువంటి అడ్డు లేదు. హాయిగా ఈ రాజ్యాన్ని ఏలుకో. నాకు ఒక్క ఉపకారం చెయ్యి. నా భర్త మరణించాడు. ఇక ఈ రాజ్యంలో నా అన్నవారు ఎవరూ లేరు, అందుకని నన్ను అరణ్యంలో ఉన్న నా కుమారుడి దగ్గర దిగబెట్టు" అని పలికింది.

అది విన్న భరతుడు "అమ్మా!! నాకే రాజ్యం మీద ఆశ ఉంటే, రాముడు అడవులకు వెళ్లిపోతాడాని ముందే తెలిసి ఉంటే, గురువుల చేత సమస్తమైన విద్యలు తెలుసుకొని కూడా, ఆ విద్యలు ఆచరించనటువంటి కృతజ్ఞుడనవుదునుగాక, నిద్రపోతున్న ఆవుని కాని, ఎద్దుని కాని తన్నినవాడికి, సేవకుల చేత చాలా కష్టమైన పని చేయించుకొని, ఆ పనికి తగిన వేతనము ఇవ్వని వాడికి, అందరూ తాగే నీళ్ళల్లో విషం కలిపిన వాడికి, ఋషుల పితృదేవతల, దేవతల రుణాన్ని తీర్చుకోవడం కోసమని, వివాహం చేసుకొని సంతానము కననటువంటివాడికి, అన్నిటినీమించి ప్రజల దగ్గర పన్ను తీసుకొని, తిరిగి ఆ ప్రజలకి కావలసిన సదుపాయాలని కల్పించనటువంటి రాజుకి, కొత్తగా ఈనినటువంటి పశువు యొక్క దూడ మళ్ళి పాలు తాగడానికి వస్తే, ఆ పొదుగులో పాలు ఉంచకుండా, ఆ పాలతో జున్ను వండుకొని తిన్నవాడికి, సూర్యుడికి, చంద్రుడికి ఎదురుగా నిలిచి మలమూత్రములు విసర్జన చేసినవాడికి, ఇళ్ళు తగలబెట్టినవాడికి ఇలా ఎన్నో చేసినప్పుడు ఎలాంటి పాపము వస్తుందో, నాకు అటువంటి పాపము వస్తుంది" అని అన్నాడు.

అప్పుడు కౌసల్య "నాయనా నువ్వు ఎటువంటివాడివో నాకు తెలుసు, కాని రాముడు దూరంగా వెళ్ళిపోయాడన్న బాధతో అలా మాట్లాడాను" అని భరతుడిని తన ఒడిలో కుర్చోపెట్టుకుంది. 

ఇలా తల్లిప్రేమ అనిర్వచనీయం. కౌసల్య అందరినీ తన కొడుకులుగానే చూసింది.

                                    ◆వెంకటేష్ పువ్వాడ.