అందరూ అలవర్చుకోవాల్సినవి!
అందరూ అలవర్చుకోవాల్సినవి!
పుణ్యో గన్ధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ। జీవనం సర్వభూతేషు తమశ్చాస్మి తపస్విషు॥
పృథా దేవి(కుంతీ దేవి) కుమారుడవైన ఓ పార్థా! భూమిలో నుండి వెలుపడే మంచి వాసనను, అగ్నియందు ప్రకాశమును, సర్వభూతములలో ఉన్న జీవము (ప్రాణశక్తి), తాపసులు చేసే తపస్సు, అన్నీ నేనే అయి ఉన్నాను.
ఈ భూమిలో ఉన్న సువాసన నేనే. అగ్నిలో వెలుగు, తపస్సు చేసే వారిలో తపశ్వక్తి, సమస్త జీవరాసులలో జీవము నేనే. అంటే ప్రతి జీవిలో ఉండే వైటల్ పవర్ పరమాత్మ. చైతన్యం పరమాత్మ. దాదాపు 100 సంవత్సరాలు మన శరీరంలో రక్తం ప్రసరించడం, గుండె కొట్టుకోవడం, ఆహారం జీర్ణంకావడం మొదలగు పనులకు, ఎటువంటి బాటరీ శక్తి అవసరం లేకుండా, కావలసిన శక్తి, చైతన్యం, నిలకడగా శరీర ఉష్ణోగ్రత, లభిస్తున్నాయి అంటే ఇవన్నీ ఆ పరమాత్మ స్వరూపమే.
కాని మనం మాత్రం అన్నీ నేనే, నా వల్లె జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటాము. అలా అనుకోవడం పొరపాటు. లోపల ఉన్న ఆ చైతన్యం లేకపోతే. అమెరికా ప్రెసిడెంటు అయినా అమలాపురం అప్పలస్వామి అయినా కాటికి పోవలసిన వాడే. ఆ చైతన్యం లేకపోతే, ఒక్కక్షణం కూడా మనుషులు వారిని తమ మధ్య ఉంచుకోరు. ఘనంగా సమాధులు కట్టిస్తారు. కాబట్టి మనిషికి అహంకారము పనికిరాదు. వినయం ముఖ్యం. అన్నిటిలో ఆ పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మే తనలో కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. అని తెలుసుకోవడమే జ్ఞానం.
అగ్ని యందు ప్రకాశం మనకు తెలుసు. మనిషిలోని జీవం మనకు తెలుసు. కాని భూమి నుండి వచ్చే సువాసన మనకు తెలియదు. ఎందుకంటే నగరాలలో అంతా తారు రోడ్లు సిమెంటు రోడ్లు. నేల కనపడదు. కాని పల్లెలకు వెళితే, ఎండా కాలం తరువాత తొలకరి వానలు పడి నపుడు ఒక విధమైన ఆహ్లాదకరమైన వాసన వస్తుంది. అది భూమి నుండి వస్తుంది. అది భూమి సహజగుణము. ఇంతెందుకు భూమిలోనుండి పూలమొక్కలు. వస్తాయి. ఆ మొక్కలకు పూచే పూలకు ఉన్న సువాసన భూమి నుండి వచ్చేదే. కాబట్టి భూమి లక్షణం సువాసనలు వెదజల్లడం. అదీ కూడా పుణ్యోగంధ: అంటే చక్కటి సువాసన. మనం భూమి మీద అన్ని వ్యర్ధాలు వేసి మురికిచేస్తున్నాము కానీ, భూమి లక్షణం సువాసనలు వెదజల్లడం. ఆ సువాసనలు కూడా ఆ పరమాత్మ స్వరూపమే.
ఈ శ్లోకంలో ఆఖరున తపశ్చాస్మి తపస్విషు అని కూడా అన్నాడు పరమాత్మ. తాపసులలో తపశ్శక్తిని నేనే, ఏకాగ్రతతో, భక్తి, శ్రద్ధతో చేసే ఏ పని అయినా తపస్సే. ఆ ఏకాగ్రత, శ్రద్ధ నేను అంటున్నాడు పరమాత్మ. కాబట్టి మనం కూడా ఏ పని చేసినా శ్రద్ధతో, ఏకాగ్రతతో చేస్తే, పరమాత్మ ఆ పని సఫలం చేస్తాడు. ముఖ్యంగా విద్యార్ధులు సంవత్సరం అంతా ఏకాగ్రతతో, శ్రద్ధతో చదివితే, క్వశ్చన్ బాంకుల పని ఉండదు. ప్రశ్నాపత్రాలలో ఉన్న ప్రశ్నలు అన్నీ తెలిసినట్టే కనిపిస్తాయి. అలా కాకుండా, కేవలం పరీక్షల సమయంలో ముక్కున పెట్టి చదివితే, ఆ ప్రశ్నలు రాకపోతే, అబ్బా చాలా హార్డ్ గా ఇచ్చారండీ అని ఇతరుల మీదికి తప్పు నెట్టేస్తాము. మనలో శ్రద్ధ, ఏకాగ్రత లేదని ఒప్పుకోము. మన అజ్ఞానానికి నవ్వుకోడం తవ్ప పరమాత్మ కూడా ఏం చేయలేడు. ఒక్క విద్యార్థులకే కాదు, ఉద్యోగస్థులకు, వాపారస్థులకు ఇది వర్తిస్తుంది. కాబట్టి పరమాత్మ స్వరూపాలైన ఏకాగ్రత, శ్రద్ధ, తపశ్శక్తి అందరూ అలవరచుకోవాలి.
◆వెంకటేష్ పువ్వాడ.