నవరాత్రులలో దుర్గా సప్తశతి ఎలా పారాయణ చేస్తారు?
నవరాత్రులలో దుర్గా సప్తశతి ఎలా పారాయణ చేస్తారు?
దసరా పండుగ అంటే ఎంతో సందడి ఉంటుంది దేశ వ్యాప్తంగా. దసరాకు మరోపేరు "దశహరా" అంటే! పది పాపాలను హరించేది అని అర్థం. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి, హస్తానక్షత్రములో వచ్చే శుభదినాన దేవీ పూజ ప్రారంభించడం చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది. అందువల్ల ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభిస్తారు.
అందులో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తరువాత మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను,
చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని చెబుతారు.
ఈ నవరాత్రులలో దుర్గా సప్తశతి పారాయణ చేస్తే ఎంతో పుణ్యఫలం. దీని పారాయణా విధానం తెలుసుకోవాలి అందరూ.
ఎంతో విశిష్టత కలిగిన ఈ దుర్గా సప్తశతిలో 13 అధ్యాయాలున్నాయి. నవరాత్రి తొమ్మిది రోజులలోను ఈ 13 అధ్యాయాలను ఎలా పారాయణ చేయాలంటే …….
దేవీ కటాక్షం పొందాలని అనుకునేవారు ఈ 3 విధాలలో ఏది ఎన్నుకున్నా ఫలితం పొందడంలో మాత్రం ఎటువంటి తేడా ఉండదు. కాబట్టి అనుకూలమైన మార్గాన్ని ఎన్నుకోవచ్చు.
మరో అంశం.....ఈ పారాయణ సమయంలో ఆయా అధ్యాయాల్లో దేవతలు, ఇంద్రుడు, మునులు మొదలైన వారి స్తోత్రములు సందర్బానుసారం చేర్చబడి ఉంటాయి. వాటిని కూడా పఠిస్తే ఇంకా అద్బుత ఫలితం లభిస్తుంది.
మొదటి విధానము:
ఆశ్వయుజ మాసములోని శుక్లపక్షపాస్యమి మొదలు నవమి వరకు తొమ్మిదిరోజులను శరన్నవ రాత్రములు అంటారని తెలిసినదే!
ఈ 9 రోజులు అత్యంత పుణ్యప్రదమైన రోజులు. పారాయణ చేయడం, నామజపం, దేవీస్తోత్రం, ఉపాసన చేయడం, అర్చన చేయడం.... ఇలా ఎవరికి ఏది అనుకూలమైతే అది ఆచరించటం ఈ దేవీ నవరాత్రులలో అద్బుత పుణ్యప్రదాన్ని ఇస్తుంది.
మొదటి రోజు నుండి తొమ్మిది రోజులూ ప్రతి రోజూ 13 అధ్యాయములను పారాయణ చేయడం ఒక పద్ధతి. అయితే ఆ పారాయణకు భక్తి, శ్రద్ధ చాలా అవసరం.
13 అధ్యాయాలు చేయాలంటే ప్రతి రోజు ఐదారుగంటలకు తక్కువ లేకుండా పట్టవచ్చు!
దైవకృప ఎక్కువ గల వారికి ఇది సాధ్యపడచ్చు.!.
దీనికి మరో రెండు విధానాలు కూడా ఉంది.
రెండవ విధానము:
1వరోజు (పాడ్యమి) ప్రధమాధ్యాయం మాత్రమే పారాయణ చెయ్యడం.
2వరోజు(విదియ) రెండు,మూడు,నాలుగు అధ్యాయాలు పారాయణ చేయడం.
3వరోజు(తదియ) ఐదు నుండి పదమూడు అధ్యాయాలను పూర్తిగా చేయడం.
తొమ్మిది రోజులు ఎంతో గొప్పవే కాబట్టి మూడేసి రోజులను పారాయణ కోసం ఎంచుకోవచ్చు.
అయితే నియమం మాత్రం ఒక్కటే! ఏ మూడు రోజులయినా అని అనుకుని ఒకటో రోజు చేసి, రెండ్రోజుల తర్వాత కొన్ని అధ్యాయాలు, మరో రెండ్రోజులు ఆగి కొన్ని అధ్యాయాలు చదువకూడదు.
పాడ్యమి, విదియ, తదియలు ఎవరికైనా ఇబ్బందుల వల్ల కుదరనపుడు చివరి మూడు రోజులను, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని ఎంచుకోవచ్చు. అంటే పదవ రోజు దసరా అయినా దాన్ని కూడా కలువుకోవచ్చు.
మూడవ విధానము:
మొదటిరోజు-మొదటి అధ్యాయం
రెండవరోజు-రెండు,మూడు అధ్యాయాలు
మూడవరోజు-నాలుగవ అధ్యాయం
నాల్గువరోజు-ఐదు,ఆరు అధ్యాయాలు
ఐదవరోజు-ఏడవ అధ్యాయం
ఆరవరోజు-ఎనిమిదో అధ్యాయం
ఏడవరోజు-తొమ్మిది,పది అధ్యాయాలు
ఎనిమిదవరోజు-పదకొండవ అధ్యాయం
తొమ్మిదవరోజు-పన్నెండో అధ్యాయం
విజయదశమి రోజు-పదమూడో అధ్యాయం.
ఇలా అన్ని అధ్యాయాలను మొత్తం పది రోజులలో పూర్తి చేయవచ్చు.
◆నిశ్శబ్ద.