నారద మహర్షి స్త్రీ గా మారిన వృత్తాంతం,  ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసా.!

 

నారద మహర్షి స్త్రీ గా మారిన వృత్తాంతం,  ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసా.!

బ్రహ్మ దేవుడి మానస పుత్రుడు నారదుడు. ఆయన యుగయుగాలుగా భూలోకం, దేవలోకం, పాతాళలోకాలలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడని చెబుతారు. అలాంటి నారద మహర్షి స్త్రీగా మారిన కథ ఉంది.  అంతేకాదు.. స్త్రీ రూపం నుండి ప్రాయశ్చిత్తం పొందిన ప్రదేశం కూడా ఉంది. ఆ ప్రదేశం ఇప్పుడు ఎంతో పూజనీయ ప్రదేశంగా వర్థిల్లుతోంది. అది కూడా ఆంధ్రప్రదేస్ రాష్ట్రంలోనే ఉంది. ఆ ప్రదేశం ఏమిటో.. నారద మహర్షి స్త్రీ గా మారిన వృత్తాంతం ఏమిటో వివరంగా తెలుసుకుంటే..  

కద్రువ కుమారులకు శాపం..

కశ్యప మహర్షి భార్య కద్రువ. ఈమె తన సవతి అయిన వినతతో ఒక పందెం వేస్తుంది. క్షీరసాగర మథనంలో ఉద్బవించిన ఉచ్ఛైశ్రవము అనే గుర్రం తోక తెల్లగా ఉంటుందని వినత,  లేదు నల్లగా ఉంటుందని కద్రువ పందెం వేస్తారు.  కద్రువ తన వెయ్యి మంది కుమారులతో.. మీరు ఆ గుర్రం తోకకు చుట్టుకుని గుర్రం తోక నల్లగా కనిపించేలా చేయండి అని చెబుతుంది.  కుమారులు అలాగే చేస్తారు. అయితే నాగులు చాలామంది దీన్ని కనిపెట్టి,  అది మోసం అని చెబుతారు.  దీంతో కద్రువకు కోపం వచ్చి, తన వెయ్యి మంది కుమారులను.. జనమేజయుని సర్పయాగంలో పడి నశించండి అని శపిస్తుంది.

కద్రువ శాపం పెట్టిన తర్వాత ఆమె పుత్రులలో ఒకరైన అనంతశేషుడు తల్లి పెట్టిన శాపానికి విముక్తి కోసం ఒక ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడే స్థిరపడి శ్రీ మహావిష్ణువు గురించి ఘోర తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు ప్రత్యక్షమై.. అనంతుడిని తన శేష తల్పంగా స్వీకరిస్తాడు. అప్పటి వరకు అనంతుడు తపస్సు చేసిన ప్రదేశాన్ని సర్పపురంగా విలసిల్లుతుందని,  భవిష్యత్తులో నేను లక్ష్మీ సమేతుడిగా నారదుడి చేత ఇక్కడ ప్రతిష్టించడతాను అని  వరం కూడా ఇచ్చాడు.

పై సంఘటన అంతా జరిగిన తర్వాత.. ఒకరోజు బ్రహ్మదేవుడు విష్ణుమాయ నుండి ఎవరూ తప్పించుకోలేరు అని నారదుడి ముందు అంటాడు.  అయితే.. ఎప్పుడూ నారాయణ జపం చేసే నాకు ఎలాంటి విష్ణుమాయ అంటదు అని ఎంతో అహంకారంతో చెబుతాడు.

నారదుడి అహంకారాన్ని అణచడం కోసం.. విష్ణుమూర్తి తన మాయను ప్రదర్శించడం మొదలు పెడతాడు.  లోక సంచారం చేస్తూ నారదుడు అనంత శేషుడు  తపస్సు చేసిన సర్పపురం వస్తాడు. అక్కడ ఒక సరస్సు ఎంతో అందంగా కనిపించడంతో అందులో స్నానం చేయాలని సరస్సులో దిగుతాడు. అయితే.. నారదుడు సరస్సులో నీటిలో మునిగి పైకి లేవగానే అందమైన అమ్మాయిగా మారిపోతాడు. పైగా తనకు గతం ఏమీ గుర్తు ఉండదు.  

నారద స్త్రీ రూప వివాహం..

నారదుడు ఎంతో అందమైన స్త్రీ రూపంలోకి మారిపోయిన తర్వాత ఆమెను పిఠాపుర యువరాజు నాకుండుడు చూస్తాడు.  ఆమె మీద మోహం పెంచుకుని ఆమెను వివాహం చేసుకుంటాడు. వారికి 60మంది కుమారులు జన్మించారట.  వారే ప్రభవ నుండి అక్షయ వరకు గల 60 తెలుగు సంవత్సరాల పేర్లు అని చెబుతారు.

భర్త, కుమారుల మరణం..

ఆ తర్వాత జరిగిన ఒక యుద్దంలో నాకుండుడు,  వారి 60 మంది కుమారులు వీర మరణం చెందాడు. వారి మరణంతో ఆమె ఎంతో కృంగిపోతుంది.

విష్ణుమూర్తి ఉపదేశం..

 భర్త, కుమారుల మరణంతో కృంగి పోతున్న ఆమె వద్దకు శ్రీమహావిష్ణువు ఒక వృద్ద బ్రాహ్మణుడి రూపంలో వెళ్లి, ఒకసారి ఆ దివ్య తీర్థంలో స్నానం చేయమని  ఉపదేశించాడు. ఆమె నీటిలో మునిగి పైకి లేవగానే తిరిగి మళ్లీ నారద మునిగా మారిపోయింది.

తాను అనుభవించిన సుఖ దుఃఖాలు అన్నీ విష్ణు మాయే అని గ్రహించి స్వామికి సాష్టాంగ పడ్డాడు నారదుడు. మహావిష్ణువు నారదుడితో.. ఇకమీదట ఈ సరోవరం ముక్తితీర్థం పేరుతో ప్రసిద్ధి చెందుతుంది.  ఎవరైతే ఈ సరోవరంలో స్నానం చేస్తారో.. వారి పాపాలన్నీ నశిస్తాయి అని  చెబుతాడు. అలాగే.. ఇక్కడ విష్ణుమూర్తి భావనారాయణుడిగా పూజలు అందుకుంటున్నాడు.

సర్పవరం..

విష్ణుమూర్తి భావనారాయణుడిగా పూజలు అందుకుంటున్న ఈ క్షేత్రం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లాలో సర్పవరం అనే గ్రామంలో ఉంది.

 

                                               *రూపశ్రీ.