ఏ దేవతలకు ఎన్ని ప్రదక్షిణలు చెయ్యాలో తెలుసా?

 

 

ఏ దేవతలకు ఎన్ని ప్రదక్షిణలు చెయ్యాలో తెలుసా?

 

హిందూ మతంలో దైవారాధనకు చాలా ప్రాధాన్యత ఉంది. పంచభూతాలను దైవ సమానంగా భావించి పూజించే సంప్రదాయం హిందూ మతంలో ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ తరచుగా గుడికి వెళ్తుంటారు.  చాలామంది ఏ గుడికి వెళ్లినా 9 ప్రదక్షిణలు వేసి దేవుడికి నమస్కారం చేసుకుని వచ్చేస్తుంటారు. కానీ ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు వేస్తే మంచిదో, ఎలా చెయ్యాలో.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చాలామందికి తెలియదు.  అవేంటో తెలుసుకుంటే..


శివలింగ ప్రదక్షిణ..


శివపురాణం ప్రకారం శివలింగం ఉన్న సగం వరకు మాత్రమే ప్రదక్షిణ చేయాలి. శివలింగానికి  సమర్పించిన నీరు సోమసూత్రం గుండా బయటకు వెళుతుంది. ఈ సోమసూత్రాన్ని దాటి ప్రదక్షిణ చేయకూడదని అంటారు.


విష్ణువు, విష్టు అవతారాలు..

విష్ణువుకు అయినా, విష్ణు అవతారాలకు అయినా నాలుగు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందట.  నాలుగు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరికలన్నీ తీరతాయట.


వినాయకుడు..

విఘ్నాలు తొలగించే వినాయకుడికి 3సార్లు ప్రదక్షిణ చేయాలనే నియమం ఉంది.  వినాయకుడి గుడిలో మూడు ప్రదక్షిణలు చేస్తే చాలు.


సూర్యుడు..


ప్రత్యక్ష దైవంగా భావించే సూర్యభగవానుడికి  ఏడు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందట.  సూర్యుడికి ఏడు ప్రదక్షిణలు వేస్తే పాపాలు నశించి పుణ్యాలు లభిస్తాయట.  అంతేకాదు ఆరోగ్యం చేకూరుతుందట.


రావిచెట్టు..

రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చెయ్యాలని చెబుతారు.  ఇలా 108 ప్రదక్షిణలు చెస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుందట.  ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట.


హనుమంతుడు..


హనుమంతుడికి కూడా 3సార్లు ప్రదక్షిణ చేస్తే సరిపోతుందట. దీని వల్ల అన్ని ఆటంకాలు, కష్టాలు తొలగిపోతాయట.


శనిదేవుడు..


శనిదేవుడి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయడం మంచిదని అంటారు.  శనిదేవుడికి ప్రదక్షిణలు చేస్తే శనిదోషం తగ్గడమే కాకుండా ఐశ్వర్యం చేకూరుతుందట.

యాగశాల..


యాగశాలకు 108 సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల సానుకూలత పెరుగుతుందట.  రోగాలు నయమవుతాయని అంటారు.  అలాగే ఆయుష్షు పెరుగుతుందట.

తులసి..


తులసి మొక్క చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయాలని చెబుతారు.  దీని వల్ల ఇంట్లో దారిద్ర్యం తొలగిపోతుందట.  


సకల దేవతలకు..


సకల దేవతామూర్తులకు ప్రదక్షిణ చెయ్యాల్సి వస్తే ఒక ప్రదక్షిణ చేస్తే సరిపోతుందని శాస్త్రాలలో చెప్పబడింది.


                                             *రూపశ్రీ.