Read more!

ధన్వంతరికి వందనం!

 

 

ధన్వంతరికి వందనం!


ఎవరైనా వైద్యుడి హస్తవాసి బాగుంటే అతను ధన్వంతరి అంతటివాడంటాం. అలాంటి ధన్వంతరిని కృతజ్ఞాపూర్వకంగా తల్చుకునేందుకు మన పెద్దలు ఒక పండుగను కూడా నియమించారు. అదే ధన్వంతరి జయంతి! ప్రామాణిక గ్రంథాలలో `ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి`ని ధన్వంతరి జయంతిగా పేర్కొన్నారు. ఆ సందర్భంగా ధన్వంతరి గురించి కొన్ని విషయాలు…

క్షీరసాగరమధన సమయంలో దేవతలు, దానవులు అమృతం కోసం జోరుగా సాగరాన్ని చిలకసాగారు. గరళం, లక్ష్మీదేవి, ఐరావతం, కల్పవృక్షం.. ఇలా ఒక్కొక్కటే సాగరం నుంచి వెలువడసాగాయి. దేనికోసమైతే వారు ఆ క్రతువుని చేపట్టసాగారో, ఆ సమయం రానే వచ్చింది. పట్టుపీతాంబరాలతో, కుండలాలతో వెలిగిపోతూ అమృతకలశాన్ని చేతపట్టి సాగరంనుంచి వెలుపలికి వచ్చాడు ఓ దివ్యమూర్తి. ఆయనే ధన్వంతరి! ధన్వంతరి సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారమే అని ఓ నమ్మిక. ధన్వంతరి అన్న శబ్దంలోనే బాధలను తొలగించేవాడు అన్న అర్థముంది. తన చేతిలో ఉన్న అమృతంతో దేవతల వ్యాధులన్నింటినీ ఒక్కపెట్టున నయం చేస్తాడట ధన్వంతరి. అందుకే ఆయనకు దేవవైద్యుడు అన్న పేరు కూడా ఉంది. ధన్వంతరి హస్తవాసి గురించి కూడా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక గాథ ప్రకారం ధన్వంతరి ఎంతటి పాముకాటు నుంచైనా దేవ, దానవ, మానవులను రక్షించసాగాడు. తమ కాటునుంచి అంతా తప్పించుకోవడాన్ని సర్పారాజైన `వాసుకి` సహించలేకపోయాడు. అలా కనుక జరిగితే తనకు ఎవరూ భయపడరనీ, తన ప్రాభవానికే భంగం వాటిల్లుతుందనీ భావించాడు వాసుకి. అందుకని ధన్వంతరిని అంతమొందించేందుకు ఒక మహాసర్పాన్ని పురమాయించాడు. కానీ సాక్షాత్తూ ఆ శివుడే అడ్డుపడి బుద్ధి చెప్పడంతో, ధన్వంతరి కాళ్ల మీద పడ్డాడట వాసుకి.

అంతటి ధన్వంతరి భూలోకాన్ని ఉద్ధరించేందుకు దీర్ఘతవుడనేవాని ఇంట జన్మించాడు. మరి భూలోకంలోని మానవుల వ్యాధులను ఈడేర్చేందుకు అమృతం లేదు కదా! అందుకని అమృత సమానమైన ఔషధిలను ఎలా ఉపయోగించాలో చెబుతూ ఆయుర్వేదానికి పునాదులు వేశాడు ధన్వంతరి. ఆయన తరంలోని వాడే అయిన `దివోదాసు ధన్వంతరి` ఆయుర్వేదాన్ని ఒక సంపూర్ణ శాస్త్రంగా విస్తరించి, విభజించాడు. బహుశా ధన్వంతరిని విష్ణుమూర్తి అంశగా భావించడం వల్లనేమో ఆయనకు ప్రత్యేకించిన ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి. ఔషధ వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే కేరళలో ధన్వంతరికి ప్రత్యేకించిన పురాతన ఆలయాలు కొన్ని ఉన్నాయి. అలాగే తమిళనాడులోని శ్రీరంగనాధస్వామి ఆలయంలో, ధన్వంతరికి కూడా ఒక ఆలయం ఉంది. రామానుజాచార్యులవారికి ముందు నుంచే ఈ ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. రామానుజాచార్యులవారు, రంగనాధస్వామి నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు, ఇక్కడి నుంచి మూలికల కషాయాన్ని మూలవిరాట్టు దగ్గరకు పంపే ఆచారాన్ని మొదలుపెట్టారట. ఆంధ్రప్రదేశ్‌లోని చింతలూరులో కూడా ఒక ధన్వంతరి కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు.

శరీరాన్ని అంతుచిక్కిన వ్యాధి పీడిస్తున్నప్పుడూ, దీర్ఘకాలిక రోగాలు పట్టివిడవనప్పుడూ ధన్వంతరిని పూజిస్తే ఉపశమనం లభిస్తుందంటారు పెద్దలు. ఒకవేళ ధన్వంతరి చిత్రపటం ఏదీ లేకపోతే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తి ప్రతిమనే ధన్వంతరిగా భావించవచ్చు. ధన్వంతరికి ప్రత్యేకించిన మంత్రాలు చాలానే వినిపిస్తాయి. వాటిలో ఒకటి…

`ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే
అమృతకలశ హస్తాయ
సర్వామయ వినాశనాయ
త్రైలోక్య నాథాయ శ్రీ మహావిష్ణవే నమః`

(అమృత కలశాన్ని చేత ధరించి, సర్వరోగాలనూ పారద్రోలే ఆ విష్ణుస్వరూపుడైన ధన్వంతరికి వందనం!)

- నిర్జర.