Read more!

నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభం..పూజా విధానం, వ్రత నియామాలు తెలుసుకోండి.!

 


నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభం..పూజా విధానం, వ్రత నియామాలు తెలుసుకోండి.!

కార్తీక మాసం ముగిసిన అనంతరం ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో చాలా మంది పూజలు చేస్తారు. మరి ధనుర్మాస పూజా విధానం ఎలా ఉంటుంది..నియమాలేంటో తెలుసుకుందాం.

ఈరోజు ధనుర్మాసం ప్రారంభమైంది. సూర్యుడు, ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో ఈ మాసం ప్రారంభం అవుతుంది. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం భక్తులు నెలపాటు ధనుర్మాస వ్రతాలు చేస్తుంటారు. మరి ఈ వ్రత నియామాలు ఏంటి? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

ధనుర్మాస వ్రతం కోసం ముందుగా పంచలోహాలతో లేదంటే రాగిలోహం లేదంటి ఇత్తిడి లేదా వెండి ఇలా ఏదైనా లోహంతో తయారైన శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. ఈ విగ్రహానికి రోజూ ఆవుపాలు, కొబ్బరినీళ్లు, పంచామ్రుతాలతో అభిషేకం చేయాలి. అలాగే మొదటి 15రోజులు బియ్యం, పెసరపప్పుతో మిగతా 15రోజులు దద్దోజనంతో నైవేద్యం సమర్పించాలి. దీపారాధన చేయాలి. ఇలా చేస్తే ఇహలోకంలో సర్వ సంపదలు, పరలోకంలో మోక్షప్రాప్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

ఇంట్లో శ్రీ మహా విష్ణువు విగ్రహం లేనివారు..లక్ష్మీనారాయణ పూజ చేయవచ్చని పండితులు అంటున్నారు. దీనికోసం లక్ష్మీనారాయణ చిత్ర పటానికి గంధం, కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించుకోవాలి. పంచోపచారం చేసి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఇంకా పచ్చకర్పూరం కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే గోదాదేవి రాసిన తిరుప్పావై పాశురాలను ప్రతిరోజూ పఠించాలి.


రెండు మంత్రాలు పఠించాలి:

 ధనుర్మాస వ్రతం చేసేవారు రోజూ రెండు మంత్రాలను పఠిస్తూ పూజ చెయ్యాలని పండితులు చెబుతున్నారు.
అవి
 1. "ఓం శ్రీ గోదాదేవి సహిత రంగనాథ స్వామినే నమః"
2. గోదాదేవి అష్టోత్తరం లోని "ఓం శ్రీ రంగ నిలయాయై నమః".

ఈ రెండు మంత్రాలనూ జపిస్తే ఇంట్లో అంతా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఆలయానికి వెళ్తే గంధం లేదా వెన్నపూసను భక్తును పంచాలని పండితులు చెబుతున్నారు. అగ్నిపురాణం ప్రకారం ధనుర్మాసంలో విష్ణు ఆలయానికి వెళ్లినప్పుడు ఆలయానికి ఏదైనా దానం ఇవ్వాలి. అది పూజా వస్తువు కావచ్చు లేదంటే ధనాన్ని దానంగా ఇవ్వవచ్చు. ఈ మాసంలో సంపంగి పూలతో విష్ణుమూర్తిని పూజించినట్లయితే..కుజదోషం తొలగిపోతుందని..అలాగే ఆర్ధిక సమస్యలు ఉన్నవారు తెల్లగన్నేరు పూలతో పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.