రావిచెట్టుని పూజిస్తే లక్ష్మీ కటాక్షం

 


రావిచెట్టుని పూజిస్తే లక్ష్మీ కటాక్షం

Karthika Puranam – 30

సూత ప్రోక్తమైన విషయాలను విన్న ఋషులు ''ఓ మునిరాజా! రావిచెట్టు ఎందుకు అంటరానిది అయ్యింది? శనివారంనాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది? అని అడగ్గా సూతర్షి వారిని సమాధానపరిచాడు.

రావిచెట్టు - దరిద్ర దేవత

పూర్వం క్షీరసాగర మధనంలో లభించిన అనేక వస్తువుల్లో లక్ష్మిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి, శ్రీదేవిని పెళ్ళి చేసుకోదలచాడు. కానీ శ్రీదేవి ''ఓ నారాయణా! నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెళ్ళి కాకుండా కనిష్ఠనైన నేను కల్యాణమాడటం న్యాయం కాదు కనుక ముందు ఆమె పెళ్ళికై సంకల్పించు'' అని కోరింది. ధర్మబద్ధమైన ''రమ'' మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభకారిణి, అరుణనేత్రి, కఠినగాత్రి, బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు.

దరిద్ర దేవతకు ఇష్టమైన స్థలాలు

నిరంతర హోమధూమ సుగంధాలతో, వేద నాదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ''ఓ ఉద్దాలకా! నాకు ఈ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించే, అతిథి పూజా సత్కారాలు జరిగే, యజ్ఞయాగాదులు నిర్వహించే స్థలాల్లో నేను నివసించను. అన్యోన్య అనురాగం గల భార్యాభర్తలు ఉన్న చోటగానీ, పితృదేవతలు పూజింపబడే చోటగానీ, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్టుడు, ప్రేమగా మాట్లాడేవాడూ, గురుపూజా దురంధరుడు ఉండే స్థలాల్లో నేను ఉండను. ఎక్కడ రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో, ఎక్కడయితే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో, ఎక్కడయితే దురాచారాలు, పరద్రవ్య, పరభార్యాపహరణ శీలులైనవారు ఉంటారో అలాంటి చోట మాత్రమే నేనుంటాను. కల్లు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతకులు ఎక్కడ ఉంటారో నేనక్కడ ఉండటానికే ఇష్టపడతాను'' అంది.

రావి మొదట్లో జ్యేష్ఠావాసం

ఆమె మాటలకు వేదవిదుడైన ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకుని ''ఓ జ్యేష్ఠా! నువ్వు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకూ నువ్వీ రావిచెట్టు మొదట్లోనే కదలకుండా కోర్చో'' అని చెప్పి బయల్దేరి వెళ్ళాడు. భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావిచెట్టు మొదలులో అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్ళకీ ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్దపెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవుల్లో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై, ఆమెని ఊరడిస్తూ ''ఓ జ్యేష్ఠాదేవీ! ఈ రావిచెట్టు నా అంశతో కూడి ఉంటుంది. కనుక, నువ్వు దీని మూలంలోనే స్థిరనివాసం ఏర్పరచుకుని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్తుల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది'' అని చెప్పాడు. ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావిచెట్టు పూజనీయగాను, అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణ కురిపించేట్లు ఏర్పరచాడు శ్రీహరి.

''ఓ ఋషులారా! సత్యభామకు శ్రీకృష్ణుడు, పృథుచక్రవర్తికి నారదుడు చెప్పినట్లు నేను మీకు ఈ పద్మపురాణ అంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరయితే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుజ్యాన్ని పొందుతున్నారు'' అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడినుంచి బద్రీవన దర్శన కాంక్షులై పయనమయ్యారు.

(ఇంతటితో ముప్పయ్యవ రోజు పారాయణ సమాప్తం)

పోలి స్వర్గం చేరుట

ఆంధ్రదేశంలో పవిత్ర కృష్ణానదీ తీరాన ''బాదర'' అనే ఊరుంది. ఆ గ్రామంలో నివసిస్తున్న అన్ని వర్ణాలవారు సకల సంపన్నులు. పాడిపంటలు, భోగభాగ్యాలు, సుఖశాంతులు మున్నగువానితో ఆ ఊరు సంతోషపూర్ణమై ఉంది. ఆ ఊళ్ళో ''పోతడు'' అనే పేరుగల చాకలివాడు ఒకడున్నాడు. అతని భార్య ''మాలి'' క్రూర స్వభావురాలు. దయాదాక్షిణ్యాలు లేని గయ్యాళి. వారికి నలుగురు కుమారులు. ఆ దంపతులు తమ కుమారులు నలుగురికి తగిన సమయంలో వివాహం చేశారు. మొదటి ముగ్గురు కోడళ్ళు తమ అత్తగారి లాగానే పొగరుబోతు స్వభావం కలిగి చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అత్తగారితో సమానంగా గయ్యాళితనమును, చెడు స్వభావాన్ని కలిగిఉన్నారు. నాల్గవ కోడలు ''పోలి'' భర్తయందు ఆసక్తి కలిగిన మృదు స్వభావురాలు.

ఊరివారి బట్టల మాలిన్యాన్ని పోగొట్టి స్వచ్ఛతను కలిగించు ''పోతడు'' మాత్రం తన కుటుంబసభ్యుల దుష్టస్వభావం వల్ల కుటుంబంలోని మాలిన్యాన్ని పొగొట్టలేని స్థితిలో ఉన్నాడు. దీనికితోడు వాని నిర్దనత్వం కూడా వానిని బాధిస్తోంది. తన భార్య మాలి, మిగిలిన కోడళ్ళు, చిన్నకోడలు పోలిని దూషించుట, బాధించుట గమనించి కూడా నిస్సహాయుడై ఊరుకున్నాడు.

అత్త ''మాలి'', మిగిలిన తోడికోడళ్ళు ఇంటిపనులన్నీ పోలిపై వదిలారు. ఆ పనులను మారుమాట్లాడక తలవంచి చేస్తున్నా కూడా ఆమెమీద జాలిలేక చాడీలు చెప్పి ఆమె భర్తతో పోలిని కొట్టించి సంతోషపడుతున్నారు. ఇలా తనను, అత్త, తోడికోడళ్ళు అనేక విధాలుగా బాధిస్తున్నా కూడా పోలి తన శాంతస్వభావాన్ని, దైవభక్తిని, ధర్మ కార్యాసక్తిని విడవలేదు.

ఇలా ఉండగా కార్తీకమాసం వచ్చింది. గ్రామవాసులంతా కార్తీకస్నానం చేసేందుకు కృష్ణానదికి వెళ్తున్నారు. నదిలో స్నానం చేసి, తీరంలో దీపాలు వెలిగిస్తూ పూజలు చేస్తున్నారు. ఇలా నదికి వెళ్ళేవారిలో నిజమైన భక్తులు కొందరుంటారు. కొందరు కేవలం నదీస్నానం, దీపారాధనలతో పుణ్యం వచ్చేస్తుందని కపటభక్తిపరులుంటారు. మరికొందరు ఇతరులు ఆచరిస్తుండగా తాము చేయకుంటే బాగుండదని మొక్కుబడిగా వెళ్ళేవారుంటారు.

పోలి అత్త ''మాలి'', పోలి తోటికోడళ్ళు ముగ్గురు పోలిని మాత్రం ఇంటిదగ్గరుంచి వారంతా నదీస్నానానికి వెళ్లారు. పనులు, బాధ్యతలు పోలికి అప్పగించారు. స్నానం, దీపారాధన చేసే సమయంలో మాలి తదితరుల మనసు దైవం, దివ్యాచారాలమీద లేదు. పోలి ఇంటిదగ్గర పాలు తాగేస్తోందేమో, పెరుగు, వెన్న తింటున్నదేమో, లేక వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటుందేమో లాంటి ఆలోచనలతో గడిపారు. వారంతా పోలిని ఆడిపోసుకుంటూ మొక్కుబడిగా పూజాకార్యక్రమాలు ముగించారు. తర్వాత వ్రత ఉద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమినాడు కృష్ణాతీరం చేరారు. వారి సంగతి అలా ఉండగా ఇంట్లో ఉండిపోయిన పోలి నిస్సహాయురాలు. అత్తగారికి, తోటికోడళ్ళకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది.

భర్త తల్లి, వదినల మాటలు విని నమ్ముతాడే తప్ప పోలిని పట్టించుకోడు. నదీస్నానం, దీపారాధన చేయాలని ఉన్నప్పటికీ ఇంటి బాధ్యతకు బంధితురాలైన పోలి తన భక్తిని, నదీ స్నానాదుల పట్ల ఉన్న కోరికను, దైవ, ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకుంది. అత్తకు, తోటికోడళ్ళకు సమాధానం చెప్పలేదు. తనను కనీసం ఒక జీవిగా కూడా తలచని వారి అమానుషత్వానికి ఏం చేయగలదు?

అప్పుడామె నిస్సహాయంగా ఇంటిపనులు చేస్తూ మనసులో ''దీనరక్షణా! గోవిందా! జనార్దనా! స్వామీ! దీనబంధూ! నేనేం చేయగలను?! అశక్తురాలను. నిస్సహాయురాలను. వీళ్ళంతా నన్ను విడిచి నదీతీరానికి వెళ్ళి, స్నానం, దీపారాధన చేస్తున్నారు. అలా నాకూ పుణ్యం సంపాదించాలని ఉంది. మనసారా పూజ చేసుకోవాలని ఉంది. కానీ, చేసుకోలేకపోతున్నాను. పవిత్ర నదీస్నానం లేదు. స్ఫూర్తినిచ్చే దీపారాధన లేదు. మనసుకు ప్రశాంతత ఇచ్చే దైవ దర్శనం పూజ, పురాణ శ్రవణం ఏవీ లేవు. ఏం చేయను? నాకు ఎలాంటి గతి కలుగుతుందో.. నేనెంత దురదృష్టవంతురాలిని?' అంటూ విచారించింది.

మనసులో భగవంతుని ధ్యానిస్తూ పోలి, తన పరిస్థితికి లోబడి, ఇంట్లో కుండలో ఉన్న నీటితో స్నానం చేసింది. చిరిగిన వస్త్రాన్ని ధరించి, అందులోనే ఓ పక్కనుంచి చిన్న పీలికను చించి వత్తిగా చేసి, ఒక పాత్రలో ఉంచి కవ్వానికి అంటిన కొద్ది వెన్నను తీసి ఆ పాత్రలో ఉంచి దీపం వెలిగించి, ''స్వామీ! పుండరీకాక్షా! గోవిందా! జనార్దనా! అనాథరక్షకా! దీనబంధూ! దయ చూపు. నేను అశక్తురాలను. నాపై అనుగ్రహం చూపు'' అని ప్రార్ధించింది పోలి.

ఇలా దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠంలో ఉన్న దయాసముద్రుడైన శ్రీ మహావిష్ణువు చూసి సంతోషించాడు. ఆమెపై అనుగ్రహం కలిగింది. ద్వారపాలకుడైన సుశీలుని చూసి ''ఓయీ! నీవు ఆమెను వెంటనే సగౌరవంగా బంగారు విమానం ఎక్కించి తీసుకురా'' అని ఆజ్ఞాపించాడు. సుశీలుడు తక్షణం పోలి ఉన్న ప్రదేశానికి వెళ్ళి ''ఓ సాధ్వీమణీ! ఉత్తమురాలా! నిన్ను ఈ శరీరంతోనే వైకుంఠానికి తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువు పంపాడు. వెంటనే వచ్చి ఈ బంగారు విమానం ఎక్కు'' అని తొందరపెట్టాడు. పోలి విమానం ఎక్కింది.

అప్పుడే, వ్రత ఉద్యాపన పూర్తిచేసుకుని పోలి అత్త మాలి, మిగిలిన తోడికోడళ్ళు ముగ్గురు ఇల్లు చేరారు. మాలి జరిగిన విషయం తెలుసుకుని తాను కూడా వైకుంఠం చేరాలనే కోరికతో విమానం ఎక్కబోతూ పోలి పాదాలను పట్టుకుంది. పెద్ద కోడలు మాలి పాదాలను, రెండో కోడలు ఆమె పాదాలను, మూడో కోడలు రెండో కోడలి పాదాలను పట్టుకున్నారు. ఇలా వైకుంఠానికి విమానంలో వెళ్తోన్న పోలి పాదాలను ఆమె అత్తగారు, ఆమె పాదాలను వరుసగా ఒకరి వెంట ఒకరుగా కోడళ్ళు పట్టుకుని వెళ్ళాడుతున్న దృశ్యం మహా విచిత్రంగా ఉంది.

వైకుంఠ విమానం నడిపిస్తున్న సుశీలుడు వాళ్ళను చూశాడు. వారు పోలిని పెట్టిన బాధలు కళ్ళముందు మెదిలాయి. విష్ణుమూర్తికి పోలిమీద కలిగిన దయ, ఆయన మాటలు గుర్తొచ్చాయి.

''మీరు మహా దుర్మార్గులు. పోలిని చూసి అసూయచెంది ఆమెను అనేకరకాలుగా బాధించారు. మీరు నదీస్నానం దీపారాధన, దైవదర్శనం, పూజ, పురాణశ్రవణం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటే ఏం లాభం? అప్పుడు కూడా ఆమెను నిందిస్తూ, దూషిస్తూనే గడిపారు. మీరు వైకుంఠానికి రాతగినవారు కాదు. కుంభీపాక మొదలైన నరకాలే మీకు తగినవి. ఆ నరకానికి వెళ్ళండి'' అని సుశీలుడు కత్తితో మాలి చేతులను నరికాడు. ఒక్కసారిగా మాలి, ఆమె కోడళ్ళు ముగ్గురూ కింద పడ్డారు.

సుశీలుడు ఎంతో ప్రేమాదరణతో, మహా వైభవంగా పోలిని వైకుంఠానికి తీసికెళ్ళాడు. ఇలా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైంది.

పోలి వృత్తాంతంవల్ల ఈ కింది విషయాలను గ్రహించాలి...

భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండాలి.

భక్తిలో తన్మయత్వం ఉండాలి.

పూజ చేసేవారు లేదా పూజావిధానం ఆడంబరంగా ఉండనవసరంలేదు. మనసు నిమగ్నం చేయడమే ముఖ్యం.

భక్తులకు అసూయాతత్వం, హింసా ప్రవ్రుత్తి ఉండకూడదు. నిశ్చలమైన, పరిపూర్ణమైన భక్తిమాత్రమే కావాలి. దిక్కులేనివారికి దేవుడే దిక్కు అనే మాట అక్షర సత్యం. అసూయాద్వేషాలు విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యధాశక్తిగా భగవంతుని చేరేందుకు పోలిలా ప్రయత్నించాలి. మాలి తదితరులు సంసారంలోని మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల, నిశ్చల భక్తికి ప్రతీక. అలాంటి భక్తికి కులము, సుసంపన్నత అవసరం లేదు. మనసును అర్పించడమే భక్తికి నిదర్శనం. సర్వేజనాః సుఖినోభవంతు!

Devotees and Karthika Puranam, Mukti or Salvation with Karthika Puranam, Holy Epic Karthika Puranam and auspicious month Karthika, the last day of Karthika Vratam