Determination brings Success

 

సంకల్పబలంతో సమస్త విజయాలు

Determination brings success

 

మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు, అది నిర్విఘ్నంగా నేరవేలారని బలంగా సంకల్పించుకోవాలి. చేపట్టిన పని మనసా వాచా కర్మణా కోరుకుంటే తప్పకుండా జరిగితీరుతుంది. కృషి, పట్టుదలతో బాటు సంకల్పబలం కూడా చాలా అవసరం. అంతే కాకుండా మంచి ముహూర్తం చూసి పని మొదలుపెట్టాలి. దృఢ సంకల్పము, శుభ ముహూర్తము ఉంటే ఏదయినా చేయగలమని ఎందరో నిరూపించారు. సముద్రంమీద సేతువు నిర్మించారంటే అది సంకల్పబలమే. మోయలేని బండరాయిని కొండమీదికి ఎక్కించగలం. సంకల్పబలం లేకున్నా, మంచి ముహూర్తం లేకున్నా అదే రాతిని కిందికి కూడా తోయలేం.

 

మనవాళ్ళు భూమిలో విత్తనాలు నాటినా తిథి, వార, నక్షత్రాలు చూస్తారు. ఇదంతా చాదస్తం అని కొట్టిపడేసేవారు ఉన్నారు. కానీ, ఖగోళశాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అలా అనరు. ఇందులో శాస్త్రం ఇమిడి ఉంది. ఏ టెక్నాలజీ, పరికరాలు లేని కాలంలోనే మహర్షులు ఎంతో పరిశ్రమించి, పరిశోధన చేసి, గ్రహాలూ, నక్షత్రాల చలన స్థితి, పరిణామాలు, వాటివల్ల కలిగే ప్రభావాలను ప్రబోధించారు. ఆ అద్భుతమైన, అమూల్యమైన విషయ సమాచారాన్ని తర్వాతి తరాలకోసం నిక్షిప్తం చేసి ఉంచారు.

 

అందుకే పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలకే కాకుండా ఏ పని ప్రారంభించాలన్నా తిథి, వార, నక్షత్రాలు, నెలలు, సంవత్సరాలు చూడటం అలవాటుగా మారింది. వీటిని సరిగ్గా లెక్కలు వేసి చూస్తే గనుక సత్ఫలితాలు ఉంటాయి. లేకుంటే అనుకున్న పని సవ్యంగా నెరవేరదు. ముహూర్తబలం అలాంటిది. కొన్ని కొన్ని నెలల్లో పెళ్ళిళ్ళు చేయరు. గృహప్రవేశం తలపెట్టరు. వారి వారి నక్షత్రాలను బట్టి ఆయా రోజుల్లో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గమనం ఎలా ఉంటుందో లెక్క చూసి, ఆ ప్రకారం పరిగణిస్తారు. అలాగే శుక్లపక్ష, కృష్ణపక్షాలకు కూడా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే ప్రతిరోజూ ఒకేలా ఉండదు.

 

కేవలం పనుల గురించే కాదు, ఆరోగ్యం కాపాడుకోవడానికి కూడా సంకల్పబలం కావాలి. గ్రహబలం ఉండాలి. చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఏ రకమైన అనారోగ్య సమస్యలూ లేకుండా హాయిగా, ఆనందంగా ఉండాలని బలంగా సంకల్పించుకోవాలి. ఆయా దినాలు, గ్రహ స్థితులను అనుసరించి అలవాట్లు, ఆచారాలను నిర్ధారించుకోవాలి.

 

ఉపవాసాలు కూడా గ్రహస్థితులను అనుసరించి వచ్చినవే. ఉదాహరణకు మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో, ఏకాదశి మొదలైన ప్రత్యేక రోజుల్లో, గ్రహణ సమయాల్లో సూర్యచంద్రుల స్థానాన్ని బట్టి పొట్ట బరువుగా ఉండకపోవడం మంచిది. అందుకే ఆయా రోజుల్లో ఉపవాసం ఉంటారు. మన పెద్దలు ఆచారం, నమ్మకం పేరుతో ప్రతిపాదించినవన్నీ కూడా శాస్త్రీయమైనవే అని గుర్తించి, గుర్తుంచుకోవాలి.


determination in hindu tradition, hindu devotional literature sankalpam, article on hindu culture and traditions, Meaning of Sankalpam & Muhurtham, determination leads to success