Read more!

Hindu Festival: Dattat Jayanti

 

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే దత్తాత్రేయుడు

Hindu Festival: Dattat Jayanti

 

ఈరోజు దత్త జయంతి (Dattat Jayanti). ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా వేడుక చేసుకుంటాం. అత్రి మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన బ్రహ్మదేవుని మానసపుత్రుడు. అత్రి మహర్షి, బ్రహ్మదేవుని దివ్య నయనాల్లోంచి జన్మించాడట. అత్రి మహర్షి సతీమణి మహాసాత్వి అనసూయ. నారదుడు త్రిలోక సంచారం చేస్తూ అక్కడి విశేషాలు, ఇక్కడ, ఇక్కడి విశేషాలు అక్కడ చెప్తూ ఉండేవాడు. అలా ఆయన ఒకసారి అనసూయ గొప్పతనం గురించి చెప్పగా లక్ష్మి, పార్వతి, సరస్వతి అసూయ చెందారు. ఆమెను పరీక్షించమని త్రిమూర్తులను పంపారు.

 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్రి మహర్షి ఇంటికి వెళ్లారు. వారు వెళ్ళిన సమయానికి అత్రి ఇంట్లో లేకపోవడంతో అనసూయ అతిథి మర్యాదలు చేసేందుకు నడుం బిగించింది. భోజనం సిద్ధం చేసి పిలవగా, వారు ''నీవు వివస్త్రగా వడ్డిస్తేనే తింటాం'' అన్నారు. అనసూయ చలించకుండా , త్రిమూర్తులను బాలులుగా మార్చి, వారు కోరినట్లుగానే వడ్డించింది. అదీ ఆమె ఔన్నత్యం. సంతోషించిన త్రిమూర్తులు తమ ముగ్గురి అంశతో వారికి ఒక బాలుడు పుడతాడని దీవించి వెళ్లారు. అలా అత్రి, అనసూయలకు జన్మించిన పుత్రుడే దత్తాత్రేయుడు.

 

కనుక, దత్తాత్రేయుడు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారం. గురుస్వరూపుడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ‘గురువు' అంటే దత్తాత్రేయుడే! గురువు, దేవుడు ఒకరిలోనే ఉండడం విశేషం. శాస్త్రాలు, ఉపదేశాలు, పూజలు, జపాలు ఏవైనా సరే, గురుముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు, రాణింపు కలుగుతాయి. అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు. కనుకనే దత్తాత్రేయుడు గురుదేవుడయ్యాడు.

 

దత్తాత్రేయుడు భక్తవత్సలుడు. భక్తులపై అంతులేని కారుణ్యాన్ని కురిపిస్తాడు. దత్తాత్రేయుని ఆరాధించేందుకు ఆర్భాటాలూ, ఆడంబరాలు అక్కర్లేదు. నిండు మనస్సుతో, నిష్కల్మషమైన హృదయంతో ప్రార్థిస్తే చాలు, ప్రత్యక్షమై వరాలు కురిపిస్తాడు. అందుకే దత్తాత్రేయుని ‘స్మృతిగామి’ అంటారు.

 

దత్తాత్రేయుడు విశిష్టమైన ఆచార్యస్థానం ఆక్రమించాడు. ఈ విశిష్టమైన స్థానం ఇంత తేలిగ్గా లభించిందా అని ఆశ్చర్యపోనవసరం లేదు. సాక్షాత్తూ దేవదేవుడైన దత్తాత్రేయుడు 24 మంది గురువుల వద్ద విద్యను అభ్యసించాడు. కనుకనే దత్తాత్రేయుని పరమ గురువుగా కొలుస్తున్నాం.

 

వివేకంతో, విచక్షణతో, ఆలోచనల్ని అంతర్ మధించి అసలైన జ్ఞానాన్ని అందింపుచ్చుకోవాలి. అది మన కర్తవ్యం. అలాంటి విచక్షణాపరులుగా రూపొందాలి. సాధారణంగా ప్రతి మనిషికీ వివేకం, విచక్షణ, వితరణ – ఈ మూడింటిని అందించగలిగేవాడు గురువు. అందుకే సృష్టిలో కన్నవారి తరువాత ఆ స్థానాన్ని ఆక్రమించినవాడు గురువు.

 

దత్తాత్రేయుడు గురువులకే గురువు విజ్ఞాన ఖని. అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా గురువుల వద్ద వినయంగా విద్యను అభ్యసించిన సద్గుణ సంపన్నమూర్తి. సకల వేదస్వరూపుడు. జ్ఞానామృతాన్ని జగత్తుకు పంచిన సద్గురు చక్రవర్తి. మౌనముద్రతోనే శిష్యుల సందేహాలను నివృత్తి చేసి గురుస్థానం దక్కించుకున్న దత్తాత్రేయుడు విశ్వానికే గురువయ్యాడు. అందుకే నిరంతరం దత్తాత్రేయుని ప్రార్దిస్తాం. జన్మ సంసార బంధనాల్ని తేలిగ్గా తెంచగలిగిన మహానుభావుడు, జ్ఞానానందాన్ని పంచగలిగిన ప్రేమమూర్తి, ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు.

 

మనసా స్మరించినంత మాత్రాన సాక్షాత్కరించే దయాసింధువు దత్తాత్రేయుడు మనకు లభించడం మన అదృష్టమే. కనుక ఎల్లవేళలా దత్తాత్రేయుని ధ్యానించుకుందాం.

 

దత్తాత్రేయుడు విశ్వమంతా పరచుకుని ఉన్నాడు. ఆయన గుప్తంగా దాగివుంటాడు. తనను కొలిచే వారిని కనిపెట్టుకుని ఉంటాడు. తన అనుగ్రహానికి పాత్రులైన వారిని గుర్తించి వరాలు ప్రసాదిస్తాడు. అంతటి కరుణామూర్తి దత్తాత్రేయుడు. అంతేనా, మనిషిలోని అసలు మనిషిని వెలికితీయగల మహిమాన్వితుడు.

 

Datta Jayanti Margashira Pournami, Dattatreya divine guru, Dattatreya son of Atri and Anasuya, Dattatreya represents trimurthi, Dattatreya and muktipatham, Dattatreya gives punya and moksha