Read more!

దత్తాత్రేయుని విశేషం, నరకపౌర్ణమి వివరం!

 

 

దత్తాత్రేయుని విశేషం, నరకపౌర్ణమి వివరం!

 

దత్తాత్రేయుడు అంటేనే జ్ఞానానికి చిహ్నం. అందుకే ఆయనని ఆదిగురువుగా కొలుచుకోవడం కూడా కద్దు. శ్రీపాద, శ్రీవల్లభ మొదలుకొని సాయిబాబా వరకూ వేర్వేరు సమయాలలో, వేర్వేరు అవతారాలలో భక్తులను ఉద్ధరించిన దత్తాత్రేయుని జయంతి ఈ రోజునే! ఈ సందర్భంగా ఆయన జన్మవిశేషాలు…

అనగనగా అత్రి అనే మహాముని ఉండేవారు. ఆయన భార్య పేరు అనసూయ. అనసూయాదేవి పరమసాధ్వీమణి. అలాంటి అత్రి మహాముని ఆశ్రమానికి ఓసారి నారదులవారు వేంచేశారు. అక్కడ ఆనసూయ పతిభక్తిని కళ్లారా చూసిన నారదునికి ఓ కొంటె ఆలోచన వచ్చింది. నేరుగా వైకుంఠానికి చేరి ‘అనసూయాదేవి ఈ ప్రపంచంలోనే పరమసాధ్వీమణి’ అని లక్ష్మీదేవికి వార్తని చేరవేశాడు. పనిలో పనిగా సరస్వతీ, పార్వతీ దేవిలకు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. భూలోకంలో జీవించే ఒక సాధారణ గృహిణి తమకంటే గొప్ప పతివ్రత అని తేలడంలో వారి దుగ్థకు అంతులేకుండా పోయింది.

 



త్రిమూర్తులైన తమ తమ భర్తల వద్దకు చేరి ఎలాగైనే ఆనసూయాదేవి పాతివ్రత్యాన్ని భంగపరచమని కోరుకున్నారు ముగురమ్మలూ. తమ భార్యల కోరిక విడ్డూరంగా ఉన్నప్పటికీ, జరగబోయే లోకకళ్యాణాన్ని గ్రహించినవారై, వారు అత్రిమహాముని ఆశ్రమానికి సన్యాసుల రూపంలో చేరుకున్నారు. భిక్షాటన కోసం వచ్చిన ఆ సన్యాసులను చూసిన అనసూయాదేవి వారికి సకల మర్యాదలూ చేసేందుకు సిద్ధపడింది. కానీ సన్యాసులు కోరిక వేరే విధంగా ఉంది. తమ ఆకలిని నగ్నంగా తీర్చాలన్న షరతుని పెట్టారు ఆ త్రిమూర్తులు. ఆ మాటలకు ఆనసూయామాత ఒక్క క్షణం నివ్వెరపోయినా వెంటనే వచ్చినవారు ఎవరో గ్రహించగలిగింది. తన మహిమతో ఆ ముగ్గురినీ పసిపాపలుగా మార్చివేసింది. పిదప వారికి తన స్తన్యమిచ్చి ఆకలినీ తీర్చింది. అవతల వేళ గడిచిపోతోంది. తమ భర్తల కోసం ముగురమ్మలూ ఎదురుచూస్తున్నారు. చివరికి నారదుని ద్వారా జరిగిన విషయం తెలుసుకుని వారు కూడా అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ చూస్తే ఏముంది... త్రిమూర్తులు కాస్తా పసిపిల్లలుగా మారి కేరింతలు కొడుతున్నారు.

జరిగినదంతా అనసూయాదేవికి చెప్పి పతిభిక్షని ప్రసాదించమని వేడుకున్నారు వారంతా. దాంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ కూడా ఒక్కటై తనకి పుడితే తప్పకుండా వారిని తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకువస్తానని షరతుని ఉంచింది అనసూయ. అలా వారు ముగ్గురూ దత్తాత్రేయుని అవతారంగా అనసూయ మాత ఇంట మళ్లీ జన్మించారు. అత్రి మహామునికి జన్మించాడు కాబట్టి ఆయన దత్తాత్రేయుడు అయ్యాడు. శివేకేశవులు ఇరువురూ ఒక్కరే అనీ, క్లిష్టమైన ఆధ్మాత్రిక రహస్యాలు సామాన్యులు సైతం గ్రహించగలరనీ చెప్పడం, దత్తాత్రేయుల వారి అవతారంలో గొప్ప విశేషంగా తోస్తుంది.

దత్తాత్రేయుల అవతారం ఈనాటిది కాదు. మహాభారతం సైతం దత్తాత్రేయుని ఒక గొప్ప మునిగా పేర్కొంటుంది. దత్తాత్రేయునికీ పరశురామునికీ మధ్య జరిగిన సంవాదాన్ని ‘త్రిపుర రహస్యం’గానూ, ఆయన తన శిష్యులకు చేసిన బోధను ‘అవధూత గీత’గానూ ప్రచారం పొందాయి. క్లిష్టమైన ఆధ్యాత్మిక రహస్యాలెన్నో ఈ గ్రంథాలలో ఉన్నాయంటారు పండితులు. అందుకనే వివేకానందులవారు అవధూతగీతనీ, రమణ మహర్షులు త్రిపురరహస్యాన్నీ ఎంతగానో ఇష్టపడేవారు. దత్తాత్రేయ జయంతి రోజున కేవలం దత్తాత్రేయునికి మాత్రమే కాకుండా, గురుచరిత్ర పరంపరలో ఆయన అవతారాలుగా భావింపబడేవారందరినీ కూడా భక్తిశ్రద్ధలతో కొలుచుకుంటారు.

 



మార్గశిర పౌర్ణమిని దత్తజయంతిగానే కాదు, నరకపౌర్ణమిగా కూడా భావిస్తారు. దీని వెనుక శాస్త్రీయమైన కారణం లేకపోలేదు. కార్తీక పౌర్ణమి మొదలుకొని మార్గశిర పౌర్ణమి వరకు ఉన్న 30 రోజులను యమదంష్ట్రలు అంటారు. దంష్ట్రలు అంటే కోరలు అని అర్థం. యముడు ఈ రోజులలో తన కోరలను చాచుకుని మన జీవితాలని హరించేందుకు ఎదురుచూస్తూ ఉంటాడట. చలి తీవ్రంగా ఉండే ఈ రోజులను యముడి కోరలతో పోల్చడం సబబుగానే తోస్తుంది. వాతావరణంలో విపరీతమైన చలి వల్ల మన శరీరాలలో కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు తలెత్తుతాయి. ఇంతేకాదు, చలికాలంలో మన రక్తనాళాలు కుంచించుకుపోయి గుండెపోటు తీవ్రతను పెంచుతాయి. మార్గశిరపౌర్ణమినాటితో ఈ యమదంష్ట్రలు ముగిసిపోతాయట. ఈనాటికి చలి స్థిరపడటంతో పాటు, దానికి మన శరీరం కూడా నిదానంగా అలవాటు పడుతుంది. యముడు తన కోరలను విరమించుకునే ఈ పుణ్యదినాన ఈ నెల రోజులూ మనల్ని చల్లగా చూసుకున్నందుకు ఆ యమధర్మరాజునీ; అకాల మృత్యువుని హరించి, శాశ్వతమైన జ్ఞానాన్నీ ప్రసాదించే ఆ దత్తాత్రేయుల వారినీ మనస్ఫూర్తిగా తలచుకుందాము.

 

- నిర్జర.